Rajya Sabha Polls : రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా - కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ!
Rajya Sabha polls Madhya Pradesh 2026 : మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అఫిడవిట్‌లో సమాచారం దాచారనే ఆరోపణలతో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయపోరాటానికి సిద్ధమైంది.
Rajya Sabha polls Madhya Pradesh 2026 : మధ్యప్రదేశ్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలు ఒక్కసారిగా అత్యంత నాటకీయ మలుపు తీసుకున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ లోక్‌సభ సభ్యురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. అఫిడవిట్‌లో కీలక సమాచారాన్ని దాచారనే ఆరోపణలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. జూన్ 18న ఈ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. జూన్ 8తో నామినేషన్ల గడువు ముగియగా, పరిశీలన ప్రక్రియలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. మీనాక్షి నటరాజన్ సమర్పించిన పత్రాలను నిశితంగా పరిశీలించిన తర్వాత ఆమె అఫిడవిట్ అసంపూర్తిగా ఉన్నట్లు తేలింది. నామినేషన్‌తో పాటు సమర్పించే ఫారమ్ 26లో ఒక కోర్టు ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను ఆమె పేర్కొనలేదు.
తెలంగాణలోని ఒక కోర్టులో మీనాక్షి నటరాజన్‌పై నమోదైన కేసుకు సంబంధించిన వివరాలను ఆమె తన అఫిడవిట్‌లో పొందుపరచలేదని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి మహేష్ కేవత్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇరు పక్షాల లాయర్లు తమ వాదనలను వినిపించారు. సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం రిటర్నింగ్ అధికారి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారని మధ్యప్రదేశ్ అసెంబ్లీ అధికారి ఒకరు వెల్లడించారు.
బీజేపీ అభ్యర్థి కేవత్ తరఫు న్యాయవాది సంకేత్ గుప్తా అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థులు తమపై ఉన్న అన్ని క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్‌లో కచ్చితంగా పేర్కొనాలని, అయితే మీనాక్షి నటరాజన్ ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ కోర్టులోని కేసు వివరాలను దాచారని చెప్పారు. అందుకే నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు.
ఇది ప్రజాస్వామ్య హత్య: కాంగ్రెస్ నిరసనలు
నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అభివర్ణించింది. ఇప్పటివరకు దేశంలో 'ఓట్ల దొంగతనం' చూశామని, కానీ ఇప్పుడు బీజేపీ ఏకంగా 'సీటు దొంగతనానికి' పాల్పడుతోందని ధ్వజమెత్తింది. ఈ అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. అయితే ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ హైకోర్టుకు వెళ్తారా లేక నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అనే విషయంపై పార్టీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తంఖా మాత్రం ఈ అంశాన్ని నేరుగా సుప్రీంకోర్టుకే తీసుకెళ్లాలని పార్టీకి సూచించారు. ఈ పరిణామాలకు నిరసనగా భోపాల్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయం వెలుపల కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టాయి. బుధవారం భోపాల్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేస్తారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ప్రకటించారు.
మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాలను తాను వ్యక్తిగతంగా పరిశీలించానని, అందులో దాచాల్సిన సమాచారం ఏదీ లేదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వివేక్ తంఖా స్పష్టం చేశారు. "ఆమెపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 223 కింద కేవలం ఒక నోటీసు మాత్రమే ఉంది. అందులో ఒక దరఖాస్తుదారుడు తనకు, ఇతరులకు రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఆ నోటీసుపై మీనాక్షి నటరాజన్ అప్పుడే అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కాబట్టి ఆ నోటీసు తనకు పంపడం చెల్లదని పేర్కొన్నారు. ఆమెపై ఎలాంటి నేరం నమోదు కాలేదు, ఎఫ్‌ఐఆర్ లేదు, ఎలాంటి చట్టపరమైన కేసు పెండింగ్‌లో లేదు. అలాంటప్పుడు దాన్ని ఎఫ్‌ఐఆర్ లేదా జుడీషియల్ కేస్ అని ఎలా అంటారు? కోర్టు కేవలం నోటీసు జారీ చేసినంత మాత్రాన అది కేసుగా మారదు" అని తంఖా సుదీర్ఘంగా వివరించారు.
ఈ నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్వాగతించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఒక క్రిమినల్ కేసుకు సంబంధించిన సమాచారాన్ని దాచారని, దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన హితవు పలికారు. రాష్ట్ర మంత్రి కైలాష్ విజయ్‌వర్గీయ స్పందిస్తూ…. ఇది న్యాయానికి దక్కిన విజయమని, రాజ్యాంగబద్ధమైన విధానాల ప్రకారమే బీజేపీ అభ్యంతరాలను లేవనెత్తిందని పేర్కొన్నారు. నామినేషన్ తిరస్కరణపై బీజేపీ అభ్యర్థి మహేష్ కేవత్ హర్షం వ్యక్తం చేస్తూ.. ఇది సత్యానికి దక్కిన విజయమని, నిజాన్ని దాచిన వారికి ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.
మధ్యప్రదేశ్‌లో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో అధికార బీజేపీ రెండు స్థానాలను సులువుగా గెలుచుకునే బలం కలిగి ఉంది. సంఖ్యాబలం ప్రకారం మూడో స్థానంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుత సమర్థవంతమైన బలం 229గా ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థి విజయం సాధించడానికి 58 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం అవుతాయి.
ఈ నేపథ్యంలో మూడో సీటును ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉండటాన్ని తట్టుకోలేకే ఇటువంటి చట్టపరమైన అస్త్రాలను ప్రయోగిస్తోందని మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. తమ సంఖ్యాబలాన్ని దెబ్బతీసి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అణచివేయాలని చూస్తున్నారని ఆమె మండిపడ్డారు.
బీజేపీ కుట్ర - సీఎం రేవంత్ రెడ్డి
మీనాక్షీ నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడం ద్వారా బీజేపీ కుట్రకు పాల్పడిందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్(సర్)తో ఓటు చోరీకి పాల్పడిన ఆ పార్టీ.. ఇప్పుడు సీటుచోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణలో మీనాక్షీ నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టంచేశారు. మంగళవారం రాత్రి సీఎం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

