...
...
Next Story

దేశ నిర్మాణానికి సీఎస్‌ఆర్ ఒక శక్తిగా మారాలి: సద్గురు శ్రీ మధుసూదన సాయి

కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కేవలం చట్టబద్ధమైన విధి కాదని, దేశ నిర్మాణానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన సాధనంగా మారాలని 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్' వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన సాయి పిలుపునిచ్చారు. ముద్దేనహళ్లిలో జరిగిన సీఎస్‌ఆర్ సదస్సు-2026 ముగింపు వేడుకల్లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

Published on: Jul 18, 2026 08:00 AM IST
Advertisement

చిక్కబళ్లాపూర్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) అనేది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, దేశ పురోగతికి బాటలు వేసేలా ఉండాలని 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్' వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన సాయి ఆకాంక్షించారు. సమాజ శ్రేయస్సు కోసం కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

సీఎస్ఆర్ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ప్రముఖులు
సీఎస్ఆర్ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ప్రముఖులు

ముద్దేనహళ్లిలోని సత్యసాయి గ్రామంలో రెండు రోజుల పాటు జరిగిన 'సీఎస్‌ఆర్ సదస్సు-2026' ముగింపు వేడుకల్లో గురువారం ఆయన అనుగ్రహ భాషణం చేశారు. భారతీయ నాగరికత ఎప్పుడూ ప్రేమ, సేవ, మానవీయ విలువలపైనే ఆధారపడి ఉందన్నారు. ఈ విలువలను రాబోయే తరాలకు అందించడానికి ప్రభుత్వం, పరిశ్రమలు, కార్పొరేట్ రంగాలు, సమాజం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక పునాది ఉన్న భారతదేశంలో పారదర్శకత, ఉత్తమ పాలనతో సీఎస్‌ఆర్ నిధులను ఖర్చు చేసినప్పుడే సమాజంలో శాశ్వత మార్పు వస్తుందని వివరించారు.

భగవద్గీత సూత్రాలతో కార్పొరేట్ గవర్నెన్స్

భగవద్గీతలోని యజ్ఞం, దానం, తపస్సు అనే సూత్రాలను కార్పొరేట్ పాలనకు అన్వయిస్తూ సద్గురు కీలక విశ్లేషణ చేశారు. యజ్ఞం అంటే ఉత్పాదకత అని, దానం అంటే సమాజ సేవ అని, తపస్సు అంటే ఉత్తమ పాలనకు (Good Governance) ప్రతీక అని పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు ఈ విలువలను అలవర్చుకున్నప్పుడు వ్యాపారంతో పాటు సేవ కూడా విజయవంతమవుతుందన్నారు.

'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్' వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన సాయి

"పిల్లల కోసం చేసే ఖర్చు కేవలం వ్యయం కాదు, అది దేశ భవిష్యత్తుపై పెట్టే అత్యంత విలువైన పెట్టుబడి" అని సద్గురు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

2047 కంటే ముందే 'వికసిత భారత్'

ప్రధానమంత్రి జాతీయ నైపుణ్యాభివృద్ధి మండలి మాజీ సలహాదారు ఎస్. రామదొరై మాట్లాడుతూ, సద్గురు దూరదృష్టి ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. విద్య, వైద్యం, పౌష్టికాహార సేవల ద్వారా దేశ సుస్థిర అభివృద్ధికి ఈ సంస్థ ఎనలేని కృషి చేస్తోందని కొనియాడారు. సెబీ మాజీ ఛైర్మన్ ఎం. దామోదరన్, సంపర్క్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వినీత్ నాయర్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ ఛైర్మన్ డాక్టర్ ఎస్. రవి, 'ది హిందూ బిజినెస్ లైన్' ఎడిటర్ రఘువీర్ శ్రీనివాసన్ ఈ సదస్సులో మాట్లాడారు. వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ చేస్తున్న సేవలను అభినందిస్తూ, ఇలాంటి సేవా సంస్థలకు కార్పొరేట్ రంగం నుంచి మరింత సీఎస్‌ఆర్ మద్దతు లభించాలని అభిప్రాయపడ్డారు.

'వికసిత భారత్ కోసం సీఎస్‌ఆర్' శ్వేతపత్రం విడుదల

రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో సీఎస్‌ఆర్ నిధుల సమర్థవంతమైన వినియోగం, సామాజిక ప్రభావం, ప్రవాస భారతీయుల పాత్ర వంటి అంశాలపై నాలుగు సాంకేతిక సెషన్లు నిర్వహించారు. ఇదే వేదికపై 'వికసిత భారత్ కోసం సీఎస్‌ఆర్' అనే శ్వేతపత్రాన్ని (White Paper) విడుదల చేశారు. సమాజ సేవలో విశేష కృషి చేసిన టాటా హిటాచీ కన్‌స్ట్రక్షన్ మెషినరీ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ సింగ్‌కు 'వికసిత భారత్' పురస్కారాన్ని అందజేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శైలేష్ తివారీతో పాటు పలువురు ప్రతిభావంతులకు సీఎస్‌ఆర్ పురస్కారాలను అందజేసి సత్కరించారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe