...
...
Next Story

డిజిటల్ అరెస్ట్: భయపెట్టి డబ్బులు కొల్లగొట్టే సైబర్ మోసం వెనుక కథ ఇదే!

'డిజిటల్ అరెస్ట్' అనే పదం ఇప్పుడు చాలామందికి సుపరిచితమే. అయితే దాని పేరుతో జరుగుతున్న మోసం గురించి ఇప్పటికీ పూర్తి అవగాహన లేదు. మోసగాళ్లు ప్రజల్లో భయాన్ని ఎలా పెంచుతున్నారు? బాధితులు గంటల తరబడి ఆ ఉచ్చులోనే ఎందుకు చిక్కుకుపోతున్నారు? ఆలస్యం కాకముందే ఈ మోసాన్ని ఎలా అడ్డుకోవచ్చో తెలుసుకుందాం.

Published on: Aug 18, 2026, 15:43:12 IST
Advertisement

కొంతకాలం క్రితం వరకు చాలామందికి 'డిజిటల్ అరెస్ట్' అనే పదమే తెలియదు. కానీ ఇప్పుడు ఇది రోజువారీ సంభాషణల్లో, కుటుంబాల వాట్సాప్ గ్రూపుల్లో, వార్తల్లో తరచుగా వినిపిస్తోంది. ఆ పేరు వినగానే ఏదో అధికారిక ప్రభుత్వ ప్రక్రియ అన్న భావన కలగడం కూడా ఈ మోసం ఇంత ప్రభావవంతంగా మారడానికి ఒక కారణం.

డిజిటల్ అరెస్ట్: భయపెట్టి డబ్బులు కొల్లగొట్టే సైబర్ మోసం వెనుక కథ ఏంటి?
డిజిటల్ అరెస్ట్: భయపెట్టి డబ్బులు కొల్లగొట్టే సైబర్ మోసం వెనుక కథ ఏంటి?

అయితే వాస్తవం చాలా సాధారణమైనది. భారతదేశంలో 'డిజిటల్ అరెస్ట్' అనే పేరుతో ఎలాంటి చట్టబద్ధమైన ప్రక్రియ లేదు. ఏ పోలీసు సంస్థ, దర్యాప్తు సంస్థ లేదా నియంత్రణ సంస్థ కూడా వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయదు. అలాగే దర్యాప్తులో భాగంగా డబ్బు బదిలీ చేయాలని పౌరులను కోరదు అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పలుమార్లు స్పష్టం చేసింది.

అయినప్పటికీ, వరుసగా హెచ్చరికలు జారీ అవుతున్నా మోసగాళ్లు నేర దర్యాప్తు పేరుతో ప్రజల్లో కలిగే భయాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటూనే ఉన్నారు. వారు ఫోన్లను హ్యాక్ చేయడం లేదు. బ్యాంకు ఖాతాల్లోకి చొరబడడం లేదు. బదులుగా, ప్రజలే తమ పొదుపు మొత్తాన్ని స్వచ్ఛందంగా వారికి అప్పగించేలా నమ్మిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ సమర్పణలో బంధన్ బ్యాంక్ వారు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం సైబర్ కాప్ లో భాగంగా ఎయిడెంట్ సంస్థతో కలిసి చేపడుతున్న అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో సురక్షితమైన డిజిటల్ అలవాట్లను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోసాలు జరుగుతున్నాయని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, అవి ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యంగా మారింది.

డబ్బు గురించి ప్రస్తావించక ముందే మోసం మొదలవుతుంది

పోలీసులు, కస్టమ్స్, సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లేదా మరో ప్రభుత్వ సంస్థకు చెందిన అధికారులమని చెప్పుకుంటూ బాధితులకు ఫోన్ చేస్తారు. మీ ఖాతాలో అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగాయని, అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించిన సిమ్ కార్డు మీ పేరుతో ఉందని, మీ ఆధార్ నంబర్ ఒక క్రిమినల్ కేసుతో అనుసంధానమైందని లేదా మీ పేరుతో బుక్ చేసిన ఓ పార్సెల్‌లో డ్రగ్స్, నకిలీ పాస్‌పోర్టులు లేదా నిషేధిత వస్తువులు ఉన్నాయని చెబుతారు. ఆ తర్వాత భయాన్ని మరింత పెంచేందుకు, తమను తాము పోలీసు లేదా ఇతర చట్ట అమలు సంస్థల అధికారులుగా పరిచయం చేసుకునే వ్యక్తులతో బాధితుడిని మాట్లాడిస్తారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రమైనదిగా, సత్వరమే స్పందించాల్సిన పరిస్థితిగా అనిపించేలా చేస్తారు.

