...
...
Next Story

Denza D9 vs MG M9 : రెండు లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీల మధ్య బిగ్ ఫైట్- ఏది కొనాలి?

ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం బీవైడీ తన లగ్జరీ బ్రాండ్ 'డెంజా' కింద డీ9 ఎంపీవీని భారత మార్కెట్లోకి తెచ్చింది. దీనితో ఇప్పటికే విపణిలో ఉన్న ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ ఎంపీవీకి గట్టి పోటీ ఎదురవుతోంది. బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ఫీచర్లు, ధరల పరంగా ఈ రెండు విలాసవంతమైన కార్లలో ఏది మెరుగో ఇక్కడ తెలుసుకోండి.

Published on: Nov 17, 2026, 06:01:01 IST
Advertisement

భారత ఆటోమొబైల్ విపణిలో లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీల విభాగంలో ఆసక్తికరమైన పోటీ మొదలైంది. ప్రపంచ ప్రఖ్యాత ఈవీ దిగ్గజం బీవైడీ తన లగ్జరీ విభాగమైన 'డెంజా' బ్రాండ్‌ను భారత్‌కు తీసుకువచ్చింది. ఇందులో భాగంగా జెడ్9 జీటీ కారుతో పాటు అత్యంత విలాసవంతమైన ‘డెంజా డీ9’ ఎంపీవీని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. భారత విపణిలో ఎంపీవీ కార్లకు ఆదరణ వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం కియా కారెన్స్ క్లావిస్, టయోటా ఇన్నోవా హైక్రాస్, మారుతీ సుజుకీ ఇన్విక్టో, బీవైడీ ఈమ్యాక్స్ 7, విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ7, కియా కార్నివాల్, ఎంజీ ఎం9, టయోటా వెల్‌ఫైర్, లెక్సస్ ఎల్ఎం350హెచ్ వంటి అనేక మోడళ్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. అయితే పూర్తి స్థాయి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీగా వచ్చిన డెంజా డీ9, నేరుగా అదే విభాగంలో ఉన్న 'ఎంజీ ఎం9' కారుతో తలపడుతోంది.

డెంజా డీ9 వర్సెస్ ఎంజీ ఎం9..
డెంజా డీ9 వర్సెస్ ఎంజీ ఎం9..

విమానంలోని బిజినెస్ క్లాస్ తరహా అనుభూతిని రోడ్డుపై అందించే ఈ రెండు ఎలక్ట్రిక్ ఎంపీవీల్లోనూ మూడు వరుసల సీటింగ్, ఎలక్ట్రిక్ పవర్డ్ స్లైడింగ్ డోర్లు, రెండో వరుసలో ప్రీమియం కెప్టెన్ సీట్లు, అనేక సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి. అయినప్పటికీ బ్యాటరీ సామర్థ్యం, పనితీరు, కొలతలు, క్యాబిన్ హంగులు, ధరల విషయంలో వీటి మధ్య స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి.

డెంజా డీ9 వర్సెస్ ఎంజీ ఎం9- బ్యాటరీ, రేంజ్..

డెంజా డీ9 కారులో ఎల్ఎఫ్‌పీ కెమిస్ట్రీతో కూడిన 115.07 కిలోవాట్ అవర్ బీవైడీ బ్లేడ్ బ్యాటరీని అమర్చారు. ముందు యాక్సిల్‌పై అమర్చిన సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ఏకంగా 462 హెచ్‌పీ పవర్​ని, 365 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్‌ఈడీసీ ధృవీకరించిన ప్రకారం 730 కిలోమీటర్ల సుదీర్ఘ రేంజ్ అందిస్తుంది. వేగం విషయంలోనూ ఈ కారు ఆకట్టుకుంటోంది; కేవలం 8.5 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

మరోవైపు ఎంజీ ఎం9 కూడా సింగిల్-మోటార్, ఫ్రంట్-వీల్-డ్రైవ్ విధానంతో పనిచేస్తుంది. ఇందులోని మోటార్ 241.68 హెచ్‌పీ పవర్​ని, 350 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. ఏఆర్ఏఐ ధృవీకరించిన ప్రకారం ఇది 548 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అయితే ఎం9 కారు స్పీడ్​ని ఎంజీ సంస్థ అధికారికంగా వెల్లడించలేదు.

డెంజా డీ9 వర్సెస్ ఎంజీ ఎం9- డైమెన్షన్స్..

అయితే ఎత్తు విషయంలో డెంజా డీ9 ముందుంది. ఎంజీ ఎం9 ఎత్తు 1,840 మిల్లీమీటర్లు ఉంటే, డెంజా డీ9 ఎత్తు 1,900 మిల్లీమీటర్లుగా ఉంది. రెండు మోడళ్లు సంప్రదాయ భారీ ఎంపీవీ ఆకృతిని కలిగి ఉండి, రెండో, మూడో వరుస సీట్లలోకి సులభంగా వెళ్లేందుకు పవర్డ్ స్లైడింగ్ డోర్లను అందిస్తున్నాయి. రెండింటిలోనూ 2+2+3 విధానంలో ఏడుగురు కూర్చునే సీటింగ్ లేఅవుట్ ఉంది.

