...
...
Next Story

Brij Bhushan Singh : రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్​ భూషన్​కు క్లీన్ చిట్

Wrestlers sexual harassment case : ఆరుగూరు మహిళా రెజ్లర్లు నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసులో డబ్ల్యూఎఫ్​ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌లను దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.

Published on: Aug 3, 2026, 10:48:57 IST
Advertisement

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో దిల్లీ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్​, మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌లపై నమోదైన కేసులో.. వారిని నిర్దోషులుగా ప్రకటించింది రౌస్ అవెన్యూ కోర్టు.

బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్.. (ANI)
బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్.. (ANI)

విచారణ ప్రారంభమైన రెండు సంవత్సరాల తర్వాత అదనపు చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎమ్) అశ్విని పన్వార్ ఈ సంచలన తీర్పును వెలువరించారు. జులై 2న వాదనలు ముగిసిన అనంతరం తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం, తాజాగా ఈ మేరకు తుది నిర్ణయాన్ని ప్రకటించింది.

ఈ కేసులో బ్రిజ్ భూషణ్‌పై ఐపీసీ సెక్షన్లు 354 (మహిళల పట్ల ఆకతాయిగా ప్రవర్తించడం/స్త్రీ తత్వాన్ని భంగపరచడం), 354ఏ (లైంగిక వేధింపులు), 506(1) (అపరాధ బెదిరింపు) కింద అభియోగాలు నమోదు కాగా, వినోద్ తోమర్‌పై క్రిమినల్ బెదిరింపుల కింద చార్జీలు మోపారు. ఈ నేరాలకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశమున్నప్పటికీ, తగిన ఆధారాలు లేకపోవడంతో కోర్టు వారిని నిర్దోషులుగా విడుదల చేసింది.

జంతర్ మంతర్ నిరసనల నుంచి సుప్రీంకోర్టు జోక్యం వరకు..

2023 జనవరిలో దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రముఖ మహిళా రెజ్లర్లు చేపట్టిన సుదీర్ఘ పోరాటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బ్రిజ్ భూషణ్ ఏళ్ల తరబడి మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ ఆయన్ని అరెస్ట్ చేయాలని, డబ్ల్యూఎఫ్ఐ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కైసర్‌గంజ్ మాజీ ఎంపీగా ఉన్న బ్రిజ్ భూషణ్‌ను సమాఖ్య అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఆయనకు అత్యంత సన్నిహితుడైన వినోద్ తోమర్‌పై కూడా సస్పెన్షన్ వేటు పడింది.

అయితే 2023 జూన్‌లో దిల్లీ పోలీసులు సమర్పించిన క్లోజర్ నివేదిక ఆధారంగా, సదరు మైనర్ బాధితురాలు (ప్రస్తుతం మేజర్) తన ఆరోపణలను ఉపసంహరించుకోవడంతో 2024 మే నెలలో దిల్లీ కోర్టు బ్రిజ్ భూషణ్‌పై నమోదైన పోక్సో కేసును మూసివేసింది.

అనంతరం జూన్ 2023లో మిగిలిన కేసుపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయగా, మే 2024లో కోర్టు అభియోగాలు మోపింది. తమపై వచ్చిన ఆరోపణలను బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్ ఇద్దరూ తీవ్రంగా ఖండించి, విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డారు. జులై 2024లో రహస్యంగా (ఇన్-కెమెరా ప్రొసీడింగ్స్) ప్రారంభమైన ఈ కేసు విచారణలో ప్రసిద్ధ న్యాయవాది రెబెక్కా జాన్.. బాధితుల తరఫున వాదించారు. ప్రాసిక్యూషన్ మొత్తం 32 మంది సాక్షులను విచారించగా, వారిలో ఆరుగురు బాధితులతో పాటు డబ్ల్యూఎఫ్ఐ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అధికారులు ఉన్నారు.

తనను తన పదవి నుంచి తప్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు చేశారని బ్రిజ్ భూషణ్ న్యాయవాది రాజీవ్ మోహన్ వాదించారు. రెండు పక్షాల తుది వాదనలు విన్న న్యాయస్థానం.. తుది నిర్ణయాన్ని వెలువరిస్తూ బ్రిజ్ భూషణ్​తో పాటు మరొకరిని ఈ కేసు నుంచి నిర్దోషులుగా తేల్చుకూ తీర్పు ఇచ్చింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe