గుండె పోటు ముప్పును తగ్గించే అద్భుత చిట్కా: భోజనం తర్వాత 15 నిమిషాల నడక

భారతదేశంలో గుండెపోటు మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, ప్రముఖ డయాబెటాలజిస్ట్ డా. బ్రిజ్‌మోహన్ అరోరా ఒక సులభమైన చిట్కాను పంచుకున్నారు. ప్రతి భోజనం తర్వాత కేవలం 10-15 నిమిషాలు నడవడం ద్వారా రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గి, గుండెపోటు ముప్పును 40% వరకు తగ్గించుకోవచ్చని ఆయన తెలిపారు. 

Published on: Nov 11, 2025 7:54 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధుల (CVD) కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ నివేదిక ప్రకారం, 2021లో మన దేశంలో గుండె సంబంధిత సమస్యల వల్ల 28,73,266 మంది ప్రాణాలు కోల్పోయారు. 2021 నుండి 2023 మధ్య జరిగిన మొత్తం మరణాల్లో దాదాపు మూడో వంతుకు గుండెపోట్లే ప్రధాన కారణంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, గుండెపోటు లేదా స్ట్రోక్ ముప్పును తగ్గించుకోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం.

గుండె పోటు ముప్పును తగ్గించే అద్భుత చిట్కా: భోజనం తర్వాత 15 నిమిషాల నడక (Freepik)
గుండె పోటు ముప్పును తగ్గించే అద్భుత చిట్కా: భోజనం తర్వాత 15 నిమిషాల నడక (Freepik)

ఢిల్లీలోని ద్వారకకు చెందిన సీనియర్ డయాబెటాలజిస్ట్, 24 ఏళ్ల అనుభవం ఉన్న ఫిజీషియన్ డా. బ్రిజ్‌మోహన్ అరోరా గుండె పోటు ముప్పును తగ్గించేందుకు ఒక అత్యంత సులభమైన మార్గాన్ని సూచించారు.

గుండె పోటు ముప్పు 40% తగ్గుతుంది

భోజనం తర్వాత నడవాల్సిన ప్రాధాన్యతను వివరిస్తూ, ఈ అలవాటుతో గుండె పోటు ముప్పు ఏకంగా 40% వరకు తగ్గుతుందని డాక్టర్ అరోరా ఒక వీడియోలో గట్టిగా నొక్కి చెప్పారు. "ఒకవేళ ఈ నడక ఒక మందు అయితే, నేను ప్రతి రోగికీ తప్పకుండా ఇదే రాసిచ్చేవాడిని" అని ఆయన అన్నారు.

ఈ పద్ధతి మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన వివరించారు. "నిజం ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా మంది ఇప్పటికీ ఈ చిట్కాను పాటించడం లేదు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

డాక్టర్ అరోరా ప్రకారం భోజనం చేసిన తర్వాత కేవలం 10 నుంచి 15 నిమిషాలు నడవడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..

  • రక్తంలో చక్కెర నియంత్రణ మెరుగుపడుతుంది
  • ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి
  • జీర్ణక్రియ సులభతరం అవుతుంది
  • గుండె, ధమనులకు రక్షణ లభిస్తుంది
  • బ్రెయిన్ ఫాగ్ (మెదడు మందగించడం) తగ్గుతుంది

"ఇదంతా సిద్ధాంతం కాదు.. దీనికి నిజమైన, కొలవదగిన ఫలితాల మద్దతు ఉంది. జిమ్ లేదు. ఖర్చు లేదు. చిన్న అలవాటుతో అపారమైన ఆరోగ్యం మీ సొంతం. మీ ఆరోగ్యం చిన్న చిన్న అడుగులతోనే నిర్మితమవుతుంది. అక్షరాలా.." అని డాక్టర్ అరోరా నొక్కి చెప్పారు.

మరి, భోజనం తర్వాత నడవడం ద్వారా ఇన్ని ప్రయోజనాలను ఎలా పొందవచ్చో వివరంగా తెలుసుకుందాం.

1. చక్కెర నియంత్రణ మెరుగుదల

"మీరు ఆహారం తీసుకున్నప్పుడల్లా, ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాలు తప్పనిసరిగా నడవాలి. ఎందుకు? రక్తం చక్కెర (Blood Sugar) అకస్మాత్తుగా పెరిగినప్పుడు, అధిక ఇన్సులిన్ కారణంగా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ (వాపు) పెరుగుతుంది. మనం ఇన్సులిన్ స్పైక్‌ను నియంత్రించగలిగితే, ఇన్‌ఫ్లమేషన్‌ను కూడా అదుపులో ఉంచగలం. ఇన్‌ఫ్లమేషన్‌ను నియంత్రించడం అంటే ధమనులలో జరిగే నష్టాన్ని తగ్గించడం అన్నమాట" అని డయాబెటాలజిస్ట్ వివరించారు.