ఈ దశలో మోసగాళ్ల అసలు లక్ష్యం డబ్బు దొంగిలించడం కాదు. తమకు ఏదో తీవ్రమైన సమస్య వచ్చిందని బాధితుడు నమ్మేలా చేయడం. ఆ తర్వాత మోసగాడి చేతికి బ్యాంకు వివరాల కంటే విలువైనది ఒకటి దొరుకుతుంది — అదే బాధితుడి యొక్క పూర్తి దృష్టి.

అధికారమే వారి ప్రధాన ఆయుధం

చట్ట అమలు సంస్థకు చెందిన అధికారితో మాట్లాడుతున్నామని నమ్మితే, చాలామంది వెంటనే స్పందించేలా అలవాటుపడ్డారు. సైబర్ నేరగాళ్లకు ఈ మానసిక ధోరణి గురించి బాగా తెలుసు.

అందుకే వారు నకిలీ కేసు నంబర్లు, కల్పిత గుర్తింపు కార్డులు, నకిలీ న్యాయ నోటీసులు, అధికారిక పత్రాల్లా కనిపించే డాక్యుమెంట్లను చూపిస్తారు. ఇవన్నీ తాము పరిస్థితిని పూర్తిగా నియంత్రిస్తున్న అధికారులమనే భావన కలిగించేలా రూపొందిస్తారు. చాలా మంది బాధితులను వీడియో కాల్‌లోకి తీసుకెళ్తారు. ఆ వీడియోలో అవతలి వ్యక్తి పోలీస్ స్టేషన్ లేదా ప్రభుత్వ కార్యాలయంలా కనిపించే ప్రదేశంలో కూర్చుని ఉన్నట్లు చూపిస్తారు. కొంతమంది బాధితులకు నిరంతరం వీడియో కాల్‌లోనే ఉండాలని, కెమెరాను ఆఫ్ చేయకూడదని, గది నుంచి బయటకు వెళ్లకూడదని ఆదేశిస్తారు. ఈ పద్ధతులన్నింటి ఉద్దేశం ఒక్కటే—అధికారిక కస్టడీలో ఉన్నామనే తప్పుడు భావనను కల్పించడం, బాధితులను కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల నుంచి దూరంగా ఉంచడం, అలాగే తమకు చెబుతున్న విషయాలు నిజమో కాదో స్వతంత్రంగా నిర్ధారించుకునే అవకాశం లేకుండా చేయడం.

నేరగాళ్ల బృందాలు యూనిఫాంలు, ముందుగా ఏర్పాటు చేసిన కార్యాలయ వాతావరణాలు, వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారాలను ఉపయోగించి అధికారిక వ్యవస్థతో మాట్లాడుతున్నామనే భ్రమను కల్పిస్తున్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఆ వాతావరణం ఎంత నిజమైనదిగా కనిపిస్తే, వాళ్ళు చెబుతున్న విషయాలను ఎవరైనా ప్రశ్నించే అవకాశం అంత తక్కువగా ఉంటుంది.

మరి బాధితులు ఫోన్ ఎందుకు కట్ చేయరు?

ఇలాంటి మోసం ఎదురైనప్పుడు తాము వెంటనే గుర్తించగలమని చాలా మంది అనుకుంటారు. కానీ సంభాషణ కొనసాగుతున్న కొద్దీ, భయం, విచక్షణ మధ్య పోరాటం మొదలవుతుంది. అలాంటి పరిస్థితిలో వాస్తవాన్ని గుర్తించడం చాలా కష్టమవుతుంది.

మోసగాళ్లు సాధారణంగా ఈ విషయం అత్యంత గోప్యమైనదని చెబుతారు. ఫోన్ కట్ చేయవద్దని, కుటుంబ సభ్యులను సంప్రదించవద్దని, బ్యాంకుకు కూడా సమాచారం ఇవ్వవద్దని బాధితులను ఆదేశిస్తారు. అలా చేస్తే కొనసాగుతున్న దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని వారిని నమ్మిస్తారు. ఇలా చేస్తుండగానే గంటలు గడిచిపోతాయి.

బాధితుడితో నిరంతరం మాట్లాడుతూ ఉండటం వెనుక మోసగాళ్లకు ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంటుంది. బాధితుడు కొద్దిసేపైనా ఆ పరిస్థితి నుంచి బయటపడి, ఇతరుల సలహా తీసుకోవడానికి లేదా తనకు చెబుతున్న విషయాలు నిజమో కాదో స్వతంత్రంగా నిర్ధారించుకోవడానికి అవకాశం లేకుండా చేయడమే వారి లక్ష్యం.

