తృణమూల్ కాంగ్రెస్‌లో భారీ చీలిక: ఎంపీలు, ఎమ్మెల్యేల తిరుగుబాటుతో బీజేపీ బలం పెరుగుతుందా? నెంబర్ల గేమ్ ఇదే

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) తీవ్ర అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయింది. పార్టీ లెజిస్లేచర్ విభాగంలో ప్రారంభమైన ఈ అసమ్మతి, ఇప్పుడు పార్లమెంటరీ స్థాయికి చేరి పూర్తిస్థాయి చీలికకు దారితీసింది. 

Published on: Jun 8, 2026, 18:16:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. గత నెల ఎన్నికల పరాజయం తర్వాత టీఎంసీలో అసమ్మతి జ్వాలలు ముమ్మరమ్యాయి. ఏకంగా 20 మంది లోక్‌సభ ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూటమికి మద్దతు ఇవ్వడానికి సిద్ధమవగా, రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేలు విడిగా చీలిపోయారు. ఈ తిరుగుబాటు పార్లమెంట్, అసెంబ్లీలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో పరిశీలిద్దాం.

ఇండియా బ్లాక్ సమావేశం సందర్భంగా సోనియాగాంధీని ఆలింగనం చేసుకుంటున్న మమతా బెనర్జీ (AICC)
ఇండియా బ్లాక్ సమావేశం సందర్భంగా సోనియాగాంధీని ఆలింగనం చేసుకుంటున్న మమతా బెనర్జీ (AICC)

లోక్‌సభలో మారిన సమీకరణాలు

లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్ కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో దాదాపు 20 మంది ఎంపీలు తాము ఎన్‌డీయే (NDA) కూటమికి అధికారికంగా మద్దతు ఇస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.

ప్రస్తుతం లోక్‌సభలో టీఎంసీకి మొత్తం 28 మంది సభ్యులు ఉన్నారు (బసిర్‌హాట్ ఎంపీ హాజీ నూరుల్ ఇస్లాం మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది). తాజా చీలికతో మమతా బెనర్జీ వైపు కేవలం 8 మంది ఎంపీలు మాత్రమే మిగిలారు.

బీజేపీకి లాభమేనా?

ఈ రెబెల్ ఎంపీలు లోక్‌సభలో ఒక ప్రత్యేక పార్లమెంటరీ బ్లాక్‌గా ఉంటూనే కేంద్రంలోని ఎన్‌డీయే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వనున్నారు. ఇది పరోక్షంగా లోక్‌సభలో బీజేపీ కూటమి బలాన్ని మరింత పెంచనుంది.

రాజ్యసభలోనూ ఎదురుదెబ్బ

మరోవైపు, టీఎంసీ సీనియర్ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పార్టీకి, అలాగే తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభలో టీఎంసీ బలం 13 నుండి 12కి పడిపోయింది. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, ఆర్‌జీ కర్ హాస్పిటల్ అత్యాచారం-హత్య కేసును పార్టీ హ్యాండిల్ చేసిన విధానంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని ఆయన ఆరోపించారు.

“ఆర్‌జీ కర్ హాస్పిటల్ ఘటనపై నేను బహిరంగంగా మాట్లాడినప్పటి నుండి పార్టీ నన్ను దూరం పెట్టింది. సాక్ష్యాల నాశనంలో కీలక పాత్ర పోషించిన కొందరు పోలీసులపై అంతర్గత విచారణ జరపాలని డిమాండ్ చేయడమే నేను చేసిన తప్పు. ప్రస్తుతానికి నేను ఏ పార్టీలో చేరడం లేదు, బహుశా క్రియాశీల రాజకీయాల నుంచే తప్పుకోవచ్చు” అని సుఖేందు శేఖర్ రాయ్ వ్యాఖ్యానించారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తిరుగుబాటు కొండంత

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీకి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అందులో 58 మంది ఎమ్మెల్యేలు అధిష్టానంపై తిరుగుబాటు చేశారు. పార్టీ అధికారికంగా ప్రతిపాదించిన శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయను తిరస్కరించి, రితబ్రత బెనర్జీని తమ నేతగా ఎన్నుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్ ఈ 58 మంది తిరుగుబాటు గ్రూపును ప్రత్యేక లెజిస్లేటివ్ బ్లాక్‌గా అధికారికంగా గుర్తించడమే కాకుండా, రితబ్రత బెనర్జీని అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా ఆమోదించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉండగా, సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఈ రెబెల్ ఎమ్మెల్యేలు తాము సెంబ్లీలో బాధ్యతాయుతమైన, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని, కేవలం వ్యతిరేకత కోసమే ప్రభుత్వాన్ని అడ్డుకోబోమని స్పష్టం చేశారు. అంతేకాదు, మమతా బెనర్జీని తమ కొత్త లెజిస్లేటివ్ టీమ్‌కు 'చీఫ్ అడ్వైజర్' (ప్రధాన సలహాదారు)గా ఉండాలని కోరతామని రితబ్రత బెనర్జీ పేర్కొనడం గమనార్హం.

సభల వారీగా టీఎంసీ బలాబలాలు (నెంబర్ గేమ్):

సభ పేరుమొత్తం సభ్యులురెబెల్స్ / రాజీనామా చేసినవారుమమతా బెనర్జీ పక్షాన ఉన్నవారు
లోక్‌సభ28 (1 ఖాళీ)20 (ఎన్‌డీయేకి మద్దతు)8
రాజ్యసభ131 (రాజీనామా)12
బెంగాల్ అసెంబ్లీ8058 (ప్రత్యేక బ్లాక్)22
  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More