ఈపీఎఫ్‌ఓ బంపర్ ఆఫర్: గతంలో పీఎఫ్ మిస్సైందా? అక్టోబర్ 31 వరకు ఛాన్స్
2009 ఏప్రిల్ నుంచి 2026 మార్చి మధ్య ఈపీఎఫ్ పరిధిలోకి రాకుండా మిగిలిపోయిన అర్హులైన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 'ఎంప్లాయీస్ ఎన్‌రోల్‌మెంట్ క్యాంపెయిన్ 2026' కింద ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు పీఎఫ్ ఖాతా తెరిచే వెసులుబాటును ఈపీఎఫ్‌ఓ కల్పించింది.
ఉద్యోగంలో చేరినప్పటికీ సాంకేతిక, ఇతర కారణాల వల్ల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) పరిధిలోకి రాని ఉద్యోగులకు కేంద్ర కార్మిక శాఖ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. 2009 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య కాలంలో పీఎఫ్ అర్హత ఉండి కూడా ఖాతా తెరవని జీతభత్యాల ఉద్యోగుల కోసం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ప్రత్యేక అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది.

అర్హులకు సామాజిక భద్రత
'ఎంప్లాయీస్ ఎన్‌రోల్‌మెంట్ క్యాంపెయిన్ (ఈఈసీ) 2026' పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్ 2026 అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. సంస్థలు తమ వద్ద పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగుల వివరాలను స్వచ్ఛందంగా నమోదు చేసి, వారికి పీఎఫ్, పెన్షన్, బీమా (ఈడీఎల్ఐ) వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను పొడిగించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.
ఎవరికి ఈ అవకాశం?
గత 17 ఏళ్ల వ్యవధిలో (2009 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చి 31 వరకు) అర్హత ఉండి పీఎఫ్ పరిధిలోకి రాని ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుంది. అయితే, సదరు యాజమాన్యం పీఎఫ్ వివరాలను డిక్లేర్ చేసే సమయానికి ఉద్యోగి ఆ సంస్థలోనే కొనసాగుతూ, జీవించి ఉండటం తప్పనిసరి.
గతంలో పనిచేసి ఉద్యోగం వదిలేసిన (ఎగ్జిట్ అయిన) మాజీ ఉద్యోగులకు ఈ పథకం కింద పీఎఫ్ ప్రయోజనాలను పొందే అవకాశం ఉండదు. ఇప్పటికీ అదే సంస్థలో పనిచేస్తూ, తమకు పీఎఫ్ నమోదు కాలేదని భావించే ఉద్యోగులు వెంటనే తమ యాజమాన్యాన్ని లేదా హెచ్‌ఆర్ విభాగాన్ని సంప్రదించాల్సి ఉంటుంది.
ఉద్యోగుల వాటాపై ప్రత్యేక మినహాయింపు
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ఉద్యోగులకు కీలక ఊరట లభించింది. గతంలో ఉద్యోగి జీతం నుంచి పీఎఫ్ వాటా కట్ చేయకపోతే, ఆ బకాయిల నుంచి ఉద్యోగికి మినహాయింపు కల్పిస్తున్నారు.
"గతంలో ఉద్యోగి జీతం నుంచి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ మినహాయించని పక్షంలో, క్యాంపెయిన్ నిబంధనలకు లోబడి ఉద్యోగి వాటాను మాఫీ చేసేందుకు వీలుగా ప్రత్యేక సడలింపులు కల్పించాం" అని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది.
కంపెనీలు నమోదు చేయాలిలా..
ఈ పథకం కింద నమోదు, చెల్లింపుల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేశారు.
- యాజమాన్యాలు తమ ఉద్యోగుల కోసం ఉమాంగ్ (UMANG) మొబైల్ యాప్‌లోని ఫేస్ అథెంటికేషన్ (ముఖ గుర్తింపు) సాంకేతికత ద్వారా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) కేటాయించాలి.
- నమోదు పూర్తయిన తర్వాత, ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్ (ఈసీఆర్) పోర్టల్ ద్వారా పీఎఫ్ చందాను చెల్లించాల్సి ఉంటుంది.
- ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు కంపెనీలు తమ అంతర్గత వేతన రికార్డులను తనిఖీ చేసుకుని, అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించాలని సూచించారు.
బాధితులు ఏం చేయాలి?
మీరు పీఎఫ్ పరిధికి అర్హులై ఉండి కూడా ఈపీఎఫ్‌ఓ పరిధిలోకి రాకపోతే ఈ కింది విషయాలను మీ సంస్థతో నిర్ధారించుకోవాలి.
- మీ కంపెనీ ఈపీఎఫ్ చట్ట పరిధిలో ఉందో లేదో సరిచూసుకోండి.
- మీరు 2009 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య ఆ సంస్థలో చేరారా లేదా అనేది పరిశీలించండి.
- అర్హత ఉండి పీఎఫ్ నమోదు కాకపోతే, ప్రస్తుతం మీరు అదే సంస్థలో పనిచేస్తున్నారో లేదో ధృవీకరించుకోండి.
- ఈఈసీ 2026 కింద మీ యాజమాన్యం ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించిందో లేదో కనుక్కోండి.
ఈ వినూత్న ప్రచారాన్ని అన్ని స్థాయిల కంపెనీలు, కాంట్రాక్టర్లు, పబ్లిక్ సెక్టార్ సంస్థలు, ఉద్యోగుల్లోకి తీసుకెళ్లేందుకు ఈపీఎఫ్‌ఓ విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