ప్రతి నిమిషం గడిచే కొద్దీ, తార్కికంగా ఆలోచించే శక్తిని భయం ఆక్రమించడం మరింత సులభమవుతూ ఉంటుంది.

డబ్బు బదిలీని పరిష్కారంగా చూపిస్తారు

సాధారణంగా భావించే దానికి భిన్నంగా, బాధితులను నేరుగా "జరిమానా చెల్లించండి" అని అడగడం చాలా అరుదు. బదులుగా, డబ్బు బదిలీ చేయడాన్ని ఒక అధికారిక ప్రక్రియలో భాగంగా చూపిస్తారు.

కొంతమందికి ధృవీకరణ కోసం తమ డబ్బును "సురక్షిత ఖాతా"కు బదిలీ చేయాలని చెబుతారు. మరికొందరికి తమపై ఎలాంటి ఆరోపణలు లేవని క్లీన్ చిట్ ఇచ్చే ముందు బ్యాంకు ఖాతాలోని నగదు నిల్వను పరిశీలించాల్సి ఉంటుందని చెబుతారు. ఇంకొందరికి దర్యాప్తు పూర్తయిన తర్వాత తాము బదిలీ చేసిన మొత్తం తిరిగి చెల్లిస్తామని హామీ ఇస్తారు.

మోసగాళ్లు ఉపయోగించే భాష కూడా ఉద్దేశపూర్వకంగానే ఉంటుంది. అనుమానం కలిగించేలా కాకుండా, ఏదో అధికారిక పరిపాలనా ప్రక్రియ జరుగుతున్నట్లుగా అనిపించే పదాలను ఎంచుకుంటారు. అప్పటికే బాధితులు తాము ఎలాంటి తప్పూ చేయలేదని నిరూపించుకునేందుకు గంటల సమయం వెచ్చించి ఉంటారు. దాంతో వారు మానసికంగా బలహీన స్థితిలోకి వెళ్లిపోతారు. పరిస్థితిపై నియంత్రణ కోల్పోయి, మోసగాళ్ల మాటలకు తలొగ్గే స్థితికి చేరుకుంటారు.

డబ్బును తిరిగి పొందడం ఎందుకు కష్టం?

డబ్బు బదిలీ చేసిన తర్వాత అది సాధారణంగా ఒకే చోట ఉండదు. మోసగాళ్లు ఉపయోగించే మ్యూల్ అకౌంట్ల ద్వారా దొంగిలించిన డబ్బును అనేక బ్యాంకు ఖాతాలకు వేగంగా బదిలీ చేస్తారు. అక్కడి నుంచి మరో ఖాతాకు మళ్లించడం లేదా నగదుగా ఉపసంహరించుకోవడం జరుగుతుంది.

సంఘటిత సైబర్ మోసంలో ఈ అకౌంట్లు కీలకంగా మారుతున్న విషయాన్ని గుర్తించిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, తమ సస్పెక్ట్ రిజిస్ట్రీ ద్వారా 27.37 లక్షలకు పైగా లేయర్-1 మ్యూల్ అకౌంట్ల సమాచారాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పంచుకుంది. దీంతో భాగస్వామ్య సంస్థలు 9,518 కోట్లకు పైగా విలువైన మోసపూరిత లావాదేవీలను నిలిపివేయగలిగాయి.

డబ్బు ఇలా వేగంగా ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు మారిపోవడం వల్ల దాని మూలాన్ని గుర్తించడం మరింత కష్టమవుతుంది. ఆర్థిక సంస్థలు, చట్ట అమలు సంస్థలు జోక్యం చేసుకునేందుకు బాధితులకు లభించే సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అధికారులు సైబర్ మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయాలని పదేపదే సూచిస్తున్నారు. మరుసటి రోజు వరకు వేచి ఉండకుండా వెంటనే సమాచారం అందిస్తే, లావాదేవీలను నిలిపివేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ప్రభుత్వ చర్యలు మరింత విస్తరిస్తున్నాయి

డిజిటల్ అరెస్ట్ మోసం విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా చర్యలను ముమ్మరం చేసింది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టెలివిజన్, రేడియో, సోషల్ మీడియా, వార్తాపత్రికలు, టెలికాం నెట్‌వర్క్‌ల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 గురించి ప్రజలకు తెలియజేసేందుకు వివిధ భాషల్లో కాలర్ ట్యూన్లు కూడా ఈ ప్రచారంలో భాగంగా ఉన్నాయి.

ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు కూడా విస్తరించాయి. పార్లమెంట్‌లో ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం, డిజిటల్ అరెస్ట్ మోసాలతో సంబంధం ఉన్న 3,962కు పైగా స్కైప్ ఐడీలను, మరియు 83,668 వాట్సాప్ అకౌంట్లను ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ముందస్తుగా బ్లాక్ చేసింది. అలాగే 12 లక్షలకు పైగా అనుమానాస్పద సిమ్ కార్డులను రద్దు చేసి, 3 లక్షలకు పైగా మొబైల్ ఐఎంఈఐ నంబర్లను బ్లాక్ చేశారు. సైబర్ మోసాలకు సంబంధించిన 3.61 లక్షల ఫిర్యాదుల ద్వారా 8,189 కోట్లను భద్రపరచడం లేదా బాధితులకు తిరిగి అందించడం జరిగింది. విస్తృత సైబర్ క్రైమ్ నిరోధక చర్యల్లో భాగంగా 20,853 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

ఈ గణాంకాలు డిజిటల్ అరెస్ట్ మోసాలు వ్యక్తిగతంగా పనిచేసే కొంతమంది మోసగాళ్లకు మాత్రమే పరిమితమైనవి కాదని స్పష్టం చేస్తున్నాయి. అనేక కమ్యూనికేషన్ ఛానళ్లు, డిజిటల్ ఐడెంటిటీలను ఉపయోగించే సంఘటిత నెట్‌వర్క్‌ల మద్దతుతో ఇవి జరుగుతున్నాయి.

బంధన్ బ్యాంక్ సిఎస్ఆర్ కార్యక్రమమైన 'సైబర్ కాప్', హిందుస్తాన్ టైమ్స్ సమర్పణలో, ఎయిడెంట్ అమలుతో కొనసాగుతున్న ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో జరుగుతున్న అవగాహన ప్రయత్నాలకు తోడ్పడుతోంది. సాధారణ సైబర్ మోసాలను గుర్తించడం, సురక్షితమైన డిజిటల్ పద్ధతులను అర్థం చేసుకోవడం, అనుమానాస్పద ఆన్‌లైన్ కార్యకలాపాల విషయంలో సరైన విధంగా స్పందించడం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం దీని లక్ష్యం. ఎడ్యుకేషనల్ కంటెంట్, అవగాహన కార్యక్రమాల ద్వారా వ్యక్తులు, సమాజాల్లో మరింత మెరుగైన సైబర్ ప్రతిఘటనా సామర్థ్యాన్ని పెంపొందించడం కూడా ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.

నిజమైన దర్యాప్తుకు, మోసానికి మధ్య తేడా ఎలా గుర్తించాలి?

నిజమైన దర్యాప్తులో “ఏం జరగదో” తెలుసుకోవడం సైబర్ మోసాన్ని గుర్తించే సులభమైన మార్గాల్లో ఒకటి.

  • ప్రభుత్వ సంస్థలు ప్రజలను గంటల తరబడి వీడియో కాల్‌లో ఉండాలని కోరవు.
  • తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి డబ్బు బదిలీ చేయాలని అడగవు.
  • ఎవరైనా ప్రశ్నలు అడిగినందుకు మాత్రమే అరెస్ట్ చేస్తామని బెదిరించవు.
  • ముఖ్యంగా, దర్యాప్తు విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా ఉంచాలని ప్రజలను ఆదేశించవు.

ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే కట్ చేసి, కాలర్‌తో సంభాషణ కొనసాగించకుండా ఫిర్యాదు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రజలకు పదేపదే సూచించింది.

డిజిటల్ అరెస్ట్ మోసానికి సంబంధించిన కొన్ని సాధారణ హెచ్చరిక సంకేతాలు:

  • సరైన చట్టపరమైన ప్రక్రియ లేకుండానే వెంటనే అరెస్ట్ చేస్తామని లేదా చట్టపరమైన చర్య తీసుకుంటామని బెదిరించడం.
  • వెరిఫికేషన్, దర్యాప్తు లేదా అకౌంట్ ధ్రువీకరణ పేరుతో డబ్బు బదిలీ చేయాలని అడగడం.
  • ఈ విషయం కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహోద్యోగులకు చెప్పకుండా గోప్యంగా ఉంచాలని ఆదేశించడం.
  • ఎక్కువసేపు వీడియో కాల్‌లోనే ఉండాలని ఒత్తిడి చేయడం.
  • స్వతంత్రంగా నిర్ధారించుకోడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వెంటనే చర్య తీసుకోవాలని ఒత్తిడి చేయడం.

