అసోంలో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాలకు, మోరిగావ్‌లో భూమి కంపించింది. రిక్టార్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.1గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలాజీ (ఎన్సీఎస్) ధ్రువీకరించింది.

ఎన్సీఎస్ ప్రకారం భూమికి 50 కి.మీల లోతున ఈ భూకంపం సంభవించింది. అసోంలోని అనేక జిల్లాలతో పాటు మేఘాలయలోని షిల్లాంగ్ వరకు కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి.
అసోం భూకంపంతో ప్రజలు ఒక్కసారిగా ఉల్లిక్కిపడ్డారు. ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.
ఈ భూకంపంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్త వహించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
అంతకుముందు, సోమవారం తెల్లవారుజామున 3 గంటల 3 నిమిషాల ప్రాంతంలో త్రిపురాలో భూకంపం సంభవించింది. గోమటి అనే ప్రాంతంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 3.9గా రికార్డు అయ్యింది.
నేపాల్‌ని వణికించిన భూకంపాలు..
మరోవైపు జనవరి 3న రెండు భూకంపాలు నేపాల్ ప్రజలను వణికించాయి. శనివారం ఉదయం పశ్చిమ నేపాల్‌లోని తప్లేజంగ్ జిల్లాలో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 6 గంటల 13 నిమిషాలకు భూమి కంపించింది.
ఇక శనివారం రాత్రి 10 గంటల 36 నిమిషాలకు తూర్పు నేపాల్‌లోని ఉదయాపుర్ జిల్లాలో కూడా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 4.3గా నమోదైంది.
ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.