ఈపీఎఫ్ఓ 3.0: యూపీఐ, ఏటీఎంలో నగదు విత్‌డ్రా.. కొత్త రూల్స్ ఇవే

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారుల కోసం సరికొత్త డిజిటల్ వ్యవస్థ 'ఈపీఎఫ్ఓ 3.0'ను తీసుకురాబోతోంది. దీని ద్వారా పీఎఫ్ డబ్బును పేపర్‌లెస్ పద్ధతిలో యూపీఐ లేదా ఏటీఎమ్ ద్వారా నేరుగా విత్‌డ్రా చేసుకునే సదుపాయం కలగనుంది.

Published on: Jun 10, 2026, 14:17:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ 'ఈపీఎఫ్ఓ 3.0' (EPFO 3.0) పేరిట సరికొత్త డిజిటల్ విప్లవానికి తెరలేపింది. ఈ కొత్త విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, చందాదారులు తమ అత్యవసర అవసరాల కోసం పీఎఫ్ డబ్బును యూపీఐ (UPI) లేదా యూపీఐ ఆధారిత ఏటీఎమ్‌ల (ATMs) ద్వారా నేరుగా విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈపీఎఫ్ఓ 3.0: యూపీఐ, ఏటీఎంలో నగదు విత్‌డ్రా.. కొత్త రూల్స్ ఇవే
ఈపీఎఫ్ఓ 3.0: యూపీఐ, ఏటీఎంలో నగదు విత్‌డ్రా.. కొత్త రూల్స్ ఇవే

ఎంత శాతం డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు?

ఈపీఎఫ్ఓ 3.0 నిబంధనల ప్రకారం, చందాదారులు తమ ఖాతాలోని మొత్తం నిల్వలో 50 శాతం నుండి 75 శాతం వరకు నిధులను యూపీఐ ద్వారా తమ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు. అయితే, ఖాతాలోని కనీసం 25 శాతం సొమ్మును భవిష్యత్తు నిధి భద్రత కోసం (Mandatory Retention) అలాగే ఉంచాల్సి ఉంటుంది.

ప్రస్తుత విధానంలో పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే, ఆ సొమ్ము బ్యాంకు ఖాతాలో పడటానికి 15 నుండి 20 రోజుల సమయం పడుతోంది. కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే లింక్డ్ యూపీఐ పిన్ (UPI PIN) ఉపయోగించి సురక్షితంగా, క్షణాల వ్యవధిలోనే నిధులను బదిలీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ డబ్బును ఆన్‌లైన్ పేమెంట్లకు వాడుకోవచ్చు లేదా ఏటీఎమ్ కార్డు ద్వారా నగదుగా మార్చుకోవచ్చు.

ఆటో సెటిల్‌మెంట్ పరిమితి భారీగా పెంపు

అత్యవసర సమయాల్లో చందాదారులకు మరింత ఊరటనిస్తూ ఆటో సెటిల్‌మెంట్ (Auto-settlement) పరిమితిని ప్రభుత్వం ఐదు రెట్లు పెంచింది. గతంలో ఉన్న 1 లక్ష పరిమితిని ఏకంగా 5 లక్షలకు పెంచారు. దీనివల్ల ఇల్లు కొనుగోలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు లేదా వివాహం వంటి అవసరాల కోసం దరఖాస్తు చేసుకున్న కేవలం మూడు రోజుల్లోనే పీఎఫ్ నిధులు చేతికి అందుతాయి. అయితే ఈ ఏటీఎమ్ విత్‌డ్రా సదుపాయం కేవలం ఈపీఎఫ్ (EPF) బ్యాలెన్స్‌కు మాత్రమే వర్తిస్తుందని, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) నిధులకు ఇది వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.

ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సరికొత్త వ్యవస్థపై కీలక ప్రకటన చేశారు. ఈపీఎఫ్ఓ 3.0 కి సంబంధించిన సాంకేతిక పరీక్షలు (Testing) విజయవంతంగా పూర్తయ్యాయని, త్వరలోనే దీనిని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ వ్యవస్థ తుది దశ అభివృద్ధిలో ఉంది.

"కొత్త ప్రాజెక్టులో భాగంగా పీఎఫ్ ఖాతాలోని కొంత భాగాన్ని నిలిపి ఉంచి, సింహభాగాన్ని (50-75%) చందాదారుల బ్యాంకు ఖాతాలకు యూపీఐ ద్వారా నేరుగా బదిలీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం" అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ఉమాంగ్ యాప్, వాట్సాప్ సేవలు

ఈపీఎఫ్ఓ 3.0 లో భాగంగా చందాదారులు ఉమాంగ్ (UMANG) యాప్‌లో ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీ (FAT) ద్వారా తమ యూఏఎన్ (UAN) నంబర్‌ను సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా పీఎఫ్ పాస్‌బుక్ చూడటం, సమాచారాన్ని అప్‌డేట్ చేయడం, ఆన్‌లైన్ క్లెయిమ్‌లు సబ్మిట్ చేయడం సులువవుతుంది. ఆధార్ అనుసంధానంలో ఏవైనా తప్పులు ఉంటే మెంబర్ పోర్టల్‌లోని 'జాయింట్ డిక్లరేషన్' ద్వారా సరిచేసుకోవచ్చు.

మొబైల్ వినియోగదారుల కోసం వాట్సాప్ (WhatsApp) సేవలను కూడా ఈపీఎఫ్ఓ విస్తరిస్తోంది. గ్రీన్ టిక్ మార్క్ ఉన్న ఈపీఎఫ్ఓ అధికారిక వాట్సాప్ నంబర్‌కు 'Hello' అని మెసేజ్ చేయడం ద్వారా చందాదారులు తమ సందేహాలకు 24 గంటలూ సమాధానాలు పొందవచ్చు. ఈ సమాచార మార్పిడి అంతా తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల్లోనే సాగుతుంది.

వివాదాల త్వరితగతిన పరిష్కారం

వివిధ న్యాయ వేదికల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఈపీఎఫ్ఓ 'మిషన్ మోడ్' డ్రైవ్‌ను చేపట్టింది. 'నిధి ఆప్కే నికట్' (NAN) కార్యక్రమం ద్వారా వినియోగదారుల కోర్టుల్లో ఉన్న కేసులను ముందే గుర్తించి, వాటిని వేగంగా పరిష్కరిస్తున్నారు. కాగా, ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో (2024-25) 1.29 కోట్లకు పైగా కొత్త కార్మికులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చారు. అలాగే దేశంలో నిరుద్యోగిత రేటు 2017-18లో ఉన్న 6 శాతం నుండి 2023-24 నాటికి 3.2 శాతానికి తగ్గింది.

ముఖ్య గమనిక: పీఎఫ్ ఖాతాదారులు సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు తమ ఓటీపీ (OTP), యూఏఎన్ (UAN) పాస్‌వర్డ్, ఆధార్, పాన్ లేదా బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More