...
...
Next Story

DA hike news : ఇంకా రాని డీఏ పెంపు ప్రకటన- నిరాశలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు! ఇంకెప్పుడు?

జులై 2026 విడత కరువు భత్యం (డీఏ) పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఎదురుచూస్తున్నారు. దసరా ముగిసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో దీపావళి నాటికైనా గుడ్ న్యూస్ అందుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.

Published on: Oct 22, 2026, 14:04:00 IST
Advertisement

జులై 2026కి సంబంధించిన కరువు భత్యం (డీఏ), కరువు ఉపశమనం (డీఆర్) సవరణ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దసరా పండుగకు ముందే ప్రభుత్వం నుంచి తీపి కబురు వస్తుందని ఆశించిన కోట్లాది మంది ఉద్యోగులకు నిరాశే మిగిలింది. పండుగ బోనస్ ప్రకటనలు వచ్చినా, డీఏ పెంపుపై కేంద్ర మంత్రివర్గం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అందరి దృష్టి ఇప్పుడు రాబోయే దీపావళి పండుగపైనే ఉంది.

పండుగ బోనస్ వచ్చింది.. కానీ డీఏ పెంపు ఏదీ?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు.. ఇంకెప్పుడు?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు.. ఇంకెప్పుడు?

అక్టోబర్ 14న జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో రైల్వే ఉద్యోగులకు పర్ఫార్మెన్స్ లింక్డ్ బోనస్ (పీఎల్​బీ) ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 16న ఇతర అర్హులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాన్-పర్ఫార్మెన్స్ లింక్డ్ బోనస్ ఇస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. కానీ, అత్యంత కీలకమైన డీఏ, డీఆర్ పెంపుపై మాత్రం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. అక్టోబర్ 20న దసరా పండుగ ముందు ఏదైనా ప్రకటన వస్తుందేమో అని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ఇక దసరా ముగిసి రెండు రోజులు అయినప్పటికీ, బకాయిలు లేదా పెంపు శాతానికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వెలువడలేదు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పింఛనుదారులు ఈ డీఏ పెంపుదల కోసం వేచి చూస్తున్నారు. పండుగల వేళ జీతాలు, పింఛన్లతో పాటు ఈ బకాయిలు జమయితే మార్కెట్లో కొనుగోలు శక్తి పెరిగి పండుగ సంతోషం మరింత రెట్టింపవుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

డీఏ పెంపును ఎలా లెక్కిస్తారు?

చివరిగా ఈ ఏడాది ఏప్రిల్ 18, 2026న కేంద్ర క్యాబినెట్ 2 శాతం డీఏ పెంపునకు ఆమోదం తెలిపింది. దీనితో డీఏ 58 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది. ఇది జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చింది. 7వ వేతన సంఘం సిఫార్సుల సూత్రం ప్రకారమే ఈ సవరణ జరిగింది.

ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ సూచీ గణాంకాలు..

కార్మిక శాఖ ప్రతి నెల విడుదల చేసే పారిశ్రామిక కార్మికుల అఖిల భారత వినియోగదారుల ధరల సూచీ (ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ) ఆధారంగా డీఏ పెంపును లెక్కిస్తారు. ఆగస్టు 2026కు సంబంధించిన సూచీ సంఖ్య 1.2 పాయింట్లు పెరిగి 154.4కు చేరింది. ఈ సూచీ ఆధారిత వార్షిక ద్రవ్యోల్బణం 4.96 శాతంగా నమోదైంది. గత ఏడాది ఆగస్టులో ఇది 3.16 శాతంగా ఉండేది. ఈ లెక్కల ఆధారంగా జులై విడత డీఏ పెంపుపై ఉద్యోగ సంఘాలు భారీ ఆశలే పెట్టుకున్నాయి.

గత ఐదేళ్ల ప్రకటన తేదీలు..

గత ఐదేళ్ల చరిత్రను పరిశీలిస్తే జులై విడత డీఏ ప్రకటనకు ఒక నిర్దిష్టమైన తేదీ అంటూ ఏదీ లేదు. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ మూడో వారం మధ్యలో ఈ నిర్ణయాలు తీసుకుంది:

2025: అక్టోబర్ 1న డీఏ పెంపును ప్రకటించారు.

2024: అక్టోబర్ 16న ప్రకటన వచ్చింది.

2023: అక్టోబర్ 18న కేంద్రం ఆమోదం తెలిపింది.

2022: సెప్టెంబర్ 28నే వెలువడింది.

2021: అక్టోబర్ 21న డీఏ పెంపును ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు ఎప్పుడు?

ప్రస్తుతానికి జులై 2026 డీఏ సవరణపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కేంద్ర క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసిన తర్వాతే ఎంత శాతం పెంపు ఉందో, బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత వస్తుంది. రాబోయే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై శుభవార్త వస్తుందని ఉద్యోగులు, పింఛనుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks