విమానం క్రాష్‌కి కుట్ర- రక్తమోడుతున్నా 180 మందిని కాపాడిన భారత పైలట్! కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ సాహస గాథ..
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు కో-పైలట్ పన్నుతున్న కుట్రను భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ తిప్పికొట్టారు. తీవ్ర గాయాలైనప్పటికీ చాకచక్యంగా వ్యవహరించి 180 మంది ప్రాణాలను కాపాడిన ఆయన్ని ప్రధాని మోదీ, నెతన్యాహు, ట్రంప్ 'రియల్ హీరో'గా కొనియాడారు.
ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో ఊహించని భయాందోళన.. తోటి కో-పైలటే విమానాన్ని కూల్చివేసేందుకు కత్తితో దాడికి తెగబడ్డాడు.. తీవ్రంగా గాయపడి, శరీరం నుంచి రక్తం కారుతున్నా సరే.. అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించి 180 మంది ప్రాణాలను కాపాడారు ఒక భారతీయ పైలట్! ముంబైకి చెందిన కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ చూపిన అసమాన ధైర్యం, తెగువ వల్ల ప్రపంచం మరో 9/11 తరహా విషాదం నుంచి తప్పించుకుంది!
ఆకాశంలో ఉన్మాది కో-పైలట్..!
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ (FZ1073) బోయింగ్ 737 విమానం గాల్లో ఉండగా ఈ దారుణం జరిగింది. విమానంలో 27 మంది చిన్నారులు, ఆరుగురు సిబ్బందితో కలిపి మొత్తం 180 మంది ఉన్నారు. ప్రయాణం మధ్యలో ఒమన్ జాతీయుడైన కో-పైలట్ ఉన్నట్టుండి విమానాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నాడు. కాక్‌పిట్ సిస్టమ్స్‌ను నిలిపివేసి విమానాన్ని కిందకు దించేందుకు యత్నించాడు.
దీనిని గమనించి అడ్డుకోబోయిన ప్రధాన పైలట్ (ఫస్ట్ ఆఫీసర్) స్మిత్ మచ్ఛార్‌పై కో-పైలట్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన స్మిత్, రక్తమోడుతూ కాక్‌పిట్ నేలపై పడిపోయారు. అయినా సరే, సగం స్పృహలోనే చాకచక్యంగా కాక్‌పిట్ తలుపుల రిలీజ్ బటన్‌ను నొక్కారు. దీనితో వెంటనే కాక్‌పిట్ తలుపులు తెరుచుకున్నాయి. అలర్ట్ అయిన విమాన సిబ్బంది, ఒక ఇజ్రాయెల్ ప్రయాణికుడు లోపలికి ప్రవేశించి ఉన్మాది అయిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అప్పటికే విమానం వేగంగా కిందకు పడిపోతూ అత్యవసర సిగ్నల్స్ పంపింది. ప్రయాణికులు, సిబ్బంది సహాయంతో కో-పైలట్‌ను కట్టడి చేసిన అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లోని ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దెల్ అజీజ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
దాడికి పాల్పడిన ఒమన్ కో-పైలట్‌ను సౌదీ అధికారులు అరెస్టు చేసి సమగ్ర విచారణ జరుపుతున్నారు.
టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ నుంచి ఏవియేషన్ రంగానికి..
ముంబైలోని ఘాట్‌కోపర్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన స్మిత్ మచ్ఛార్ జీవిత ప్రయాణం ఎంతో ఆసక్తికరమైనది! చిన్నప్పుడు కుటుంబానికి చెందిన టెక్స్‌టైల్ వ్యాపారంలోకే వెళ్లాలని భావించారు. స్కూల్ విద్య పూర్తయ్యాక టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతుండగా ఒక ఏవియేషన్ సెమినార్‌కు హాజరయ్యారు. అక్కడే ఆయనకు పైలట్ కావాలనే ఆసక్తి కలిగింది. 2007-2008 సమయంలో వెలింగ్‌కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి డిగ్రీ పూర్తి చేశారు.
