కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపిన నీట్-యూజీ (NEET-UG) ప్రవేశ పరీక్షల వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో వారాల తరబడి సాగిన నిరసనల అనంతరం, శనివారం నాటి కీలక పరిణామంలో ధర్మేంద్ర ప్రధాన్ తన విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.. దేశ యువతను ఉద్దేశించి హిందీలో రాసిన సుదీర్ఘ లేఖను ఆయన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (ట్విట్టర్)లో పంచుకున్నారు. పరీక్షల వివాదంపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును సమర్థిస్తూనే, నెలకొన్న పరిస్థితులకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

"తొలి రోజు నుంచే నేను ఈ బాధ్యతను స్వీకరించాను. పరిస్థితి నుంచి ఎప్పుడూ పారిపోలేదు. పరీక్షల మాఫియా కారణంగా ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి భవిష్యత్తు దెబ్బతినకూడదని, ఎవరికీ అన్యాయం జరగకూడదన్నదే నా దృఢ సంకల్పం" అని ప్రధాన్ లేఖలో పేర్కొన్నారు.
మే 3న అక్రమాలు.. జూన్ 21న తిరిగి పరీక్ష
2026 మే 3న నిర్వహించిన నీట్-యూజీ పరీక్షలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు గుర్తింఛిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించిందని ధర్మేంద్ర ప్రధాన్ గుర్తుచేశారు. ఈ ఉదంతంపై విచారణను వెంటనే సిబిఐ (CBI)కి అప్పగించి, పాత పరీక్షను రద్దు చేసి కొత్తగా రీ-టెస్ట్ ప్రకటింఛిన విషయాన్ని వివరించారు. వచ్చే ఏడాది నుంచి నీట్-యూజీ పరీక్షను కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
20 లక్షలకు పైగా అభ్యర్థులకు మళ్లీ పరీక్షను సజావుగా నిర్వహించడమే ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యతగా మారింది. జూన్ 21న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు సమన్వయంతో 'హోల్-ఆఫ్-గవర్నమెంట్' విధానంలో రీ-టెస్ట్‌ను విజవంతంగా పూర్తి చేశాయి. జులై 16న వెలువడిన ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని, పేదరికంలో ఉన్న అనేకమంది ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా మంచి ప్రతిభ కనబరిచారని లేఖలో ప్రస్తావించారు.
'దేశ వ్యతిరేక శక్తుల కుట్రలను తిప్పికొట్టడానికే..'
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొందరు వ్యక్తులు ఈ వివాద సమయంలో విద్యార్థులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని, ఆ చర్యలు తనను తీవ్రంగా కలిచివేశాయని ప్రధాన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించినప్పటికీ, లేఖలో ఎవరి పేర్లను ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. గడిచిన 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధించినప్పటికీ, ఇది తన వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన అంశం కాదని స్పష్టం చేశారు.
"జంతర్ మంతర్ వద్ద, దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాను. దేశ వ్యతిరేక శక్తులు దీనిని ఆసరాగా చేసుకోకుండా ఉండేందుకు, దేశ ఐక్యత దెబ్బతినకుండా చూసేందుకు, విద్యార్థుల భవిష్యత్తు న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా వారి చదువులపై దృష్టి సారించేలా ప్రధానికి నా రాజీనామా లేఖను సమర్పించాను" అని తెలిపారు.
యువత తప్పుడు సమాచారం, గందరగోళం అనే వలలో పడకూడదని హితవు పలికారు. విద్యా రంగానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ దేశ సేవకే తన మొదటి ప్రాధాన్యమని, పూరీ జగన్నాథుని ఆశీస్సులతో దేశం, తన సొంత రాష్ట్రమైన ఒడిశా ప్రజలు, యువత ఆకాంక్షల కోసం నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


