Hala mobility : 60 సెకన్లలో బ్యాటరీ స్వాప్, రూ.2కే ఇన్సూరెన్స్! డెలివరీ బాయ్స్‌కు హైదరాబాద్ కంపెనీ ఆఫర్..
హైదరాబాద్‌కు చెందిన 'హాలా మొబిలిటీ' గిగ్ డెలివరీ పార్ట్నర్స్ కోసం 'సీడ్' పేరుతో ప్రత్యేక ఈకోసిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. 60 సెకన్లలో బ్యాటరీ స్వ్యాపింగ్, రోజుకు రూ.2కే ఆరోగ్య బీమా, ముందస్తు వేతనం వంటి సదుపాయాలను ఇందులో అందిస్తోంది. ఇవి గిగ్ వర్కర్లకు ఎంతగానో ఉపగయోగపడతాయి.
లాస్ట్-మైల్ డెలివరీ రంగంలో పనిచేసే ప్రతీ డెలివరీ బాయ్‌కి కూడా ఎలక్ట్రిక్ బైక్ అనేది కేవలం ఒక ప్రయాణ సాధనం మాత్రమే కాదు; అది అతనికి ప్రతి నిషమం ఆదాయాన్ని తెచ్చిపెట్టే జీవనోపాధి! ఇక స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి సంస్థల్లో రోజంతా బైక్‌పై తిరిగే గిగ్ వర్కర్లకు కారు లేదా బైక్ ఛార్జింగ్ కోసం గంటల తరబడి వేచి చూడటం అంటే ఆ రోజు సంపాదనను కోల్పోవడమే. ఈ నేపథ్యంలోనే ఈ క్షేత్రస్థాయి సమస్యకు పక్కా పరిష్కారంతో ముందుకొచ్చింది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఈవీ స్టార్టప్ ‘హాలా మొబిలిటీ’.

తమ వినూత్న 'ఈవీ-యాజ్-ఏ-సర్వీస్' (ఈవీఏఏఎస్) మోడల్‌తో పాటు 'సీడ్' (సస్టైనెబుల్ ఎకోసిస్టెమ్ టు ఎంపవర్ డెలివరీ పార్ట్నర్స్) వేదిక ద్వారా డెలివరీ భాగస్వాముల దైనందిన సమస్యలను పరిష్కరించేందుకు హాలా సరికొత్త సేవలను ప్రారంభించింది.
60 సెకన్లలో బ్యాటరీ స్వ్యాపింగ్: 'ట్విన్‌ఫినిటీ'
గంటల కొద్దీ సాగే ఛార్జింగ్ కష్టాలకు ముగింపు పలుకుతూ హాలా సంస్థ 'ట్విన్‌ఫినిటీ' పేరుతో సొంత బ్యాటరీ స్వ్యాపింగ్ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చింది. సంస్థ స్వయంగా అభివృద్ధి చేసిన బ్యాటరీలు, స్వ్యాపింగ్ స్టేషన్లు, అడ్వాన్స్‌డ్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.
ఈ సాంకేతికత ద్వారా డెలివరీ రైడర్లు తమ వాహనంలోని డిశ్చార్జ్ అయిన బ్యాటరీని తీసి, పూర్తిగా ఛార్జ్ అయిన కొత్త బ్యాటరీని కేవలం 60 సెకన్ల కంటే తక్కువ సమయంలోనే అమర్చుకోవచ్చు. దీనివల్ల ఆర్డర్ల రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ఛార్జింగ్ కోసం విలువైన సమయం వృథా కాకుండా తక్షణమే రోడ్డుపైకి వెళ్లే వీలు కలుగుతుంది.
గిగ్ వర్కర్ల కోసం 'కవచ్', 'స్వయం'!
కమర్షియల్ ఈవీ విభాగంలో కేవలం వాహనాలను అందించడమే కాకుండా, వాటిని నడిపే వర్కర్ల ఆరోగ్య, ఆర్థిక భద్రతకు హాలా మొబిలిటీ ప్రాధాన్యమిస్తోంది. అందుకోసం 'కవచ్', 'స్వయం' అనే రెండు ప్రత్యేక సేవలను 'సీడ్' ఈకోసిస్టమ్ కింద జోడించింది.
కవచ్ : రోడ్డుపై నిరంతరం ప్రయాణించే డెలివరీ భాగస్వాములకు రోజుకు కేవలం రూ. 2 నామమాత్రపు రుసుముతో సమగ్ర ప్రమాద, ఆరోగ్య బీమా రక్షణ కల్పిస్తోంది. అత్యవసర వేళల్లో ఆసుపత్రి ఖర్చుల భారం పడకుండా ఇది కుటుంబాలకు అభయాన్ని ఇస్తుంది.
స్వయం : రైడర్ల పనితీరు, ఆర్డర్ల రికార్డు ఆధారంగా వారు సాధించిన సంపాదన నుంచి క్రమం తప్పకుండా రావాల్సిన జీతం తేదీ కంటే ముందే కొంత మొత్తాన్ని డ్రా చేసుకునే వెసులుబాటును ఈ సేవ అందిస్తుంది. పండుగలు లేదా అత్యవసర నిత్యావసర ఖర్చులకు ఇది ఎంతో తోడ్పడుతుంది.
లాస్ట్-మైల్ డెలివరీ రంగానికి కొత్త ఊపిరి!
హైదరాబాద్‌లోని సర్వీస్ హబ్ ప్రాతిపదికన ప్రారంభమైన ఈ ఆవిష్కరణలు కమర్షియల్ ఈవీ నిర్వహణ విధానాన్ని మార్చేస్తున్నాయి. వ్యాపార సంస్థలు ఈవీ ఫ్లీట్‌ను పెంచుకుంటున్న తరుణంలో, వాహనాలు నిరుపయోగంగా ఉండకుండా చూడటమే అసలైన సవాలు. ఈ సవాలకు పరిష్కారాలు తెస్తోంది హాలా మొబిలిటీ.
ప్రస్తుతం హాలా మొబిలిటీ హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, దిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, పూణె, అహ్మదాబాద్, జైపూర్, కోల్‌కతా సహా 9 ప్రధాన నగరాల్లో తన సేవలను విస్తరించింది. ఇప్పటివరకు 25,000 మందికి పైగా గిగ్ వర్కర్లకు ఈ నెట్‌వర్క్ ప్రత్యక్షంగా ఆసరాగా నిలిచింది.
పర్యావరణహిత విద్యుత్ వాహన రంగాన్ని వాణిజ్యపరంగా మరింత విజయవంతం చేసేందుకు ఇటువంటి సమగ్ర వ్యవస్థలు ఎంతగానో దోహదపడతాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