డెంజా డీ9 వర్సెస్ ఎంజీ ఎం9- ఇంటీరియర్, ఫీచర్లు..

డెంజా డీ9 క్యాబిన్‌లోని మూడు వరుసల సీట్లకు నాప్పా లెదర్ అప్‌హోల్‌స్టరీని అందించారు. ముందు, రెండో వరుస సీట్లను ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసుకోవచ్చు. రెండో వరుస కెప్టెన్ సీట్లకు వెంటిలేషన్, హీటింగ్, మసాజ్, మెమరీ సెట్టింగ్‌లతో పాటు పవర్డ్ ఒట్టోమన్ (కాళ్లు చాపుకునే సదుపాయం) ఫీచర్లు ఉన్నాయి. మూడో వరుస సీట్లకు కూడా నాలుగు రకాలుగా ఎలక్ట్రిక్ సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందులో 15.6-అంగుళాల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెనుక ప్రయాణికుల కోసం ప్రత్యేక టచ్‌స్క్రీన్ కంట్రోల్స్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, 16-స్పీకర్ల డెవియాలెట్ సౌండ్ సిస్టమ్ అమర్చారు. అదనంగా సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌లోనే వస్తువులను చల్లగా లేదా వెచ్చగా ఉంచగల రిఫ్రిజిరేటర్, నాలుగు 50 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ పాయింట్లను అందించారు.

ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ కారు విషయానికొస్తే, రెండో వరుసలో కూర్చునే ప్రయాణికుల అనుభూతిపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇందులోని ప్రెసిడెన్షియల్ కెప్టెన్ సీట్లకు 16 రకాల ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్, మసాజ్, హీటింగ్, వెంటిలేషన్, పవర్డ్ ఒట్టోమన్ సదుపాయాలు ఉన్నాయి. అంతేగాక ప్రయాణికులు తమ సీట్లను క్యాబిన్ మధ్యలోకి జరుపుకునేందుకు వీలుగా 'లేటరల్ ఇన్‌వర్డ్-గ్లైడ్' ఫంక్షన్‌ను జోడించారు. ఎంజీ ఎం9 కారులో 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 7-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్, వెనుక ప్రయాణికులకు టచ్‌స్క్రీన్ కంట్రోల్స్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 13-స్పీకర్ల జేబీఎల్ ఆడియో సెటప్ ఉన్నాయి.

డెంజా డీ9 వర్సెస్ ఎంజీ ఎం9- సేఫ్టీ..

భద్రత పరంగా ఈ రెండు ఎలక్ట్రిక్ ఎంపీవీలలో లెవల్-2 అడాస్, 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. డెంజా డీ9 కారులో 9 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటే, ఎంజీ ఎం9 కారులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అయితే ఎంజీ ఎం9 కారుకు 5-స్టార్ యూరో ఎన్‌క్యాప్ సేఫ్టీ రేటింగ్ ఉండటం అదనపు బలంగా నిలుస్తోంది. డెంజా డీ9 కారుకు సంబంధించి ప్రత్యక్ష క్రాష్-టెస్ట్ రేటింగ్ వివరాలు నమోదు కాలేదు.

డెంజా డీ9 వర్సెస్ ఎంజీ ఎం9- ధరలు

ధరల విషయంలో ఎంజీ ఎం9 కొంత అందుబాటులో ఉంది. దీని 'ప్రెసిడెన్షియల్ లిమో' వేరియంట్ ప్రారంభ ధర రూ.79.94 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, పరిమిత సంఖ్యలో లభించే 'కౌచర్ ఎడిషన్' ధర రూ.84.94 లక్షలుగా ఉంది. మరోవైపు డెంజా డీ9 కేవలం ఒకే ఒక పూర్తిస్థాయి ఫీచర్ల వేరియంట్‌లో రూ.90 లక్షల ధరకు లభిస్తోంది.

ఎం9 ఎలక్ట్రిక్ కారులో ఎంజీ సంస్థ వినూత్నంగా 'బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్' ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. ఈ విధానంలో ఎం9 కారు ధర రూ.69.99 లక్షలకు తగ్గుతుంది. అయితే ప్రయాణించే ప్రతి కిలోమీటరుకు రూ.8 చొప్పున బ్యాటరీ వినియోగ ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కారు కొనేటప్పుడు ప్రారంభ ఖర్చు తగ్గినప్పటికీ, వాహనం నడిపే కాలంలో కిలోమీటరుకు అయ్యే బ్యాటరీ ఖర్చును కొనుగోలుదారులు లెక్కలోకి తీసుకోవాలి.

డెంజా డీ9 వర్సెంస్ ఎంజీ ఎం9- ఏది బెస్ట్?

మొత్తంగా చూస్తే అత్యధిక బ్యాటరీ సామర్థ్యం, 730 కిలోమీటర్ల రేంజ్, మెరుగైన పవర్ కావాలనుకునే వారికి డెంజా డీ9 ఆకర్షణీయంగా కనిపిస్తుండగా, తక్కువ ప్రారంభ ధరతో పాటు విశాలమైన వీల్‌బేస్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కోరుకునే వారికి ఎంజీ ఎం9 సరైన ఎంపికగా నిలుస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks