నియోజకవర్గాల పునర్విభజన : ఏపీ, తెలంగాణలో ఎన్ని లోక్‌సభ స్థానాలు పెరుగుతాయి..?
Delimitation in Telugu States : నియోజకవర్గాల పునర్విభజనతో తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రం మారబోతోంది. ఏపీలో లోక్ సభ సీట్లు 38కి, తెలంగాణలో 26కి పెరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాల్లోనూ భారీ మార్పులు రానున్నాయి.
Delimitation in Telugu States : దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన 'నియోజకవర్గాల పునర్విభజన బిల్లు - 2026'తో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం భారీగా పెరగనుంది.

కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నియోజకవర్గాల పునర్విభజనతో తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్ర మారే అవకాశం ఉంటుంది. లోక్ సభతో పాటు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం ఉన్న వాటిలో నుంచి కొన్నింటిని తీసుకొని కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తారు.
లోక్ సభ సీట్ల లెక్కలివే!
ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 సీట్లను గరిష్టంగా 850 వరకు పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోనూ సీట్లు పెరుగుతాయి.
- ఆంధ్రప్రదేశ్: ప్రస్తుతం ఏపీలో 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం…. ఇది 50 శాతం వరకు పెరిగి 38 స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. అంటే కొత్తగా 13 ఎంపీ సీట్లు అందుబాటులోకి వస్తాయి.
- తెలంగాణ : ప్రస్తుతం ఉన్న 17 ఎంపీ స్థానాలు 26కు పెరిగే అవకాశం ఉంది. జనాభా పెరుగుదల దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అదనపు స్థానాలు వచ్చే వీలుంది.
దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా మల్కాజిగిరి ఉంది. అంతేకాకుండా సికింద్రాబాద్, హైదరాబాద్, భువనగిరి స్థానాలను విభజించి కొత్త నియోజకవర్గాలను ఏర్పాటవుతాయి.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలను విభజించి అదనంగా మరో రెండు స్థానాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మెదక్, జహీరాబాద్‌లకు తోడు మరొక కొత్త స్థానం రానుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ విభజన ద్వారా అదనంగా ఒక స్థానం ఏర్పడనుంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఒకటి లేదా రెండు కొత్త స్థానాలు వచ్చే అవకాశాలుంటాయి.
ఇక ఏపీలో చూస్తే…. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లో లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. తెనాలి లాంటి రద్దయిన లోక్‌సభ స్థానాలు కూడా మళ్లీ ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంటుంది.
జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెరుగుతాయని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో గురువారం స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదన్నారు. 50 శాతం పెంపు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కు సీట్లు పెరుగుతాయని వివరించారు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న అనుమానాల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పారు.
నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో అమలు కాదని అమిత్ షా తెలియజేశారు. డీలిమిటేషన్ కమిషన్ నివేదికను పార్లమెంటు ఆమోదించి… రాష్ట్రపతి ముద్ర పడిన తర్వాతే అమల్లోకి వస్తుందని వివరించారు.
పెరగనున్న అసెంబ్లీ సీట్లు:
నియోజకవర్గాల పునర్విభజనతో తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల్లో భారీ మార్పులు ఉండనున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 179కి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు… ఏకంగా 45కి చేరుకోనున్నాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 260 దాటే అవకాశం ఉంది. విభజన చట్టం ప్రకారం సీట్లు పెంచుతామని గతంలో ఇచ్చిన హామీ కంటే ఎక్కువే ఇక్కడ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల నియోజకవర్గాల పరిధి తగ్గి…. ప్రజలకు ప్రజాప్రతినిధులు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది.
నియోజకవర్గాల పునర్విభజనతో పాటు 33 శాతం మహిళా రిజర్వేషన్లు కూడా అమలులోకి రానున్నాయి. సీట్ల సంఖ్య పెరగడంతో తెలుగు రాష్ట్రాల నుంచి పార్లమెంటుకు వెళ్లే మహిళా ఎంపీల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అంతేకాకుండా అసెంబ్లీలోనూ వారి ప్రాతినిధ్యం పెరగనుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

