విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం.. డీకే తొలి క్యాబినెట్లోనే కీలక నిర్ణయాలు

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్ తొలి క్యాబినెట్ సమావేశంలోనే తన మార్కు చూపించారు. విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం, ఉద్యోగాల భర్తీ క్యాలెండర్, బెంగళూరు అభివృద్ధికి భారీ నిధులు కేటాయిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Published on: Jun 04, 2026 9:10 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బెంగుళూరులోని లోక్ భవన్‌లో కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది గంటల్లోనే డీకే శివకుమార్ పాలనలో వేగం పెంచారు. నూతన మంత్రివర్గంతో కలిసి నిర్వహించిన తొలి క్యాబినెట్ సమావేశంలోనే యువత, విద్యార్థులు, రైతులు, నగర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని పెద్దపీట వేశారు. పలు కీలక సంక్షేమ పథకాలకు ఆమోదం తెలుపుతూ జీవోలు జారీ చేశారు.

కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న డీకే శివకుమార్ (PTI)
కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న డీకే శివకుమార్ (PTI)

"విద్యార్థులందరికీ ఉచితంగా బస్సు పాసులు జారీ చేస్తాం" అని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. ప్రభుత్వానికి చెందిన నాన్-లగ్జరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సదుపాయం వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

నిరుద్యోగ నిర్మూలన, ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఒక ప్రైవేట్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను నెల రోజుల్లోగా ఖరారు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే ఒక స్పష్టమైన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని, గ్రామీణ ప్రాంతాల నుంచి రైతుల వలసలను నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

"ప్రభుత్వం ఇప్పటికే 56,000 ఉద్యోగాలను ప్రకటించింది. తదుపరి క్యాబినెట్ సమావేశం నాటికి అన్ని శాఖలతో సమీక్ష జరిపి, నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి, నియామక ప్రక్రియ ఎలా ప్రారంభమవుతుందో తెలియజేసే క్యాలెండర్‌ను విడుదల చేస్తాం" అని శివకుమార్ వివరించారు.

యువతకు ప్రోత్సాహం, 'ఎ-ఖాతా' విస్తరణ

రాష్ట్రవ్యాప్తంగా అనధికారిక భవనాలకు 'ఎ-ఖాతా' పత్రాలను జారీ చేసే కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి, సామాజిక సామరస్యాన్ని కాపాడటానికి రాష్ట్రంలో 10,000 'భారత్ జోడో యువ సంఘాల'ను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ, పట్టణ వార్డుల్లో 150 నుంచి 200 మంది సభ్యులతో ఈ యువజన సంఘాలు ఏర్పాటవుతాయి. ఇందుకోసం ప్రతి విలేజ్ పంచాయతీ సంఘానికి రూ. 10 లక్షల చొప్పున నిధులు కేటాయించనున్నారు.

బెంగళూరు మౌలిక వసతులకు రూ. 2,000 కోట్లు

సిలికాన్ సిటీ బెంగళూరు రోడ్ల అభివృద్ధిపై కూడా కొత్త ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA), బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (BDA) పరిధిలోని రోడ్ల మౌలిక వసతుల పనుల కోసం క్యాబినెట్ రూ. 2,000 కోట్ల నిధులను మంజూరు చేసింది.

కొలువుదీరిన నూతన మంత్రివర్గం

కర్ణాటక 34వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేయగా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జి. పరమేశ్వర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు మరో 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారిలో యతీంద్ర సిద్ధరామయ్య, ప్రియాంక్ ఖర్గే, ఎంబీ పాటిల్, సతీష్ జార్కిహోళి, కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, కృష్ణా బైరేగౌడ, రామలింగారెడ్డి, యూటీ ఖాదర్, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేష్, డాక్టర్ శరణ్ ప్రకాష్ పాటిల్ ఉన్నారు.

అధిష్ఠానం ఆదేశాల మేరకు మే 28న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సిద్ధరామయ్య క్యాబినెట్‌లో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ మే 30న కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శివకుమార్ 2020 నుంచి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడిగా సేవలు అందించగా, ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీనియర్ నాయకుడు బీకే హరిప్రసాద్‌ను కేపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమించారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More