IT layoff : ‘లోన్ తీసుకోవాలంటే చచ్చేంత భయమేస్తోంది’- జాబ్ అనిశ్చితిపై హైదరాబాద్ టెక్కీ ఆందోళన..
Tech Layoff 2026 : ఐటీ రంగంలో నిరంతరం జరుగుతున్న లేఆఫ్‌లు, ఏఐ ముప్పు కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో అభద్రతాభావం పెరిగిపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో లోన్ తీసుకోవడానికి ఐటీ ఉద్యోగులు తీవ్రంగా భయపడుతున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.
ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగ భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్డ్ అనుకునేవారు, కానీ నేడు ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని భయాందోళనల మధ్య టెక్కీలు కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన ముత్తా నాగవంశీ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఐటీ పరిశ్రమలో నెలకొన్న ప్రస్తుత భయానక వాతావరణాన్ని అద్దం పడుతోంది. ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల ప్రస్తుత తరుణంలో కొత్తగా ఎలాంటి లోన్ తీసుకోవాలన్నా తనకు “చచ్చేంత భయంగా ఉందంటూ” అతను ఆవేదన వ్యక్తం చేశాడు.

‘లోన్ తీసుకోవాలంటేనే చచ్చేంత భయం’
“నేనొక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని. ప్రస్తుతం ఏదైనా లోన్ తీసుకోవాలంటే నాకు చాలా భయంగా ఉంది. ఐదేళ్ల క్రితం పరిస్థితి ఇలా లేదు. అప్పట్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఎడపెడా లోన్లు తీసుకునేవారు, ఎందుకంటే అప్పుడు మంచి ఉద్యోగ భద్రత ఉండేది. కానీ ఇప్పుడు.. రాబోయే ఏడాదిలో ఏం జరగబోతుందో ఎవరికీ చిన్న క్లూ కూడా లేదు. ఈ భయం, సమస్య కేవలం నా ఒక్కడికే ఉందా లేక అందరి పరిస్థితి ఇంతేనా?” అంటూ నాగవంశీ తన ఎక్స్ పోస్ట్‌లో ప్రశ్నించాడు.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు, ఇతర ఐటీ నిపుణుల నుంచి విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది తమ కామెంట్స్ ద్వారా నాగవంశీ వెలిబుచ్చిన ఆందోళనలతో ఏకీభవించారు. భవిష్యత్తులో రాబోయే ఎలాంటి చేదు వార్తకైనా సిద్ధంగా ఉండటానికి తాము ఇప్పటికే ఖర్చులను భారీగా తగ్గించుకున్నామని పలువురు ఐటీ ప్రొఫెషనల్స్ చెప్పుకొచ్చారు.
ఐటీలో లేఆఫ్స్ కలకలం..
గత ఏడాది కాలంగా ఐటీ పరిశ్రమలో మరోసారి లేఆఫ్స్ పర్వం తీవ్రంగా సాగుతోంది. కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) లో భారీగా పెట్టుబడులు పెట్టడం, ఆటోమేషన్ వైపు మొగ్గు చూపడమే ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల జీతాలు తగ్గిపోతాయని, దానితో పాత క్రెడిట్ కార్డ్ బిల్లులు, హోమ్ లోన్ ఈఎంఐలు, ఇతర అప్పులు కట్టలేక చాలా మంది తమ లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను కోల్పోవాల్సి వస్తుందని ఒక యూజర్ హెచ్చరించాడు. ఒకప్పుడు సమాజంలో ఎంతో గౌరవప్రదమైన, అత్యధిక వేతనాలు వచ్చే ఇంజనీరింగ్ కెరీర్.. ఇప్పుడు ఇంత అస్థిరంగా మారడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నిపుణుల సలహా ఇదే..
ఈ భయానక పరిస్థితుల నుంచి బయటపడటానికి నెటిజన్లు టెక్కీలకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి కొత్త లోన్లు తీసుకోకుండా, కనీసం 6 నుంచి 8 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్‌ని దాచుకోవడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. వీలైతే సొంతూళ్లకు వెళ్లి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ రూమ్ రెంట్లు, ఇతర ఖర్చులు ఆదా చేసుకోవాలని సూచిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా, ఉద్యోగం కాపాడుకోవడానికి ఐటీ ఉద్యోగులు తమ నైపుణ్యాలను నిరంతరం అప్‌గ్రేడ్ చేసుకోవాలని, ముఖ్యంగా ఏఐ ఏజెంట్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) ఎలా పనిచేస్తాయో నేర్చుకుని ‘ప్రాబ్లమ్ సాల్వింగ్’ స్కిల్స్ పెంచుకోవడం ఈ కాలంలో అత్యంత కీలకమని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


