'సాయుధ పోరాటాన్ని విరమిస్తాము.. కానీ సమయం కావాలి'

ఆయుధాలను వీడి, సాయుధ పోరాటం నుంచి తాత్కాలికంగా తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)కు చెందిన ఎంఎంసి జోనల్​ కమిటీ ప్రతినిధి అనంత్ వెల్లడించారు. ఈ మేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్ర సీఎంలకు లేఖ రాశారు.

Published on: Nov 24, 2025, 10:00:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంతో పాటు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేసిన తర్వాత, ఆయుధాలను త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)కు చెందిన మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-చత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ (ఎంఎంసి జోన్) ప్రతినిధి అనంత్. ఆయుధాలు వీడాలన్న తమ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా నిర్ణయానికి మద్దతిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో వెల్లడించారు.

సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ..
సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ..

“ఆయుధాలు పక్కన పెట్టాలన్న నిర్ణయానికి మేము మద్దతు ఇస్తున్నాము. సీసీఎం సతీష్ దాదా తర్వాత, మరొక సీసీఎం కామ్రేడ్ చంద్రన్న (సరెండర్) ఇటీవల ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. మేము, ఎంసీసీ స్పెషల్ జోనల్ కమిటీ కూడా ఆయుధాలను విడిచిపెట్టి, ప్రభుత్వ పునరావాసం, నూతన మార్గం ప్రణాళికను అంగీకరించాలనుకుంటున్నాము,” అని అనంత్​ లేఖలో పేర్కొన్నారు.

అయితే, మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు కాస్త సమయం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

“3 రాష్ట్రాల ప్రభుత్వాలు మాకు సమయం ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. మా పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉన్నందున, మేము సమిష్టిగా ఈ నిర్ణయానికి రావడానికి కొంత సమయం పడుతుంది. మా సహచరులను సంప్రదించి, మా పద్దతి ప్రకారం వారికి ఈ సందేశాన్ని తెలియజేయడానికి మాకు సమయం కావాలి. కాబట్టి, మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిబ్రవరి 15, 2026 వరకు మాకు సమయం ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. నన్ను నమ్మండి, ఇంత సమయం అడగడం వెనుక ఎటువంటి నిగూఢ ఉద్దేశం లేదు. ఒకరితో ఒకరు త్వరగా సంభాషించడానికి మాకు వేరే సులభమైన మార్గాలు లేవు కాబట్టి ఇది చాలా సమయం పడుతుంది. ఇది కొంచెం ఎక్కువ అని మాకు తెలుసు, కానీ ఇది మావోయిజాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం విధించిన గడువులోపు (మార్చి 31, 2026). అప్పటి వరకు, మూడు రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించాలని, వారి భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని మేము కోరుతున్నాము,” అని అనంతర్​ వివరించారు.

మరోవైపు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంతమంది ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులతో సమావేశమయ్యే అవకాశాన్ని తమకు ఇవ్వాలని అనంత్​ అభ్యర్థించారు.

“తద్వారా మేము మా ఆయుధాలను విడిచిపెట్టడానికి, ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించడానికి ఒక నిర్దిష్ట తేదీని సమిష్టిగా ప్రకటించగలము. అయితే, ఆ తేదీ వరకు భద్రతా దళాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రభుత్వం ఈ ప్రక్రియకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఈ పిటిషన్ జారీ చేసిన తర్వాత, మేము ప్రభుత్వ ప్రతిస్పందన కోసం వేచి ఉంటాము. వారు మా ప్రకటన, వారి ప్రతిస్పందనను రాబోయే కొన్ని రోజులు, సాయంత్రం ప్రాంతీయ వార్తా ప్రసారానికి ముందు రేడియోలో ప్రసారం చేస్తే మంచిది, తద్వారా అది వీలైనంత త్వరగా మా సహచరులకు చేరుతుంది,” అని అన్నారు.

“దీని తరువాత, మేము మరొక పత్రికా ప్రకటనను విడుదల చేసి, మా ఆయుధ విరమణని తేదీని ప్రకటిస్తాము,” అని ఆయన స్పష్టం చేశారు.

“ప్రజా స్ఫూర్తిగల ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు, యూట్యూబర్లు మాకు- ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం వహించాలని, మా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడం గురించి ప్రభుత్వంతో మాట్లాడాలని కూడా మేము అభ్యర్థిస్తున్నాము. అంతేకాకుండా, వారు ఈ వార్తను వారి యూట్యూబ్ ఛానెల్‌ల్లో కూడా కవర్ చేయాలి. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో వారు పోషించిన పాత్రను ఎంఎంసీ జోన్‌లో కూడా వారు పోషించాలని మేము కోరుకుంటున్నాము,” అని మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ప్రతినిధి అయిన అనంతరం విజ్ఞప్తి చేశారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More