ఈపీఎఫ్ఓ బిగ్ రిలీఫ్: 24-48 గంటల్లోనే పీఎఫ్ డబ్బులు జమ.. త్వరలో యూపీఐ

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారులకు భారీ ఊరటనిచ్చింది. ప్రావిడెంట్ ఫండ్ (PF) క్లెయిమ్స్‌ను ఇకపై 24 నుంచి 48 గంటల్లోనే పరిష్కరించనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే భీమ్ (BHIM) యాప్, యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే వ్యవస్థను అమల్లోకి తెస్తోంది.

Published on: Aug 1, 2026, 14:34:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉద్యోగులు తమ పిఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి ఇకపై రోజులు తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. క్లెయిమ్ చేసిన రోజే లేదా గరిష్టంగా రెండు రోజుల్లో డబ్బులను ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసేలా నూతన వ్యవస్థ పనిచేస్తోందని సంస్థ వెల్లడించింది.

ఈపీఎఫ్ఓ బిగ్ రిలీఫ్: 24-48 గంటల్లోనే పీఎఫ్ డబ్బులు జమ.. త్వరలో యూపీఐ
ఈపీఎఫ్ఓ బిగ్ రిలీఫ్: 24-48 గంటల్లోనే పీఎఫ్ డబ్బులు జమ.. త్వరలో యూపీఐ

న్యూఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ సమ్మిట్‌లో ఈపీఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (CPFC) రమేష్ కృష్ణమూర్తి పాల్గొని ప్రసంగించారు.

"పాత క్లెయిమ్‌ల పెండింగ్ సమస్యనంతా దాదాపు పరిష్కరించాం. నూతన వ్యవస్థలో దాదాపు 90 శాతం క్లెయిమ్‌లు ఆటో-సెటిల్ అవుతున్నాయి. చందాదారులు దరఖాస్తు చేసిన రోజే లేదా గరిష్టంగా రెండు రోజుల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం" అని రమేష్ కృష్ణమూర్తి స్పష్టం చేశారు.

గతంలో కేవైసీ (KYC) వివరాలు పూర్తయిన తర్వాత పీఎఫ్ డబ్బులు చేతికి రావడానికి కనీసం 7 నుంచి 10 పని దినాల సమయం పట్టేది. ఆ నిరీక్షణకు స్వస్తి పలుకుతూ ఈ వ్యవధిని గణనీయంగా తగ్గించారు.

ఇక యూపీఐ, భీమ్ యాప్ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి

సాంకేతిక వినియోగాన్ని విస్తరిస్తున్న ఈపీఎఫ్ఓ మరొక కీలక విధానాన్ని సిద్ధం చేసింది. భీమ్ యాప్ ద్వారా యూపీఐకి లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా పిఎఫ్ డబ్బులను జమ చేయనున్నారు.

"కేంద్ర మంత్రి సూచించినట్లుగా భీమ్ యాప్ ద్వారా క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను ప్రవేశపెడుతున్నాం. యూపీఐతో అనుసంధానమైన బ్యాంక్ ఖాతాలోకి నేరుగా క్లెయిమ్ సొమ్ము జమ అవుతుంది. ఈ నూతన విధానం మరో నెల రోజుల్లో అమల్లోకి వస్తుంది" అని రమేష్ కృష్ణమూర్తి వెల్లడించారు.

వడ్డీ రేట్ల పెంపుపై స్పష్టత

ప్రస్తుతం ఇస్తున్న 8.25 శాతం వడ్డీ రేటును మరింత పెంచే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు ఆయన సున్నితంగా స్పందించారు. "వడ్డీ రేట్ల పెంపుపై మాట్లాడటం తొందరపాటవుతుంది. జులై 3న దాదాపు 34 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో ఒకేసారి 8.25 శాతం చొప్పున సుమారు రూ. 1.44 లక్షల కోట్ల వడ్డీని జమ చేశాం. ఇది సంస్థ సాధించిన పెద్ద విజయం" అని ఆయన వివరించారు.

యాజమాన్యాలకు సులభతర నిబంధనలు

ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, సంస్థల యాజమాన్యాలకు నిబంధనల అమలును సులభతరం చేయడంపై ఈపీఎఫ్ఓ దృష్టి పెట్టింది. యజమానులకు, ఉద్యోగులకు విశ్వసనీయమైన సామాజిక భద్రతా సంస్థగా మారేందుకు సంస్కరణలు వేగవంతం చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More