తన 19 ఏళ్ల వయసులో పైలట్ కావాలని నిర్ణయించుకున్నప్పుడు కుటుంబంలో భిన్నమైన స్పందన వచ్చింది. గతంలో జలక్ మెహతా అనే పాడ్‌కాస్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్ ఈ విషయాలను గుర్తుచేసుకున్నారు. "మా అమ్మ చాలా భయపడింది. 15-17 ఏళ్ల క్రితం ఏవియేషన్ రంగం ఇప్పుడు ఉన్నంత విస్తృతంగా లేదు. పైలట్లు అయ్యేవారు చాలా తక్కువ మంది ఉండేవారు. విమానాలు నడపడం అనే విషయాన్నే అమ్మ భయంగా భావించేది. కానీ నాన్న చాలా ప్రశాంతంగా నా నిర్ణయాన్ని సమర్థించారు," అని స్మిత్ చెప్పారు.
సుదీర్ఘ అనుభవం ఉన్న అనుభవజ్ఞుడు..
స్మిత్ మచ్ఛార్‌కి విమానయాన రంగంలో అపారమైన అనుభవం ఉంది. ఫ్లైదుబాయ్‌లో చేరడానికి ముందు ముంబైలోని స్పైస్‌జెట్ సంస్థలో 11 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సేవలందించారు. అక్కడ సీనియర్ కమాండర్‌గా, నవంబర్ 2020 నుంచి లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా ఇతర పైలట్లకు శిక్షణ ఇచ్చారు. స్పైస్‌జెట్‌లో పైలట్-ఇన్-కమాండ్‌గా 6,400 గంటలకు పైగా విమానాలు నడిపిన అనుభవం ఆయనకు ఉంది.
2022 జూన్ నుంచి ఫ్లైదుబాయ్‌లో బోయింగ్ 737 ఫ్లీట్‌కు డైరెక్ట్-ఎంట్రీ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బోయింగ్ 737-800, 737 మ్యాక్స్ 8, 9 విమానాల్లో మొత్తం 9,750 గంటలకు పైగా ఫ్లయింగ్ అనుభవం సాధించారు.
మచ్ఛర్ సోదరుడు కూడా 'ఆకాశ ఎయిర్' సంస్థలో పైలట్‌గా సేవలందిస్తున్నారు.
సౌదీలో చికిత్స.. ప్రభుత్వం అండ
కత్తిపోట్ల దాడిలో తీవ్రంగా గాయపడిన స్మిత్ మచ్ఛార్ ప్రస్తుతం సౌదీ అరేబియాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ముంబై ఘాట్‌కోపర్ ఈస్ట్ ఎమ్మెల్యే పరాగ్ షా స్మిత్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆయన క్షేమంగా ఉన్నారని ధృవీకరించారు. మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆయన చికిత్స వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాయి. స్మిత్ తల్లిదండ్రులు ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు.
ప్రపంచ నాయకుల ప్రశంసల వర్షం..
స్మిత్ మచ్ఛార్ వీరత్వానికి ప్రపంచ దేశాల అధినేతలు దాసోహమైపోయారు! ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
"కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ ఒక రియల్ హీరో! అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో, తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన అసాధారణ ధైర్యాన్ని, సడలని నిబద్ధతను ప్రదర్శించారు. ఆయన సాహసమే వందలాది ప్రాణాలను కాపాడి పెద్ద విషాదాన్ని తప్పించింది," అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రశంసించారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు కూడా స్మిత్ ధీరత్వాన్ని కొనియాడారు. "తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన ఎదురుతిరిగి పోరాడారు. కాక్‌పిట్ తలుపులు తెరిచి ప్రయాణికులు, సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకునేలా చేశారు. ఇజ్రాయెల్ పౌరులతో పాటు174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన స్మిత్ నిజమైన కథానాయకుడు," అని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, "ఆ కో-పైలట్ బహుశా ఉగ్రవాది అయి ఉండవచ్చు లేదా మానసిక స్థితి సరిగా లేనివాడై ఉండవచ్చు. తీవ్ర గాయాలతో ఉన్నప్పటికీ స్మిత్ సమయస్ఫూర్తితో వ్యవహరించి సహాయం కోసం కేకలు వేశారు. ఆయన నిజంగా గొప్ప వీరుడు," అని వ్యాఖ్యానించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