ఇన్‌ఫ్లమేషన్‌తో పాటు, ఇన్సులిన్ ఆక్సీడేటివ్ ఒత్తిడికి కూడా కారణమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆక్సీడేటివ్ ఒత్తిడి ధమనులను దెబ్బతీస్తుంది. తద్వారా గుండె పోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే, నడక ఈ ముప్పును సమర్థవంతంగా తొలగిస్తుంది.

2. ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి

భోజనం చేసిన తర్వాత నడవడం వలన ట్రైగ్లిజరైడ్స్ (కొవ్వు కణాలు) స్థాయి కూడా తగ్గుతుంది. "ట్రైగ్లిజరైడ్ అనేది ఒక రకమైన కొలెస్ట్రాల్ కణం లేదా కొలెస్ట్రాల్ కణంలో ఒక భాగం. ఇది ధమనిలో (Artery) పేరుకుపోయి, పూతగా (Plaque) మారి గుండె పోటుకు కారణమవుతుంది. ఇది బ్రెయిన్ స్ట్రోక్‌కు కూడా దోహదపడుతుంది. మీరు భోజనం చేసిన తర్వాత నడిస్తే, ట్రైగ్లిజరైడ్స్ రక్తం నుంచి తొలగిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది" అని ఆయన తెలిపారు.

3. రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ పెరుగుదల

తిన్న తర్వాత నడవడం వలన రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ (Nitric Oxide) పరిమాణం పెరుగుతుంది. "నైట్రిక్ ఆక్సైడ్ అనేది మన రక్త నాళాల గోడల నుండి, ముఖ్యంగా ధమనుల గోడల నుండి విడుదలయ్యే ఒక పదార్థం. ఇది ధమనులను కొద్దిగా వెడల్పు చేస్తుంది. లేదా దాని వ్యాసాన్ని పెంచుతుంది" అని డాక్టర్ అరోరా వివరించారు.

ఈ ప్రక్రియ వల్ల రక్తపోటు (BP) తగ్గి, రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ పరిమాణం పెరిగితే, ధమనిపై ఒత్తిడి తగ్గి, నష్టం కూడా తగ్గుతుంది.

4. బ్రెయిన్ ఫాగ్ తగ్గుతుంది

భోజనం తర్వాత నడవడం 'బ్రెయిన్ ఫాగ్'ను తగ్గిస్తుంది. చాలా మంది తిన్న తర్వాత నిద్రగా అనిపిస్తుందని, మెదడు సరిగ్గా పని చేయడం లేదని, ఏకాగ్రత తగ్గిపోతుందని ఫిర్యాదు చేస్తుంటారు. దీన్నే బ్రెయిన్ ఫాగ్ అంటారు. షుగర్, ఇన్సులిన్ స్పైక్ కారణంగా ఇది సంభవిస్తుంది. కాబట్టి, భోజనం తర్వాత నడిస్తే ఈ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

"మీరు అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం తర్వాత 15 నిమిషాలు నడిస్తే - అది గుండె ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి, రక్తపోటు తగ్గడానికి, మెరుగైన జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరం" అని డాక్టర్ సూచించారు.

తిన్న తరువాత నడవడం వల్ల నాలుగు ఉపయోగాలు (Google Gemini)
తిన్న తరువాత నడవడం వల్ల నాలుగు ఉపయోగాలు (Google Gemini)

(పాఠకులకు గమనిక: ఈ కథనం కేవలం సమాచారం అందించే ఉద్దేశ్యంతో మాత్రమే.. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే మీ వైద్యుడిని సంప్రదించండి. ఈ నివేదిక సోషల్ మీడియా నుండి తీసుకున్న సమాచారంపై ఆధారపడి ఉంది. హిందుస్తాన్ టైమ్స్ ఈ వాదనలను స్వతంత్రంగా ధృవీకరించలేదు.)

News/News/గుండె పోటు ముప్పును తగ్గించే అద్భుత చిట్కా: భోజనం తర్వాత 15 నిమిషాల నడక
News/News/గుండె పోటు ముప్పును తగ్గించే అద్భుత చిట్కా: భోజనం తర్వాత 15 నిమిషాల నడక