Elon Musk Ambani : “డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ”.. ఎలాన్ మస్క్ షాకింగ్ ట్వీట్- అసలేం జరుగుతోంది?

భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు లైసెన్స్ జాప్యంపై శాటిలైట్ ఇంటర్నెట్ యుద్ధం పతాక స్థాయికి చేరింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని ఉద్దేశించి "డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ" అని సంబోధిస్తూ స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా తీవ్ర వ్యంగ్యాస్త్రాలు గుప్పించడం ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది!

Published on: Oct 10, 2026, 05:28:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల మంజూరు వ్యవహారం గ్లోబల్ బిజినెస్ కార్పొరేట్ వార్‌గా మారింది! శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించే స్టార్​లింక్​కు ఇండియాలో తుది అనుమతులు రాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న టెక్ కుబేరుడు, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని నేరుగా టార్గెట్​ చేసుకుని విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా అంబానీని "ప్రైమ్ మినిస్టర్ అంబానీ" అని సంబోధిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

“డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ”.. ఎలాన్ మస్క్ షాకింగ్ ట్వీట్
“డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ”.. ఎలాన్ మస్క్ షాకింగ్ ట్వీట్

"డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ.." - మస్క్ సంచలన పోస్ట్

'ఎక్స్' వేదికగా పోస్ట్ చేసిన సందేశంలో అంబానీపై ఎలాన్ మస్క్ తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

"డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. మీరే భారత్‌కు అసలైన బాస్ అని తెలుసుకోలేకపోయినందుకు దయచేసి నా విన్నపాన్ని, క్షమాపణలను స్వీకరించండి. భారత ప్రజలపై మీ ఏకఛత్రాధిపత్యాన్ని, దోపిడీని కొనసాగించడానికే మీరు ప్రాధాన్యం ఇస్తారని తెలుసు. కానీ స్టార్‌లింక్‌ను కూడా పోటీ పడనిస్తారా?" అని మస్క్ ప్రశ్నించారు.

అంతటితో ఆగకుండా, భారత్‌లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం వల్ల వేలాది మంది పిల్లలు విద్యకు, చిన్న వ్యాపారవేత్తలు గ్లోబల్ మార్కెట్‌కు దూరమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించి ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలు కుప్పకూలినప్పుడు ప్రాణాలు కాపాడటంలో స్టార్‌లింక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీలకంగా వ్యవహరించిందని, భారత్‌లో ఈ సేవలను అనుమతిస్తే వేలాది మంది పురుషులు, మహిళలు, పిల్లల ప్రాణాలను కాపాడవచ్చని వివరించారు.

మూడోసారి విమర్శలు.. అసలు వివాదం ఏంటి?

భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ పోటీకి సంబంధించి ఈ వారంలో మస్క్ విమర్శలు గుప్పించడం ఇది మూడోసారి! భారత్‌లో స్టార్‌లింక్ రాకుండా కొందరు "వ్యాపార దిగ్గజాలు (ఒలిగార్క్స్)" అడ్డుకుంటున్నారని మస్క్ బుధవారం నాడు తొలిసారి ఆరోపించారు. దీనిపై కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, ఆ ఆరోపణలు నిరాధారమైనవని, దేశంలో టెలికామ్ నిబంధనలు అత్యంత పారదర్శకంగా ఉన్నాయని స్పష్టం చేసింది.

అయినప్పటికీ వెనక్కి తగ్గని మస్క్.. గురువారం నాటి పోస్ట్‌లో, "ప్రపంచవ్యాప్తంగా 165 కంటే ఎక్కువ దేశాల్లో అనుమతి పొందిన స్టార్‌లింక్, భారత్‌లో ఐదేళ్లుగా ప్రతీ చట్టాన్ని పాటిస్తోంది. అయినా లైసెన్స్ ఎందుకు ఇవ్వడం లేదు? అంబానీనే భారత్‌కు నిజమైన బాసా?" అని సూటిగా నిలదీశారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా "డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ" అంటూ తన దాడిని పతాక స్థాయికి తీసుకెళ్లారు.

ప్రభుత్వ వర్గాల స్పష్టత.. భద్రతా సమీక్షల దశలో ప్రక్రియ!

కేంద్ర ప్రభుత్వం మాత్రం మస్క్ ఆరోపణలను నిరాధారమైనవిగా కొట్టిపారేసింది. భారత్‌లో గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ బై శాటిలైట్ సేవల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు మూడు సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసింది. అందులో మస్క్ నేతృత్వంలోని 'స్టార్‌లింక్'తో పాటు భారతీ ఎయిర్‌టెల్ మద్దతు ఉన్న 'ఈయుటెల్‌శాట్ వన్‌వెబ్', ముఖేష్ అంబానీకి చెందిన 'జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్' ఉన్నాయి.

వాణిజ్య రీత్యా సేవలు ప్రారంభించడానికి, స్పెక్ట్రమ్ కేటాయింపులు జరగడానికి ముందు ఈ మూడు కంపెనీలు కూడా కేంద్ర ప్రభుత్వం విధించిన కఠినమైన భద్రతా నిబంధనలను నెరవేర్చాల్సి ఉంటుంది. ముగ్గురు లైసెన్స్‌దారుల సెక్యూరిటీ అసెస్‌మెంట్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని, ఏ ఒక్క కంపెనీకి ప్రత్యేక రాయితీలు లేదా వివక్ష లేదని టెలికామ్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

శాటిలైట్ రేసులో డాలర్ల వ్యాపారం!

భారత టెలికామ్ మార్కెట్‌లో డిజిటల్ కనెక్టివిటీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ రంగానికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. జియో, ఎయిర్‌టెల్ సంస్థలు కలిపి దేశీయ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో 80 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. లోయర్ ఎర్త్ ఆర్బిట్ (ఎల్​ఈఓ) ఉపగ్రహాల ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ అందించే స్టార్‌లింక్ ప్రవేశిస్తే మార్కెట్‌లో గట్టి పోటీ ఎదురవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనుమతుల ప్రక్రియపై స్పేస్‌ఎక్స్ (స్టార్​లింక్ మాతృసంస్థ) అసహనం వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వం భద్రతా ప్రమాణాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More