Delhi AQI Diwali : దీపావళి ఎఫెక్ట్- దిల్లీలో దారుణంగా వాయు కాలుష్యం.. 400 ఏక్యూఐ!

దీపావళి పండుగ వేళ దేశ రాజధాని దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాన్ని విషపూరిత పొగమంచు కమ్మేసింది. గ్రాప్ 3 ఆంక్షలు విధించినప్పటికీ గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 400 దాటడం, ప్రభుత్వ లెక్కలపై పర్యావరణవేత్తల విమర్శల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Nov 9, 2026, 05:47:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దీపావళి పండుగ వెలుగుల నడుమ దేశ రాజధాని దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతం తీవ్ర పర్యావరణ సంక్షోభంలో చిక్కుకుంది. పండుగ సంబరాల వేళ పేలిన పటాకులు, వాతావరణ మార్పుల వల్ల రాజధాని అంతటా దట్టమైన విషపూరిత పొగమంచు అలుముకుంది. దీనివల్ల విజిబిలిటీ దారుణంగా పడిపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిల్లీ వీధుల్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) పెరగడం, దానిని అదుపు చేయడంలో ప్రభుత్వాల విఫలయత్నాలపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది.

దీపావళి వేళ దిల్లీలో దారుణంగా మారిన వాయు కాలుష్యం! (REUTERS)
దీపావళి వేళ దిల్లీలో దారుణంగా మారిన వాయు కాలుష్యం! (REUTERS)

దీపావళి వేళ దిల్లీలో అది ప్రమాదకర స్థాయిలో 400 దాటడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాజధానిలోని విష వాయువులను పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గ్రాప్-3 ఆంక్షలు అమలు.. దిగజారిన గాలి నాణ్యత

పండుగ వేళ గాలి నాణ్యత దారుణంగా పడిపోతుందని ముందుగానే అంచనా వేసిన 'కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్' దిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో ముందస్తు చర్యగా 'గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్' (గ్రాప్) మూడో దశ ఆంక్షలను అమలులోకి తెచ్చింది. నిర్మాణ రంగానికి సంబంధించి కఠిన నిబంధనలు విధించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)కి చెందిన ‘సమీర్’ యాప్ గణాంకాల ప్రకారం నవంబర్ 8 రాత్రి 11:05 గంటల సమయానికి దిల్లీ మొత్తం సగటు ఏక్యూఐ 373గా నమోదై ‘అత్యంత పేలవమైన’ కేటగిరీలోకి చేరింది. పొరుగున ఉన్న నోయిడాలో 319, ఘాజియాబాద్‌లో 360, గురుగ్రామ్‌లో 280, ఫరీదాబాద్‌లో 297గా నమోదయ్యాయి.

దిల్లీలోని ఆలీపూర్, బవానా, బురారీ, చాందినీ చౌక్, ముండ్కా, పంజాబీ బాగ్, రోహిణి, వివేక్ విహార్ వంటి అనేక ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు ఏకంగా 400 దాటి ‘తీవ్రమైన’ కేటగిరీలోకి పడిపోయాయి. నవంబర్ 9 నుంచి రాబోయే కొద్ది రోజుల పాటు గాలి నాణ్యత మరింత క్షీణించి 'తీవ్రమైన' కేటగిరీలోనే కొనసాగుతుందని వాయు నాణ్యత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ (ఈడబ్ల్యూఎస్) అంచనా వేసింది. సీపీసీబీ నిబంధనల ప్రకారం 0-50 మధ్య ఏక్యూఐ ఉంటే మంచిదని, 401-500 ఉంటే అత్యంత ప్రమాదకరమని పరిగణిస్తారు.

ప్రభుత్వ డేటాపై పర్యావరణవేత్తల అనుమానాలు..

ఒకవైపు ప్రభుత్వం కాలుష్య అంకెలతో ఊరట కలిగించే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు గ్రౌండ్ రియాలిటీ దానికి భిన్నంగా ఉందని పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. నిబంధనలను కాగితాలకే పరిమితం చేసి, పటాకుల వినియోగంపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని అంటున్నారు.

"ప్రజలు కేవలం ప్రభుత్వ డాష్‌బోర్డులనే నమ్ముకోవడం లేదు. స్వయంగా తమ నివాస ప్రాంతాల్లో సొంత ఏక్యూఐ మానిటర్ల ద్వారా ప్రతిరోజూ లెక్కలు తీస్తున్నారు. ప్రభుత్వ సమీర్ యాప్ 400 అని చూపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అంతకంటే భయానకంగా ఉంది. ఒక నగరం సగటు ఏక్యూఐ ప్రతి వీధిలోని అసలు విష తీవ్రతను చాటిచెప్పలేదు," అని ప్రముఖ పర్యావరణవేత్త భవ్రీన్ కంధారీ విమర్శించారు.

పటాకుల విక్రయాలు, కాల్చే సమయాలపై ఆంక్షలు విధించినా వాటి అమలును పర్యవేక్షించడంలో యంత్రాంగం విఫలమైందని ఆమె ఆరోపించారు.

"పరిమితులు విధించామని చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి? మన పిల్లల ఊపిరితిత్తులు, పెరుగుతున్న వారి మెదడు తీవ్రమైన విష గాలికి బలవుతుంటే ఈ పరిస్థితిని సహజమైనదిగా ఎలా పరిగణిస్తాం? ఊపిరాడక ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం అంకెలతో ఊరటనిచ్చే ప్రయత్నం చేయకూడదు," అని కంధారీ నిలదీశారు.

కాలుష్య నమోదు కేంద్రాల వైఫల్యం..

కాలుష్య డేటా పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తిన కంధారీ, నవంబర్ 6న రాజధానిలోని కనీసం 11 వాయు నాణ్యత పరిశీలన కేంద్రాలు పనిచేయలేదని ఆరోపించారు. ఆ రోజు సాయంత్రం సమయంలో ఐఐటీ దిల్లీ, నాంగ్లోయ్, ఎన్‌ఎస్‌ఐటీ ద్వారకా వంటి ప్రాంతాల్లో గంటల తరబడి పీఎం2.5, పీఎం10 రీడింగ్‌లు నిలిచిపోయాయని వెల్లడించారు.

ప్రభుత్వాలు ఎంతగా కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా, దిల్లీని కమ్మేసిన దట్టమైన కాలుష్య పొగమంచు అసలు సత్యాన్ని కళ్లకు కడుతోంది. ప్రతి శీతాకాలంలో పునరావృతమయ్యే ఈ పర్యావరణ సంక్షోభానికి శాశ్వత పరిష్కారాలు చూపడంలో పాలకులు ఎందుకు విఫలమవుతున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More