శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.
సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు- డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఉత్కంఠ!
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లులపై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి.
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం కీలక ప్రకటన వెలువడింది. అత్యవసర ప్రభుత్వ వ్యవహారాలను చక్కదిద్దేందుకు ఉభయ సభలను మళ్లీ సమావేశపరచాలని కోరినట్లు కేంద్రం వెల్లడించింది. 2029 ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులను ముందుకు తీసుకెళ్లేందుకే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారన్న ఊహాగానాలు ఈ నేపథ్యంలో జోరుగా సాగుతున్నాయి.

లోక్‌సభ, రాజ్యసభ బులెటిన్లలో కీలక అంశాలివే..
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌లను ఉభయ సభలను తిరిగి సమావేశపరచాలని కోరినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్‌సభను నవంబర్ 30న, రాజ్యసభను డిసెంబర్ 2న పునఃప్రారంభించాలని ప్రతిపాదించారు.
“అత్యవసర ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించేందుకు 2026 నవంబర్ 30 సోమవారం నాడు లోక్‌సభను, 2026 డిసెంబర్ 2 బుధవారం నాడు రాజ్యసభను తిరిగి సమావేశపరచాలని గౌరవనీయ లోక్‌సభ స్పీకర్‌ను, రాజ్యసభ చైర్మన్‌ను ప్రభుత్వం కోరింది. సభా వ్యవహారాల అవసరాలకు అనుగుణంగా డిసెంబర్ 3, 2026న ఉభయ సభల సమావేశాలు ముగిసే అవకాశం ఉంది,” అని కిరణ్ రిజిజు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.
ఆగస్టు 13న ముగిసిన వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం నిరవధికంగా వాయిదా వేసింది తప్ప ప్రోరోగ్ చేయలేదు. నిబంధనల ప్రకారం ప్రత్యేక సమావేశాలకు మూడు రోజుల ముందే నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. సభ ప్రోరోగ్ కానందున లోక్‌సభ నిబంధన 15, రాజ్యసభ నిబంధనల ప్రకారం కొత్తగా సమావేశాలకు పిలవాల్సిన అవసరం లేకుండానే స్పీకర్ లేదా చైర్మన్ సభను ఎప్పుడైనా నడపవచ్చు. 18వ లోక్‌సభ ఎనిమిదో సమావేశాల్లోని రెండో భాగాన్ని నవంబర్ 30 ఉదయం 11 గంటలకు ప్రారంభించాలని స్పీకర్ ఆదేశించినట్లు లోక్‌సభ బులెటిన్ తెలిపింది. రాజ్యసభ 271వ సమావేశాలను డిసెంబర్ 2 ఉదయం 11 గంటలకు పునఃప్రారంభిస్తున్నట్లు రాజ్యసభ సచివాలయం ప్రకటించింది.
అయితే ఈ నాలుగు రోజుల సిట్టింగ్‌లలో ప్రశ్నోత్తరాల సమయం (క్వశ్చన్ అవర్), జీరో అవర్, ప్రైవేట్ మెంబర్స్ బిజినెస్ ఉండవని రెండు బులెటిన్లు స్పష్టం చేశాయి.
డీలిమిటేషన్, మహిళా కోటా బిల్లులపై మళ్లీ కదలిక!
ప్రభుత్వం తాజాగా సమావేశాలు ప్రతిపాదించడంతో లోక్‌సభ సీట్ల పెంపు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల వేగవంతమైన అమలు కోసం ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లులలో ఒకటి ఏప్రిల్‌లో లోక్‌సభలో అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించలేక వీగిపోయింది. ఆ తర్వాత 2011 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన నిర్దేశించే బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ప్రవేశపెట్టే తీర్మానానికి సాధారణ మెజారిటీ సరిపోయినా, కీలక నిబంధనల ఆమోదానికి, పరిశీలన-ఆమోద తీర్మానాలకు సభ మొత్తం సభ్యుల్లో మెజారిటీతో పాటు హాజరై ఓటు వేసిన సభ్యులలో కనీసం మూడింట రెండు వంతుల ఆమోదం తప్పనిసరి.
అధికార, విపక్షాల మధ్య పోరు.. ఉత్తర-దక్షిణ వాదనలు!
లోక్‌సభ సీట్ల గరిష్ఠ పరిమితిని 850కి పెంచి, 2029 ఎన్నికల నాటికి 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని రాష్ట్రాలకు 50 శాతం దామాషా పెంపును బిల్లులో చేరుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చివరి నిమిషంలో ప్రతిపాదించినా, విపక్షాలు పట్టువీడకపోవడంతో ఆ బిల్లు నిలబడలేకపోయింది. బిల్లు ఓటమిపై అధికార పక్షం నిరసనలకు దిగగా, మహిళా రిజర్వేషన్లకు తాము అనుకూలమేనని, కానీ డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్నామని విపక్షాలు స్పష్టం చేశాయి.
1990లు, 2000లలో ప్రాంతీయ పార్టీల వ్యతిరేకత కారణంగా మహిళా కోటా బిల్లులు ముందుకు సాగలేదు; 2010లో రాజ్యసభలో ఆమోదం పొందినా లోక్‌సభలో ఆగిపోయింది. చివరికి 2023లో 'నారీ శక్తి వందన్ అధినియం' ఆమోదం పొందినా, కొత్త జనాభా లెక్కలు, పునర్విభజన తర్వాతే 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని అందులో పేర్కొన్నారు. 2023 చట్టం ఈ ఏడాది ఏప్రిల్‌లో అమల్లోకి వచ్చింది. అయితే వచ్చే జనాభా లెక్కల కోసం వేచి చూడకుండా, 2011 జనాభా లెక్కల ఆధారంగా జరిగే పునర్విభజనతో మహిళా కోటాను ముడిపెట్టేందుకు ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో మూడు బిల్లులను ప్రవేశపెట్టింది.
మరోవైపు దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో సుమారు 30 నుంచి 31 శాతం వాటా అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన సీట్లలో అన్యాయం జరుగుతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కేవలం జనాభానే ప్రాతిపదికగా తీసుకోకూడదని దక్షిణాది రాష్ట్రాలు పదేపదే కోరుతున్నాయి. సమానంగా 50 శాతం పెంపు చేస్తే దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్ల వాటా 23.76 శాతం నుంచి 23.87 శాతానికి స్వల్పంగా పెరుగుతుందని ప్రభుత్వం వాదించగా, ఆ ఫార్ములాకు బిల్లులో స్పష్టమైన హామీ లేదని విమర్శకులు ఎత్తిచూపారు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 3 వరకు సాగే ఈ సమావేశాలలో ప్రభుత్వం ఎలాంటి బిల్లులను ముందుకు తెస్తుందనేది దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

E-Paper
