Muse AI : మెటా కొత్త ఏఐ ఏజెంట్- మీ కోసం షాపింగ్ చేస్తుంది, టికెట్లు బుక్ చేస్తుంది! పేమెంట్స్ కూడా..

మెటా సంస్థ 'మ్యూజ్' పేరుతో అత్యంత శక్తివంతమైన పర్సనల్ ఏఐ ఏజెంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. వాట్సాప్ లేదా ప్రత్యేక యాప్ ద్వారా మీ దైనందిన పనులను, షాపింగ్, ట్రావెల్ బుకింగ్స్‌ను ఇది సొంతంగా పూర్తి చేయగలదు. వివరాలు మీకోసం.

Published on: Sep 9, 2026, 05:27:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచ టెక్ దిగ్గజం 'మెటా'.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో మరొక విప్లవాత్మక ముందడుగు వేసింది!. కేవలం ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికే పరిమితం కాకుండా, వినియోగదారుల లక్ష్యాలకు అనుగుణంగా స్వయంగా పనులను పూర్తి చేసే “మ్యూజ్” అనే పర్సనల్ ఏఐ ఏజెంట్‌ను ఆవిష్కరించింది. మన దైనందిన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న పనుల నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టుల వరకు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడంలో ఈ ఏఐ అసిస్టెంట్ సహాయపడుతుంది.

మెటా మ్యూజ్ ఏఐ
మెటా మ్యూజ్ ఏఐ

ముఖ్యంగా ఈ మ్యూజ్ ఏఐ ఏజెంట్ ప్రత్యేక యాప్‌తో పాటు మనం నిత్యం వాడే 'వాట్సాప్' ద్వారా కూడా నేరుగా పనిచేస్తుంది. అంటే మన స్నేహితులతో చాటింగ్ చేసినట్లే మ్యూజ్‌తో మాట్లాడి పనులు పూర్తి చేయించుకోవచ్చు.

మ్యూజ్ ఏఐ ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలు ఏంటి?

మెటా అభివృద్ధి చేసిన అత్యంత సామర్థ్యమున్న ‘మ్యూజ్ స్పార్క్’ మోడల్‌పై ఇది పనిచేస్తుంది. మిగతా ఏఐ టూల్స్ లాగా దీనిని ఉపయోగించడానికి ఎలాంటి కోడింగ్ లేదా సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు.

స్వయంచాలక పనితీరు : మీరు ఒక పని అప్పగించి యాప్ క్లోజ్ చేసినా, మ్యూజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో పని చేస్తూనే ఉంటుంది. బ్రౌజర్ ఓపెన్ చేయడం, ఆన్‌లైన్ ఫారమ్‌లు నింపడం, టికెట్లు బుక్ చేయడం, మీ తరుఫున ఆన్‌లైన్‌లో బేరమాడటం వంటి పనులను ఇది సొంతంగా చేస్తుంది.

షాపింగ్, పేమెంట్స్: ఆన్‌లైన్ కొనుగోళ్లకు 'స్ట్రైప్' సౌజన్యంతో పనిచేసే 'లింక్' పేమెంట్ సిస్టమ్‌ను మ్యూజ్​ ఏఐ ఉపయోగిస్తుంది. ఇది వన్-టైమ్ యూజ్ విర్చువల్ కార్డులను జనరేట్ చేయడం వల్ల మీ ఒరిజినల్ డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలు సురక్షితంగా ఉంటాయి. వస్తువులకు నష్టం జరిగినా, ధరలు తగ్గినా రీఫండ్ పొందే ప్రొటెక్షన్ ఇందులో ఉంది.

వ్యక్తిగత అవసరాల గుర్తింపు: ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు సేవ్ చేసుకున్న ఒక రెసిపీ రీల్‌ను చూసి, దానికి కావాల్సిన సరుకుల జాబితాను తయారు చేస్తుంది. మీ స్నేహితుల ఆహార నియమాలను గుర్తుంచుకుని డిన్నర్ పార్టీ మెనూను కూడా ఆటోమేటిక్‌గా సూచిస్తుంది!

మ్యూజ్​ ఏఐ ప్రైవసీ, సెక్యూరిటీ..

పర్సనల్ ఏఐ ఏజెంట్లను వాడేటప్పుడు వినియోగదారులకు డేటా లీకేజీపై అనేక అనుమానాలు ఉంటాయి. ఈ భయాలను పోగొట్టేందుకు మెటా ‘మ్యూజ్ సెక్యూర్ వీఎం’ అనే ప్రత్యేక వర్చువల్ మెషీన్ పరిజ్ఞానాన్ని తీసుకొచ్చింది.

ప్రత్యేక క్లౌడ్ కంప్యూటింగ్: ప్రతి వినియోగదారుడి డేటా వేరొకరు ప్రాసెస్ చేయలేని ప్రత్యేకమైన వర్చువల్ ఎన్విరాన్‌మెంట్‌లో ఉంటుంది.

సెంటినెల్ ప్రొటెక్షన్: ఈ కంప్యూటర్‌లో ఉండే 'సెంటినెల్' అనే సెక్యూరిటీ సిస్టమ్, మ్యూజ్ ఏఐ చేసే ప్రతి పనిని పర్యవేక్షిస్తుంది. ఈమెయిల్ పంపడం లేదా డబ్బులు చెల్లించడం వంటి కీలక పనులకు వినియోగదారుడి అనుమతి తప్పనిసరిగా తీసుకుంటుంది.

పాస్‌వర్డ్స్ చూడలేదు: మీ పాస్‌వర్డ్‌లు లేదా బ్యాంక్ వివరాలు ఏఐకి నేరుగా కనిపించవు. ఎన్​క్రిప్టెడ్ రూపంలో మాత్రమే ఇవి స్టోర్ అవుతాయి.

యాడ్స్ ప్రాసెసింగ్ ఉండదు: మీ సంభాషణలను లేదా డేటాను మెటా ప్రకటనల కోసం ఉపయోగించదు. అలాగే మీ వివరాలను ఏఐ నేర్చుకోకుండా “మరిచిపో” (ఫర్గెట్) అని కమాండ్ ఇచ్చే వెసులుబాటు కూడా ఉంది.

ప్రస్తుతానికి ఈ సేవలు అమెరికాలో ఐఓఎస్, ఆండ్రాయిడ్, muse.ai, స్మార్ట్ గ్లాసెస్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే భారతదేశంతో పాటు మిగిలిన దేశాలకు విస్తరించనున్నారు.

ఇండియాలో అందుబాటులోకి వచ్చిన అనంతరం, ప్రతిరోజూ ఆఫీస్ పనులు, ప్రయాణాలు, బిల్లుల చెల్లింపులతో బిజీగా ఉండే భారతీయ ఐటీ ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ ఏఐ ఏజెంట్ అత్యంత కీలకమైన డిజిటల్ అసిస్టెంట్‌గా మారనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More