Delimitation bill : ఎన్డీయేకి పెరుగుతున్న బలం! డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు

వచ్చే వారం పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని డీఎంకే నిర్ణయించింది. సీట్ల వాటా, 25 ఏళ్ల ఫ్రీజ్ నిబంధనలపై స్పష్టత రావడంతో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.

Published on: Nov 28, 2026, 12:19:01 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

వచ్చే వారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని డీఎంకే స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ అంశంపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ, బిల్లుకు అండగా నిలబడతామని తేల్చి చెప్పింది. శనివారం ఉదయం జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.

డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. (@mkstalin X)
డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. (@mkstalin X)

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు ఎందుకు?

ఎంపీల భేటీ అనంతరం డీఎంకే ఎంపీ ఏ రాజా పార్టీ నిర్ణయాన్ని మీడియా ముందు వెల్లడించారు. కొత్త డీలిమిటేషన్ బిల్లుకు తాము మద్దతు ఇస్తామని చెప్పారు. సభలో జరిగే ఓటింగ్ సమయంలోనూ బిల్లుకు మద్దతుగానే నిలబడతామని మరో ఎంపీ దయానిధి మారన్ కూడా పునరుద్ఘాటించారు.

బిల్లులో అన్ని రాష్ట్రాలకు 50 శాతం సమానంగా సీట్లు పెంచే నిబంధనను కేంద్రం చేర్చిన తర్వాతే డీఎంకే ఈ నిర్ణయానికి వచ్చింది. సీట్ల పెంపుపై 25 ఏళ్ల పాటు ఫ్రీజ్ (స్తంభింపజేత) విధిస్తారన్న నిబంధనకు కూడా కేంద్రం అంగీకరించింది. పార్లమెంటు సీట్లలో తమిళనాడు వాటా 7.2 శాతంగా కొనసాగడం, కొత్త లెక్కల ప్రకారం రాష్ట్ర సీట్ల సంఖ్య 39 నుంచి 59కి పెరగడంపై డీఎంకే సంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ ఏడాది ఇప్పటికే ఒకసారి విఫలమైన డీలిమిటేషన్ బిల్లును ఈసారి గట్టెక్కించే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనుంది. ఇంతకాలం ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వచ్చిన డీఎంకే ఇప్పుడు మద్దతిస్తోంది. ఎన్​సీపీ (శరద్​ యాదవ్) సైతం బిల్లుకు సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తుండటం బీజేపీకి సానుకూల విషయం.

స్టాలిన్ మాటలు.. 25 ఏళ్ల ఫ్రీజ్ డిమాండ్

డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ డీలిమిటేషన్‌పై శుక్రవారం తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. జనాభా ఆధారిత పునర్విభజన వల్ల కలిగే ముప్పును ముందుగా గుర్తించి తానే చొరవ తీసుకున్నానని, ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులతో చెన్నైలో సమావేశం ఏర్పాటు చేసి ఉమ్మడి వేదికను నిర్మించానని గుర్తు చేశారు.

తమిళనాడు ప్రయోజనాలే తమకు అత్యంత కీలకమని, లోక్‌సభ ప్రాతినిధ్యంలో ప్రస్తుతం ఉన్న 7.18 శాతం వాటాను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల పంపిణీని మరో 25 ఏళ్ల పాటు అలాగే కొనసాగించాలని కోరారు.

ప్రాతినిధ్యం తగ్గకుండా చూడటమే లక్ష్యం!

పార్లమెంటు మొత్తం సీట్ల సంఖ్య పెంచడంపై తమకు అభ్యంతరం లేదని, ఆ క్రమంలో తమిళనాడు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకుండా చూసుకోవడమే తమ అసలు ఆందోళన అని డీఎంకే వర్గాలు వెల్లడించాయి.

"మాకు పెద్ద పార్లమెంటు అవసరం లేదు. కానీ సీట్లు పెంచాలని గట్టిగా నిర్ణయించినప్పుడు, కనీసం మా వాటా మాకు దక్కాలి," అని ఓ సీనియర్ నేత ఓ జాతీయ మీడియాతో అన్నారు.

తమిళనాడులో కాంగ్రెస్‌తో విడిపోయిన తర్వాత డీఎంకే తన వైఖరి మార్చుకుందన్న ఆరోపణలను ఆ పార్టీ కొట్టిపారేసింది. న్యాయబద్ధమైన డీలిమిటేషన్ జరగాలన్నదే మొదటి నుంచీ తమ డిమాండ్ అని స్పష్టం చేసింది.

ఈ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేని వీడి కాంగ్రెస్​ విజయ్ నేతృత్వంలోని టీవీకేకి మద్దతిచ్చిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.