కొన్ని నిమిషాల వెరిఫికేషన్... నెలల తరబడి బాధపడకుండా కాపాడుతుంది

డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్‌లు భవిష్యత్తులోనూ కొత్త రూపాలు దాల్చుతూనే ఉంటాయి. మోసగాళ్లు చెప్పే సంస్థల పేర్లు మారవచ్చు. వారి కథలు మరింత నమ్మదగినవిగా మారవచ్చు. కొత్త టెక్నాలజీలు వారిని మరింత నమ్మదగిన వారిలా కనిపించేలా చేయవచ్చు. కానీ తమకు చెబుతున్న విషయాలను ప్రశ్నించకుండా నమ్మేంతగా ప్రజల్లో భయాన్ని సృష్టించాలన్న వారి లక్ష్యం మాత్రం మారదు. అందుకే ఈ మోసాలు ఎలా జరుగుతాయో అర్థం చేసుకోవడం బాధితులుగా మారకుండా ఉండటానికి గల అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటిగా నిలుస్తుంది.

మీ గుర్తింపు, ఆర్థిక వ్యవహారాలు లేదా నేర కార్యకలాపాలకు సంబంధించిన ఆరోపణలతో ఎవరైనా అనుకోకుండా మిమ్మల్ని సంప్రదిస్తే, వెంటనే స్పందించకుండా ఆగి, లోతుగా శ్వాస తీసుకుని, ఆ తర్వాత ఆ వ్యక్తి చెబుతున్న విషయం నిజమో కాదో కాలర్ ఇచ్చిన కాంటాక్ట్ వివరాలను ఉపయోగించకుండా ఆ సంస్థకు చెందిన అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ ద్వారా స్వతంత్రంగా నిర్ధారించుకోండి.

మీరు సైబర్ మోసానికి గురయ్యారని అనుమానిస్తే వెంటనే చర్య తీసుకోండి. నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (www.cybercrime.gov.in) ద్వారా ఫిర్యాదు చేయండి. అనుమానాస్పద లావాదేవీలను బ్లాక్ లేదా ఫ్రీజ్ చేయడం కోసం వెంటనే మీ బ్యాంకుకు కూడా సమాచారం ఇవ్వండి. ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న అకౌంట్ల పాస్‌వర్డ్‌లను మార్చండి. సాధ్యమైన చోట అదనపు సెక్యూరిటీ ఫీచర్లను ఎనేబుల్ చేయండి. స్క్రీన్‌షాట్‌లు, మెసేజ్‌లు, లావాదేవి వివరాలు, ఫోన్ నంబర్లు వంటి ఆధారాలను భద్రపరచండి. ఇవి దర్యాప్తులో ఉపయోగపడవచ్చు. పరిస్థితిని బట్టి, మీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయాల్సి రావచ్చు.

హిందుస్తాన్ టైమ్స్ సమర్పణలో, ఎయిడెంట్ అమలుతో కొనసాగుతున్న బంధన్ బ్యాంక్ సిఎస్ఆర్ కార్యక్రమమైన 'సైబర్ కాప్' వంటి అవగాహన కార్యక్రమాలు —ఏదైనా పరిస్థితి అత్యవసరంగా అనిపించినప్పుడు, వెంటనే స్పందించడం కంటే కాస్త నెమ్మదించి, సురక్షితమైన మార్గంలో వాస్తవాలను ధ్రువీకరించి, పరిస్థితి నిజమైనదని నిర్ధారించుకున్న తర్వాతే చర్య తీసుకోవడం అనే ఒక సాధారణ ఆలోచనపై ఆధారపడి పనిచేస్తున్నాయి.

కొన్నిసార్లు, ఒక క్లిష్టమైన పరిస్థితిలో కాస్త నెమ్మదిగా వ్యవహరించడమే దాని నుంచి బయటపడటానికి వేగవంతమైన మార్గం.

పాఠకులకు గమనిక: ఈ కథనాన్ని బ్రాండ్ తరఫున హెచ్ టి బ్రాండ్ స్టూడియో రూపొందించింది. ఈ కథనం రూపకల్పన లేదా ప్రచురణలో హెచ్‌టీ తెలుగు సంపాదక బృందానికి ఎలాంటి పాత్ర లేదు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe