Credit score : హోమ్ లోన్ కావాలా? మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉంటే.. తక్కువ వడ్డీకి రుణం వస్తుందో తెలుసా?

Credit score for home loan: ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తూ హోమ్ లోన్స్​ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మీ క్రెడిట్​ స్కోర్ ఎంత ఉంటే తక్కువ వడ్డీకి లోన్​ పొందొచ్చో ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి. అంతేకాదు, బ్యాంకులు లోన్ ఇచ్చే ముందు ఏం ఏం చూస్తాయో కూడా ఇక్కడ తెలియజేశాము.

Published on: May 3, 2026, 14:01:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇల్లు కొనడం అనేది ఒక వ్యక్తి జీవితంలో అతిపెద్ద ఆర్థిక నిర్ణయం! అయితే, హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు బ్యాంకులు మీ ఆదాయంతో పాటు ప్రధానంగా చూసేది మీ “క్రెడిట్ స్కోర్.” ఇది మీ అప్పు తీర్చే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఆర్బీఐ లైసెన్స్ పొందిన క్రెడిట్ సమాచార సంస్థ ‘క్రిఫ్ హై మార్క్’ నివేదిక ప్రకారం.. క్రెడిట్ స్కోర్ మీ హోమ్ లోన్ ఆమోదాన్ని మాత్రమే కాకుండా, మీకు లభించే వడ్డీ రేటును కూడా నిర్ణయిస్తుంది. మరి తక్కువ వడ్డీకి గృహ రుణం పొందాలంటే క్రెడిట్​ స్కోర్ ఎంత ఉండాలి?

హోమ్ లోన్ వడ్డీ రేటు తక్కువ ఉండాలంటే క్రెడిట్​ స్కోర్ ఎంత ఉండాలి? (Pixabay)
హోమ్ లోన్ వడ్డీ రేటు తక్కువ ఉండాలంటే క్రెడిట్​ స్కోర్ ఎంత ఉండాలి? (Pixabay)

క్రెడిట్ స్కోర్ రేంజ్: ఏ స్కోర్ ఏం చెబుతుంది?

భారతదేశంలో క్రెడిట్ స్కోర్ సాధారణంగా 300 నుంచి 900 మధ్య ఉంటుంది. మీ స్కోర్ ఎక్కడ ఉందో దాన్ని బట్టి మీ లోన్ అవకాశాలు మారుతుంటాయి:

750 కంటే ఎక్కువ (అత్యుత్తమం): మీరు బ్యాంకులకు 'తక్కువ రిస్క్' ఉన్న కస్టమర్‌గా కనిపిస్తారు. దీనివల్ల లోన్ త్వరగా ఆమోదం పొందుతుంది, తక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. బ్యాంకులతో బేరమాడే పవర్​ కూడా మీకు ఉంటుంది.

700 - 749 (మంచిది): మీకు లోన్ సులభంగానే దొరుకుతుంది, కానీ వడ్డీ రేటు అత్యుత్తమ స్కోర్ ఉన్నవారితో పోలిస్తే స్వల్పంగా ఎక్కువగా ఉండవచ్చు.

700 కంటే తక్కువ (సాధారణం/రిస్క్): ఈ స్థితిలో బ్యాంకులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం, తక్కువ లోన్ అమౌంట్ మంజూరు చేయడం లేదా మరిన్ని షరతులు విధించే అవకాశం ఉంది.

650 కంటే తక్కువ (ప్రమాదం): ఈ స్కోర్ ఉంటే లోన్ అప్లికేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఎక్కువ, లేదా భారీ వడ్డీ రేటు చెల్లించాల్సి రావచ్చు.

వడ్డీ రేటులో కేవలం 0.5% తేడా కూడా 20-30 ఏళ్ల హోమ్ లోన్ కాలవ్యవధిలో లక్షలాది రూపాయల అదనపు భారాన్ని మోపుతుందని గుర్తుపెట్టుకోవాలి.

స్కోర్ ఒక్కటే సరిపోదు.. బ్యాంకులు ఇంకేం చూస్తాయి?

కేవలం 750+ స్కోర్ ఉంటే సరిపోదు, బ్యాంకులు మీ ఆర్థిక స్థితిని మరికొంత లోతుగా పరిశీలిస్తాయి:

రీపేమెంట్ హిస్టరీ: మీరు గతంలో తీసుకున్న లోన్లు లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులు కరెక్ట్ టైమ్‌కి కట్టారా లేదా?

ప్రస్తుత ఈఎంఐలు: ఇప్పటికే మీరు ఎన్ని లోన్లు కడుతున్నారు? మీ ఆదాయంలో ఎంత భాగం అప్పులకు పోతోంది?

క్రెడిట్ యుటిలైజేషన్: క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో మీరు ఎంత శాతం వాడుతున్నారు? 30% కంటే తక్కువ వాడటం మంచిది.

ఒకవేళ మీ స్కోర్ 750 కంటే తక్కువ ఉన్నా, మీ ఆర్థిక రికార్డులు క్లీన్‌గా ఉండి స్థిరమైన ఆదాయం ఉంటే మీకు మంచి డీల్ లభించే అవకాశం ఉంటుంది.

హోమ్ లోన్ దరఖాస్తుకు ముందు స్కోర్‌ను ఎలా పెంచుకోవాలి?

ఆన్‌లైన్‌లో స్కోర్ చెక్ చేయండి: ముందుగా మీ క్రెడిట్ రిపోర్ట్‌ను తనిఖీ చేయండి. అందులో ఏదైనా తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దుకోండి.

పాత బకాయిలు చెల్లించండి: ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ బకాయిలను క్లియర్ చేయండి. ఇది మీ 'క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో'ను తగ్గించి స్కోర్ పెరిగేలా చేస్తుంది.

ఎక్కువ లోన్ల కోసం అడగకండి: తక్కువ సమయంలో ఎక్కువ బ్యాంకుల వద్ద లోన్ కోసం విచారణ చేయకండి. ఇది మీరు అప్పుల కోసం వెంపర్లాడుతున్నట్లు చూపిస్తుంది.

సకాలంలో చెల్లింపులు: ఒక్క ఈఎంఐ లేదా క్రెడిట్ కార్డ్ బిల్లు ఆలస్యమైనా మీ స్కోర్ పడిపోతుంది. కాబట్టి చెల్లింపుల విషయంలో క్రమశిక్షణగా ఉండండి.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. సిబిల్ స్కోర్ అంటే ఏంటి?

ట్రాన్స్‌యూనియన్ సిబిల్ అనేది భారతదేశంలోని ఒక ప్రముఖ క్రెడిట్ బ్యూరో. ఇది మీ లోన్ హిస్టరీ ఆధారంగా ఇచ్చే స్కోర్‌నే సాధారణంగా 'సిబిల్ స్కోర్' అని పిలుస్తారు.

2. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే హోమ్ లోన్ అస్సలు రాదా?

వస్తుంది, కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులు నిరాకరించవచ్చు. కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్​బీఎఫ్​సీలు) లోన్ ఇస్తాయి, కానీ వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి.

3. క్రెడిట్ స్కోర్ పెరగడానికి ఎంత సమయం పడుతుంది?

మీరు కరెక్ట్‌గా బకాయిలు కట్టి, క్రమశిక్షణతో ఉంటే 6 నుంచి 12 నెలల్లో స్కోర్‌లో గణనీయమైన మార్పు కనిపిస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More