Artificial Intelligence : ‘ఇంక చాలు.. కృత్రిమ మేధకు బ్రేకులు వేద్దాము'- ఏఐ దిగ్గజాల ఊహించని నిర్ణయం!
కృత్రిమ మేధ అభివృద్ధి వేగాన్ని కాస్త తగ్గించాల్సిన అవసరం ఉందంటూ ప్రపంచ సాంకేతిక దిగ్గజాలు సంచలన ప్రకటన చేశారు. ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడై చేసిన విజ్ఞప్తికి ఓపెన్ ఏఐ అధినేత సామ్ ఆల్ట్‌మాన్, ఎక్స్ఐఏఐ అధిపతి ఎలాన్ మస్క్ ఏకీభవించారు. దీని వేనుక కొన్ని షాకింగ్ కారణాలు ఉన్నాయి.
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్న అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడ్డారు! మానవాళికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి వేగాన్ని కాస్త తగ్గించాలంటూ ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడై చేసిన విజ్ఞప్తి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఎవరు ఊహించని విధంగా ఈ ప్రకటనకు ఓపెన్ ఏఐ సారథి సామ్ ఆల్ట్‌మాన్, ఎక్స్ఐఏఐ అధినేత ఎలాన్ మస్క్ పూర్తి మద్దతు తెలిపారు. పోటీ ప్రపంచంలో శత్రువులుగా భావించే ఈ ముగ్గురు పారిశ్రామికవేత్తలు ఒకే వేదికపైకి వచ్చి 'ఏఐకి బ్రేకులు వేయాలి' అని అభిప్రాయపడటం ఇప్పుడు ఐటీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కంట్రోల్ తప్పుతున్న ఏఐ మోడళ్లు!
డారియో అమోడై తన వ్యక్తిగత వ్యాసంలో రాసిన వివరాలు ఏఐ సృష్టిస్తున్న ప్రమాదాలను ఎత్తిచూపాయి. ఏఐ మోడళ్లు తమకు తామే స్వయంగా మెరుగుపరుచుకునే ‘రికర్సివ్ సెల్ఫ్-ఇంప్రూవ్‌మెంట్’ సామర్థ్యాన్ని సాధించడమే అసలు సమస్యగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత జులైలో ఓపెన్ ఏఐకి చెందిన కొన్ని ఏఐ ఏజెంట్లు టెస్టింగ్ వాతావరణం నుంచి బయటపడి, హగ్గింగ్ ఫేస్ అనే కోడింగ్ ప్లాట్‌ఫామ్‌పై సైబర్ దాడులు చేసిన ఉదంతాన్ని ఆయన ఉదాహరించారు.
"ఏఐ ఏజెంట్లు ఒక సమూహంగా ఏర్పడి తమకు కేటాయించని లక్ష్యాలపై సైబర్ దాడులకు పాల్పడ్డాయి. రాబోయే 6 నుంచి 12 నెలల్లో ఈ రకమైన ఏఐ వ్యవస్థలు ఏకంగా ఇంటర్నెట్ మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రమాదం ఉంది," అని డారియో అమోడై హెచ్చరించారు. దీనివల్ల వందల బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లుతుందని అంచనా వేశారు.
మానవాళి ప్రాణాలతో చెలగాటం!
ఈ వివాదం వెనుక పరిశోధకుల రాజీనామాలు కూడా ప్రధాన కారణమయ్యాయి. ఓపెన్ ఏఐని వీడి ఆంథ్రోపిక్‌లో చేరిన ప్రముఖ ఏఐ పరిశోధకుడు జాకోబ్ కాక్సన్ ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. "అగ్రగామి టెక్ కంపెనీలు మానవాళి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి," అని ఆయన తీవ్రంగా విమర్శించారు. మానవ మేధస్సును మించిపోయే 'సూపర్ ఇంటెలిజెన్స్' వ్యవస్థలు మానవుల నియంత్రణ తప్పుతాయని ఆయన హెచ్చరించారు.
ఈ నేపథ్యంలోనే డారియో అమోడై వ్యాసానికి ఓపెన్ ఏఐ అధినేత సామ్ ఆల్ట్‌మాన్ వెంటనే స్పందించారు. "ఏఐ అభివృద్ధి వేగాన్ని నియంత్రించాలన్న డారియో అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను," అని సామ్ ఆల్ట్‌మాన్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. తమ కంపెనీ పరిధిలోకి స్వతంత్ర మూల్యాంకన బృందాలకు (థర్డ్ పార్టీ ఇవాల్యుయేటర్స్) అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.
ఇక ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కూడా "డారియో చెప్పింది నిజం," అని ట్వీట్ చేశారు.
ఐటీ రంగానికి హెచ్చరిక..
హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రముఖ ఐటీ హబ్‌లలో పనిచేస్తున్న లక్షలాది మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ పరిణామాలు ప్రత్యక్ష సంకేతంగా నిలుస్తున్నాయి. ఏఐ వ్యవస్థలు వేగంగా సైబర్ దాడులకు పాల్పడటం లేదా ఇంటర్నెట్ భద్రతను ప్రమాదంలో పడేయడం వల్ల డేటా సెక్యూరిటీ, ఐటీ మౌలిక వసతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది.
టెక్ దిగ్గజాలే స్వయంగా ఏఐ వేగాన్ని తగ్గించాలని కోరుతుండటంతో రాబోయే రోజుల్లో ఏఐ నియంత్రణ చట్టాలు కఠినతరం కావడం ఖాయంగా కనిపిస్తోంది.
అమెరికా ప్రభుత్వం ఏఐ నమూనాల విడుదలపై స్వచ్ఛంద పరిశీలన ప్రక్రియను ప్రారంభించినప్పటికీ, డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం నిబంధనలను సడలించే ధోరణిలోనే ఉండటం వల్ల పరిశ్రమలో స్వయం నియంత్రణే ఏకైక మార్గంగా మారుతోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


