Supreme Court : ‘ఎక్కడం మానేయండి’.. విమాన టికెట్ ధరల భారీ పెంపుపై సుప్రీంకోర్టు!

విమాన టికెట్ల ధరలు 700 శాతం పెరిగాయని, అత్యవసరంగా విచారించాలని కోరిన లాయర్‌కు సుప్రీంకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ‘ఎక్కడం మానేయండి’ అంటూ సుప్రీంకోర్టు జడ్జి వ్యాఖ్యానించారు. అసలేం జరిగిందంటే..

Published on: Nov 3, 2026, 05:45:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

విమాన ప్రయాణం ఖరీదైపోతోంది.. టికెట్ల ధరలు ఏకంగా 700 శాతం పెరిగాయి, తక్షణమే జోక్యం చేసుకోండి అంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఒక పిటిషనర్‌కు ఊహించని షాక్ ఎదురైంది. "టికెట్ల ధరలు అంతగా పెరిగితే విమానాల్లో ప్రయాణించడం మానేయండి" అని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

విమాన టికెట్ ధరల భారీ పెంపుపై సుప్రీంకోర్టు స్పందన.. (AFP/Representative)
విమాన టికెట్ ధరల భారీ పెంపుపై సుప్రీంకోర్టు స్పందన.. (AFP/Representative)

విమాన ఛార్జీల అనియంత్రిత పెంపుపై దాఖలైన అత్యవసర పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా విమాన ప్రయాణికుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

విమాన ప్రయాణం అత్యవసర సేవ: పిటిషనర్ వాదన

న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్​లతో కూడిన ధర్మాసనం ఎదుట ఒక న్యాయవాది ఈ విషయాన్ని ప్రస్తావించారు. దేశంలో విమాన టికెట్ల ధరలు 700 శాతం వరకు పెరిగాయని, దీనిపై అత్యవసరంగా విచారణ జరిపి ధరలను అదుపు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు.

దీనికి సమాధానంగా "అయితే విమానాల్లో ప్రయాణించడం మానేయండి" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై సదరు న్యాయవాది స్పందిస్తూ.. నేటి కాలంలో విమాన ప్రయాణం అనేది విలాసం కాదని, అదొక అత్యవసర సేవ అని పేర్కొన్నారు. ప్రైవేట్ విమానయాన సంస్థలు ఇష్టారీతిన ఛార్జీలు పెంచడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు) కు భంగం కలిగించడమేనని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి బదులుగా.. “విమానాలు ఎక్కకండి. నెక్ట్స్ కేస్” అని జస్టిస్ విక్రమ్ అన్నారు.

పండుగల వేళ విమాన సంస్థల దోపిడీపై ఇప్పటికే మరో పిటిషన్!

వాస్తవానికి దేశంలో విమాన ఛార్జీల్లో వస్తున్న తీవ్రమైన హెచ్చుతగ్గులు, అనవసరమైన అదనపు చార్జీలను నియంత్రించేందుకు ఒక స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలంటూ సామాజిక కార్యకర్త ఎస్.లక్ష్మీనారాయణన్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.

ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ప్రైవేట్ విమానయాన సంస్థల తీరును తీవ్రంగా తప్పుపట్టింది. పండుగలు, అత్యవసర సమయాల్లో విమాన టికెట్ల ధరలను విపరీతంగా పెంచడాన్ని "ప్రయాణికుల దోపిడీ" గా అభివర్ణించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం, డీజీసీఏ తక్షణమే సమాధానం చెప్పాలని ఆదేశించింది.

నిబంధనలపై కేంద్రం స్పష్టత..

అక్టోబర్ 16న జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు. భారతదేశ విమానయాన రంగాన్ని ఆధునీకరించడానికి, ధరలను నియంత్రించడానికి 'భారతీయ వాయుయాన్ అధినియమ్, 2024' కింద కొత్త నిబంధనలను రూపొందించినట్లు తెలిపారు.

ఈ నిబంధనలకు ఇప్పటికే పరిపాలనాపరమైన ఆమోదం లభించిందని, రెండు వారాల్లో అధికారికంగా ప్రచురిస్తామని స్పష్టం చేశారు. దీనితో ప్రచురించిన ఆ నిబంధనల కాపీని నవంబర్ 16న జరిగే తదుపరి విచారణ నాటికి తమ ముందుంచాలని ధర్మాసనం సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది.

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులపై పడే ప్రభావం ఎంత?

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ఎయిర్‌పోర్టుల నుంచి దిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలకు ప్రయాణించే పర్యాటకులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు ఈ విమాన ఛార్జీల బాదుడు పెద్ద సమస్యగా మారింది. పండుగల సమయాల్లో లేదా అత్యవసరంగా విమానం బుక్ చేసుకోవాల్సి వస్తే అసలు ధర కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారు.

విమానయాన రంగంలో ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుబోయే కొత్త చట్టం నిబంధనలు నవంబర్ 16న సుప్రీంకోర్టు ముందుకు రానున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఉపశమనం లభిస్తుందో లేదో వేచి చూడాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More