స్టార్‌లింక్ వివాదంలో ఎలాన్ మస్క్‌కు రేవంత్ రెడ్డి మద్దతు: 'క్రోనీ రాజకీయాల కోసం బ్రాండ్ ఇండియాను దెబ్బతీయొద్దు'
భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలకు అనుమతులు రాకపోవడంపై స్పేస్ ఎక్స్ అధినేతి ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మస్క్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు.
క్రోనీ స్వార్థ ప్రయోజనాల కోసం 'బ్రాండ్ ఇండియా' ప్రతిష్టను ప్రపంచస్థాయిలో దెబ్బతీయకూడదని, నూతన సాంకేతిక పరిష్కారాలను దేశం ఎల్లప్పుడూ ఆహ్వానించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల లైసెన్సింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంపై 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఎలాన్ మస్క్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ వ్యాపార ఏకచ్ఛత్రాధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి కొందరు సంపన్న వర్గాలు (ఆలిగార్క్స్) స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నాయని మస్క్ ఆరోపించారు. దీనిపై కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ నిబంధనలన్నీ పారదర్శకంగానే ఉన్నాయని, మస్క్ చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమని కొట్టిపారేసింది.
ఈ వివాదంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిజిటలైజేషన్, ఆధునీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ ముందే ఉంటాయని స్పష్టం చేశారు.
"యుపిఎ-2 హయాంలోనే డిజిటల్ విప్లవానికి పునాదులు పడ్డాయి"
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మార్చివేసిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) కాన్సెప్ట్, మొబైల్ ఆధారిత డిజిటల్ మౌలిక సదుపాయాల విప్లవం 2012-13లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఎ-2 ప్రభుత్వంలోనే రూపుదిద్దుకుందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. "నేడు ప్రపంచ స్థాయి భారతీయ ఆవిష్కరణలకు యూపీఐ ఒక సరికొత్త నిదర్శనంగా నిలిచింది. కటింగ్-ఎడ్జ్ ఇంటర్నెట్ సిస్టమ్స్‌లో వస్తున్న వినూత్న పరిష్కారాలను భారత్ సాధరంగా ఆహ్వానించాలి. అంతేతప్ప, క్రోనీ రాజకీయాల ఆకర్షణల కోసం అంతర్జాతీయంగా 'బ్రాండ్ ఇండియా' ఇమేజ్‌ను బలహీనపరచకూడదు" అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ స్పందన.. మస్క్ రిప్లై
అంతకుముందు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా మస్క్ పోస్టుపై స్పందిస్తూ చమత్కరించారు. "భారత్‌కు స్వాగతం ఎలాన్.. ఇక్కడ మరొక వ్యక్తి గురించి మీకు తెలిసే వరకు ఆగండి" అంటూ పరోక్షంగా కార్పొరేట్ పెద్దలను ఉద్దేశించి రాహుల్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మస్క్, "ధన్యవాదాలు రాహుల్.. ఇది నిజంగా ఆందోళనకరమైన విషయమే" అని బదులిచ్చారు.
మస్క్ ఆరోపణలు.. కేంద్ర ప్రభుత్వ వివరణ
భారతీయ చట్టాలు, భద్రతా నిబంధనలన్నింటినీ పాటిస్తూ ఐదేళ్లుగా నిరీక్షిస్తున్నా లైసెన్స్ ఎందుకు ఇవ్వడం లేదని, అంబానీనే భారత్‌కు అసలైన బాసా అని మస్క్ ప్రశ్నించారు.
దీనిపై కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, "శాటిలైట్ సేవల కోసం వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారమే పరిశీలిస్తున్నాం. స్టార్‌లింక్, భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్.. ఈ మూడూ కూడా ప్రస్తుతం ఒకే తరహా భద్రతా సమీక్షల దశలో ఉన్నాయి. ఏ ఒక్క సంస్థపైనా వివక్ష చూపడం లేదు" అని స్పష్టం చేసింది.
అంతర్జాతీయ స్థాయిలో టెక్ దిగ్గజాలు, భారత ప్రభుత్వ యంత్రాంగం మధ్య జరుగుతున్న ఈ పోరులో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు తెలపడం రాజకీయంగాను, పారిశ్రామికంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


