Credit card : క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లు ఎక్స్పైర్ అవుతున్నాయా? ఈ తప్పు అస్సలు చేయకండి!
పండుగ వేళ క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లు ఎక్స్పైర్ అవుతున్నాయని కంగారులో అనవసరంగా షాపింగ్ చేస్తున్నారా? పాయింట్ల కోసం చేసే ఖర్చులు మీ బడ్జెట్‌ను ఎలా దెబ్బతీస్తాయో, నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
పండుగ సీజన్ వచ్చిందంటే చాలు ఈ-కామర్స్ సైట్లలో ఆఫర్ల జాతర మొదలవుతుంది. ఈ సమయంలో చాలామంది క్రెడిట్ కార్డులు ఉపయోగించి షాపింగ్ చేయడం, ప్రయాణ టికెట్లు బుక్ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. దీనివల్ల క్రెడిట్ కార్డుల్లో పెద్ద ఎత్తున రివార్డ్ పాయింట్లు జమ అవుతుంటాయి. అయితే, వీటిలో చాలా పాయింట్లకు కాలపరిమితి (ఎక్స్పైరీ డేట్) ఉంటుంది. గడువు ముగిసే సమయానికి ఆ పాయింట్లను ఎలాగైనా వాడేయాలనే తొందరలో చాలామంది అవసరం లేకపోయినా ఏదో ఒకటి కొనేస్తుంటారు! కానీ రివార్డ్ పాయింట్లను కాపాడుకోవడానికి బడ్జెట్ మించి ఖర్చు చేయడం ఆర్థికంగా శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రివార్డ్ పాయింట్ల కోసం అనవసర ఖర్చులు తగునా?
క్రెడిట్ కార్డు పాయింట్లు ఎక్స్పైర్ అయిపోతాయనే భయం కస్టమర్లలో ఎక్కువగా ఉంటుంది. ఈ భయంతో అసలు అవసరమే లేని వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేస్తుంటారు. ఫలితంగా, పాయింట్ల ద్వారా వచ్చే చిన్న మొత్తపు లాభం కంటే, కార్డు బిల్లు రూపంలో చెల్లించే అదనపు భారం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కార్డుపై బకాయిలు పెరిగిపోవడం, సమయానికి బిల్లులు చెల్లించలేక క్రెడిట్ స్కోర్ దెబ్బతినడం వంటి సమస్యలు కొని తెచ్చుకున్నట్లవుతుంది.
"క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లు అనేది తెలివైన ఖర్చులను ప్రోత్సహించడానికి ఉండాలి తప్ప అనవసర కొనుగోళ్లకు మార్గంగా మారకూడదు. వినియోగదారులు తమ పాయింట్ల అసలు విలువ ఎంత, వాటిని దేనికి రీడీమ్ చేసుకోవచ్చు, గడువు ఎప్పుడు ముగుస్తుందో ముందే అంచనా వేయాలి. పాయింట్లను రీడీమ్ చేసుకోవడానికి పరిమితికి మించి ఖర్చు చేయాల్సి వస్తే, ఆ పాయింట్లను వదులుకోవడమే బడ్జెట్‌కు మంచిది," అని లెండింగ్ప్లేట్ ఫౌండర్, సీఈఓ కౌశిక్ ఛటర్జీ అభిప్రాయపడ్డారు.
విలువను సరిపోల్చుకోవడం ముఖ్యం..
కార్డు కంపెనీలు అందించే ప్రతి రివార్డ్ పాయింట్ విలువ ఒకేలా ఉండదు. కొన్ని కార్డులలో పాయింట్లను క్యాష్‌బ్యాక్ లేదా బిల్లు క్రెడిట్ రూపంలో వాడుకునే వెసులుబాటు ఉంటుంది. మరికొన్నింటిలో కేవలం వోచర్లు లేదా నిర్దిష్ట ఉత్పత్తుల కొనుగోలుపై మాత్రమే పరిమితులు ఉంటాయి. అదనపు ఖర్చు ఏమీ లేకుండా, మీరు సాధారణంగా కొనే నిత్యావసరాలు లేదా వోచర్ల రూపంలో పాయింట్లు రీడీమ్ అవుతుంటే కచ్చితంగా వాడుకోవాలి.
"సరిగ్గా ఉపయోగిస్తే రివార్డ్ పాయింట్లు డబ్బును ఆదా చేస్తాయి. కానీ వాటి వెంటే పడితే అనవసర ఖర్చులకు దారితీస్తాయి. పాయింట్లను పోగొట్టుకోకూడదనే భయంతో కాకుండా, ఆ కొనుగోలు మీ బడ్జెట్‌కు, నిజమైన అవసరానికి సరిపోతుందో లేదో ఆలోచించాలి," అని భారత్లోన్ బిజినెస్ హెడ్ శక్తి శెకావత్ సూచించారు.
సమర్థవంతమైన వ్యూహం ఏంటి?
క్రెడిట్ కార్డులు అందించే యాడ్-ఆన్ సేవలు, ఆఫర్లు, రివార్డులు మన ఆర్థిక ప్రయోజనానికి ఉపయోగపడాలి తప్ప, మన ఖర్చు చేసే అలవాట్లను నియంత్రించకూడదు. పండుగల వేళ మీ ప్లాన్ ప్రకారం చేసే ఖర్చులకు మాత్రమే రివార్డ్ పాయింట్లను అనుసంధానించండి. అదనపు అప్పులు చేసి, మీ బడ్జెట్‌ను ఇబ్బందుల్లో నెట్టే కంటే కొన్ని పాయింట్లను ఎక్స్పైర్ కానివ్వడమే ఆర్థికంగా తెలివైన నిర్ణయం.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. క్రెడిట్ కార్డు వినియోగం రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


