ఈడీ భారీ యాక్షన్: తృణమూల్ కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాల్లో రూ.440 కోట్లు ఫ్రీజ్

మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన మూడు బ్యాంక్ ఖాతాల్లోని రూ.440 కోట్ల నిధులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఫ్రీజ్ చేసింది. ఒక ఏవియేషన్ సంస్థకు జరిగిన అనుమానాస్పద బదిలీలపై దర్యాప్తులో భాగంగా ఈ చర్య తీసుకున్నారు.

Published on: Jul 8, 2026, 17:41:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (TMC)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం భారీ చర్య తీసుకుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ 17(1A) కింద మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి చెందిన మూడు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ ఖాతాల్లోని రూ. 440.42 కోట్ల నిధులను ఈడీ ఫ్రీజ్ చేసింది.

ఈడీ భారీ యాక్షన్: తృణమూల్ కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాల్లో రూ.440 కోట్లు ఫ్రీజ్ (HT_PRINT)
ఈడీ భారీ యాక్షన్: తృణమూల్ కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాల్లో రూ.440 కోట్లు ఫ్రీజ్ (HT_PRINT)

కోల్‌కతాలో ఈడీ సోదాలు

విమాన చార్టర్ సేవలు అందించే కేర్‌వెల్ గ్రూప్ (Carewell Group of companies) సంస్థలకు చెందిన కోల్‌కతా పరిసర ప్రాంతాల్లోని ఐదు ప్రాంగణాలలో ఈడీ కోల్‌కతా జోనల్ కార్యాలయం సోదాలు నిర్వహించింది. ఈ సోదాల అనంతరం నిధులను ఫ్రీజ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

రూ.160 కోట్ల బదిలీపై దర్యాప్తు

ఈడీ ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 2023, జూన్ 2026 మధ్య కాలంలో టీఎంసీ బ్యాంక్ ఖాతాల నుండి కేర్‌వెల్ ఏవియేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Carewell Aviation India Pvt. Ltd.), దాని అనుబంధ సంస్థలకు సుమారు రూ. 160 కోట్లు బదిలీ అయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

విమానాలు, హెలికాప్టర్ల కొనుగోలు వివాదం

కేర్‌వెల్ ఏవియేషన్ సంస్థ 2023-2026 మధ్య కాలంలో రూ. 82.96 కోట్లను కొత్తగా స్థాపించిన మరో అనుబంధ సంస్థకు మళ్లించింది. ఈ నిధులతో ఒక ఎంబ్రాయర్ లెగసీ 600 (Embraer Legacy 600) విమానం, అగస్టా 109 గ్రాండ్ న్యూ (Agusta 109 Grand New) హెలికాప్టర్‌ను కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్లకు మొత్తం రూ.112 కోట్లు ఖర్చయ్యాయి. అంతేకాకుండా, సదరు హెలికాప్టర్ కొనుగోలు కోసం 2023లో కేమాన్ ఐలాండ్స్ (Cayman Islands)కు చెందిన ఒక సంస్థ నుండి 1.7 మిలియన్ యూఎస్ డాలర్లను అన్‌సెక్యూర్డ్ లోన్ (పూచీకత్తు లేని రుణం) రూపంలో సేకరించినట్లు ఈడీ పేర్కొంది.

విచిత్రమైన ఒప్పందం

టీఎంసీ నిధులతో కొనుగోలు చేసిన ఈ విమానం, హెలికాప్టర్‌ను తిరిగి టీఎంసీ పార్టీకే అద్దెకు ఇచ్చారు. విమాన వినియోగం పేరుతో మళ్లీ భారీ మొత్తంలో నిధులను సదరు సంస్థకు బదిలీ చేశారు. ఈ అనుమానాస్పద లావాదేవీల వెనుక ఉన్న అసలు లబ్ధిదారులు ఎవరు అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.

రాజకీయ ప్రేరేపిత దాడి: టీఎంసీ మండిపాటు

ఈడీ చర్యలపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఇదంతా రాజకీయ కక్షసాధింపు చర్య అని మమతా బెనర్జీ శిబిరానికి చెందిన రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ (Derek O'Brien) విమర్శించారు.

"ఇది రాజకీయ ప్రత్యర్థులపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడి. బీజేపీ బ్రాంచ్ ఆఫీసుల్లా ఈడీ, సీబీఐ, ఈసీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను బరితెగించి వాడుకుంటున్నారు" అని డెరెక్ ఓబ్రెయిన్ మండిపడ్డారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More