Pension : ఈపీఎస్ కనీస పింఛను రూ. 1000 నుంచి రూ. 3000కు పెంపు! త్వరలోనే ప్రకటన?
ఈపీఎస్ సబ్‌స్క్రైబర్స్‌కి త్వరలోనే గుడ్ న్యూస్ అందే అవకాశం ఉంది! ఎంప్లాయీస్ పెన్షన్ స్కిమ్ కింద ప్రస్తుతం రూ. 1000గా ఉన్న కనీస పింఛనును రూ. 3000 వరకు పెంచాలని చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
ఈపీఎస్ (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్) పరిధిలోని సబ్‌స్క్రైబర్స్‌కు త్వరలోనే శుభవార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పథకం కింద ఇప్పటివరకు ఉన్న రూ. 1000 కనీస పింఛనును రూ. 3వేలకు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖతో కార్మికశాఖ ఇప్పటికే చర్చలు జరిపినట్టు సమాచారం.

ఈ నెల 19న జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ భేటీలో.. కనీస పింఛనును రూ. 3000కు పెంచే అంశాన్ని ప్రత్యేక అజెండాగా చర్చించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కనీస పింఛను రూ. 1000 నుంచి రూ. 3000!
2014కి ముందు ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని రూ. 6500గా ఉండేది. దానిని రూ. 15వేలకు పెంచారు. ఆ సమయంలో కనీస పింఛనును కూడా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు దాదాపు 80శాతం పింఛనుదారులకు పెన్షన్ రూ. 1000 లోపే ఉండేది. అనంతరం దానిని రూ. 1000కి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఈ కనీస పింఛనును పెంచాలని కార్మిక సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు డిమాండ్లు చేస్తూ వస్తున్నాయి.
సరిగ్గా ఇదే సమయంలో ఈ సెప్టెంబర్‌లో గరిష్ఠ వేతన పరిమితి రూ. 15వేల నుంచి రూ. 25వేలకు పెరిగింది. ఫలితంగా ఇప్పుడు కనీస పింఛనును కూడా పెంచాలన్న చర్చలు మొదలయ్యాయి. ఇప్పుడు ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 81లక్షలకుపైగా మంది ఈపీఎస్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. వీరిలో 73లక్షలకుపైగా మందికి రూ. 3వేల లోపు పింఛను అందుతోంది. ఒకవేళ ఈపీఎస్ పింఛనును రూ. 3వేలకు పెంచితే, వీరికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు ఈ నెల 19న జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం అనంతరం వెలువడనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


