డీఏ పెరిగింది.. హెచ్‌ఆర్‌ఏ కూడా పెరుగుతుందా?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని 3 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జులై 1, 2026 నుంచి వర్తించే ఈ పెంపుతో డీఏ 63 శాతానికి చేరింది. అయితే ఈ నిర్ణయంతో ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) పెరుగుతుందా లేదా అనే అంశంపై స్పష్టమైన వివరాలు ఇవే.

Published on: Oct 30, 2026, 20:02:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర కేబినెట్ తీపి కబురు అందించింది. కరువు భత్యం (డీఏ), కరువు ఉపశమనం (డీఆర్)లను 3 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 48.54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.71 లక్షల మంది పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది.

డీఏ పెరిగింది.. హెచ్‌ఆర్‌ఏ కూడా పెరుగుతుందా?
డీఏ పెరిగింది.. హెచ్‌ఆర్‌ఏ కూడా పెరుగుతుందా?

ప్రస్తుతం 60 శాతంగా ఉన్న డీఏ ఈ తాజా పెంపుతో 63 శాతానికి చేరుకుంది. ఉద్యోగుల ప్రాథమిక వేతనం (బేసిక్ పే) ఆధారంగా ఈ పెరిగిన అలవెన్స్ వారి నెలవారీ జీతాల్లో తోడవుతుంది. బేసిక్ పే ఎక్కువగా ఉన్న వారికి లబ్ధి కూడా అదే స్థాయిలో ఉంటుంది.

పెరిగిన డీఏతో చేతికి ఎంత ఎక్కువ వస్తుందంటే..

తాజా సవరణ ప్రకారం బేసిక్ పే రూ.18,000 ఉన్న ఉద్యోగికి నెలకు అదనంగా రూ.540 లభిస్తుంది. అదే బేసిక్ పే రూ.50,000 ఉన్న ఉద్యోగికి నెలకు రూ.1,500 అదనపు ఆదాయం అందుతుంది.

ఈ పెరిగిన డీఏ జులై 1, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. సాధారణంగా ప్రతీ ఏటా జులైకి సంబంధించిన డీఏ పెంపును ప్రభుత్వం అక్టోబర్ నెలలో ప్రకటిస్తుంది. దీంతో ఉద్యోగులకు జులై నుంచి అక్టోబర్ వరకు అంటే నాలుగు నెలల బకాయిలు (అరియర్స్) ఒకేసారి అందుతాయి. ఉదాహరణకు రూ.18,000 మూల వేతనం ఉన్న ఉద్యోగికి నెలకు రూ.540 చొప్పున నాలుగు నెలలకు కలిపి మొత్తం రూ.2,160 అరియర్స్‌గా వస్తాయి.

హెచ్‌ఆర్‌ఏ పెరుగుతుందా?

ప్రస్తుతం డీఏ 3 శాతం పెరిగినప్పటికీ, దానివల్ల ఉద్యోగుల ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)లో ఎలాంటి మార్పు ఉండదు. జీతంలో డీఏ, హెచ్‌ఆర్‌ఏ రెండూ వేర్వేరు భాగాలు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయాల నుంచి ఉపశమనం ఇచ్చేందుకు డీఏ ఇస్తే, నివాస ఖర్చుల కోసం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం డీఏ, హెచ్‌ఆర్‌ఏ రెండింటినీ మూల వేతనం ఆధారంగానే లెక్కిస్తారు. అయితే డీఏను ఏడాదికి రెండుసార్లు సవరిస్తే, హెచ్‌ఆర్‌ఏ రేట్లు మాత్రం ఉద్యోగి పనిచేసే నగరం (ఎక్స్, వై, జెడ్ కేటగిరీలు) ఆధారంగా మారుతుంటాయి.

హెచ్‌ఆర్‌ఏ పెరగడానికి కొన్ని నిర్దిష్ట పరిమితులు ఉన్నాయి. డీఏ 25 శాతం దాటినప్పుడు ఎక్స్, వై, జెడ్ కేటగిరీ నగరాలకు హెచ్‌ఆర్‌ఏను వరుసగా 27%, 18%, 9% శాతానికి పెంచారు. ఆ తర్వాత జనవరి 2024లో డీఏ 50 శాతం దాటడంతో హెచ్‌ఆర్‌ఏ రేట్లను 30%, 20%, 10% శాతానికి సవరించారు. ప్రస్తుతం డీఏ 60 శాతం నుంచి 63 శాతానికి మాత్రమే పెరిగినందున, హెచ్‌ఆర్‌ఏ పెంపునకు సంబంధించి తదుపరి పరిమితి ఏదీ దాటలేదు. కాబట్టి ఈసారి హెచ్‌ఆర్‌ఏలో మార్పు ఉండదు.

డీఏ, హెచ్‌ఆర్‌ఏ మధ్య ప్రధాన తేడాలు ఇవే

పరిధి: డీఏ, డీఆర్‌లు కేవలం ప్రభుత్వ రంగ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మాత్రమే లభిస్తాయి. కానీ హెచ్‌ఆర్‌ఏ ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది.

పన్ను నిబంధనలు: డీఏ, డీఆర్‌ల ద్వారా వచ్చే మొత్తంపై వ్యక్తిగత ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్ ప్రకారం పూర్తి స్థాయిలో పన్ను పడుతుంది. కానీ హెచ్‌ఆర్‌ఏకి ఆదాయపు పన్ను చట్టం కింద పాక్షికంగా లేదా పూర్తిగా పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More