...
...
Next Story

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన: 850కి చేరనున్న లోక్‌సభ స్థానాలు.. దక్షిణాదికి అన్యాయమేనా?

Delimitation: లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 నుంచి ఏకంగా 850కి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పునర్విభజన ప్రక్రియ, అటు మహిళా రిజర్వేషన్ల అమలుకు, ఇటు పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం కల్పించేందుకు కీలకమని ప్రభుత్వం చెబుతుండగా.. దక్షిణాది రాష్ట్రాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Published on: Apr 15, 2026, 19:21:31 IST
Advertisement

భారత పార్లమెంటరీ చరిత్రలో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి లోక్‌సభ సీట్ల సంఖ్యను 850కి పెంచాలని ప్రతిపాదించింది. ఇందుకోసం కొత్తగా 'నియోజకవర్గాల పునర్విభజన కమిషన్'ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరగనున్న ప్రత్యేక బడ్జెట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన: 850కి చేరనున్న లోక్‌సభ స్థానాలు.. దక్షిణాదికి అన్యాయమేనా? (ANI)
Delimitation: నియోజకవర్గాల పునర్విభజన: 850కి చేరనున్న లోక్‌సభ స్థానాలు.. దక్షిణాదికి అన్యాయమేనా? (ANI)

ప్రస్తుతం దేశంలో 1971 జనాభా లెక్కల ప్రకారమే లోక్‌సభ స్థానాలు కొనసాగుతున్నాయి. గతంలో 2002లో పునర్విభజన జరిగినప్పటికీ, కేవలం నియోజకవర్గాల సరిహద్దులు మాత్రమే మారాయి తప్ప సీట్ల సంఖ్య పెరగలేదు. కానీ ఇప్పుడు 2011 జనాభా గణాంకాల ప్రకారం సీట్లను భారీగా పెంచబోతున్నారు. ఇందులో 815 స్థానాలు రాష్ట్రాలకు, 35 స్థానాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించనున్నారు.

ఉత్తరాదికి లాభం.. దక్షిణాదికి నష్టమా?

ఈ పునర్విభజనలో జనాభా ప్రాతిపదికనే ప్రాధాన్యత ఇస్తుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా 'నార్త్ వర్సెస్ సౌత్' వివాదానికి దారితీసింది. జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలకు రాజకీయంగా బలం పెరుగుతుంటే, క్రమశిక్షణతో జనాభాను తగ్గించుకున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉంది.

అంచనా ప్రకారం సీట్ల మార్పులు ఇలా ఉండొచ్చు:

  • ఉత్తరప్రదేశ్: 80 నుంచి 140కి పెరుగుదల.
  • బీహార్: 40 నుంచి 73కి పెరుగుదల.
  • రాజస్థాన్: 25 నుంచి 48కి పెరుగుదల.
  • తమిళనాడు: 39 నుంచి కేవలం 51కి మాత్రమే పెరుగుదల.
  • ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ: ఉమ్మడి 42 స్థానాల నుంచి 59కి పెరిగే అవకాశం.

దేశ జీడీపీలో 30 శాతం పైగా వాటా అందిస్తూ, అభివృద్ధిలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలను కేవలం జనాభా ప్రాతిపదికన శిక్షించడం ఎంతవరకు సమంజసమని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

విపక్షాల గళం.. రేవంత్ రెడ్డి 'హైబ్రిడ్ మోడల్'

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా, రాష్ట్రాల ఆర్థికాభివృద్ధిని, అభివృద్ధి సూచీలను పరిగణనలోకి తీసుకుని సీట్లు కేటాయించే 'హైబ్రిడ్ మోడల్' ను అనుసరించాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గితే అది సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ.. మహిళా రిజర్వేషన్ల ముసుగులో బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక పునర్విభజనను రుద్దాలని చూస్తోందని ఆరోపించారు. లెఫ్ట్ పార్టీలు సైతం ఇది భారత సమాఖ్య వ్యవస్థకు "మరణ శాసనం" లాంటిదని అభివర్ణించాయి.

ఆధిపత్యం పెరిగేలా..

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరిగేలా ఈ ప్రక్రియ సాగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. మరి విపక్షాల డిమాండ్ మేరకు కేంద్రం ఏవైనా మార్పులు చేస్తుందా లేదా అనేది పార్లమెంట్ సమావేశాల్లో తేలనుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంటే ఏమిటి?

దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం లేదా కొత్త స్థానాలను ఏర్పాటు చేయడాన్ని పునర్విభజన అంటారు. ఓటర్లందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం.

2. ఇప్పుడు పునర్విభజన ఎందుకు చేపడుతున్నారు?

ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి: ఒకటి, జనాభా భారీగా పెరగడం వల్ల నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అవసరం కావడం. రెండు, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావాలంటే పునర్విభజన ప్రక్రియ పూర్తి కావాలని చట్టం చెబుతోంది.

3. దక్షిణాది రాష్ట్రాలు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశాయి. జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తే, జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు (UP, బీహార్ వంటివి) ఎక్కువ సీట్లు వస్తాయి. ఫలితంగా కేంద్ర రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత, వాయిస్ తగ్గిపోతాయనేది ప్రధాన ఆందోళన.

4. కొత్త సీట్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి?

ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం, కొత్త పునర్విభజన కమిషన్ నివేదిక ఆధారంగా 2029 సాధారణ ఎన్నికల నాటికి కొత్త లోక్‌సభ స్థానాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

నియోజకవర్గాల పునర్విభజనతో పెరగనున్న సీట్ల అంచనాలు
 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe