ఈపీఎఫ్‌ఓ ఆన్‌లైన్ సేవలు మరో రోజు బంద్.. జూలై 2 నుంచి పునరుద్ధరణ
సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ కారణంగా ఈపీఎఫ్‌ఓ ఆన్‌లైన్ సేవల నిలిపివేత గడువును సంస్థ మరో రోజు పొడిగించింది. పీఎఫ్ క్లెయిమ్‌లు, పాస్‌బుక్ డౌన్‌లోడ్ వంటి డిజిటల్ సేవలు జూలై 2 నుంచి చందాదారులకు అందుబాటులోకి రానున్నాయి.
ఈపీఎఫ్‌ఓ (ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ) ఖాతాదారులకు అలర్ట్. పీఎఫ్ ఆన్‌లైన్ సేవలు, క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ నిలిపివేత గడువును సంస్థ మరో రోజు పొడిగించింది. తాజా ప్రకటన ప్రకారం, జూలై 1 అర్ధరాత్రి 11:59 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవు. తిరిగి జూలై 2 అర్ధరాత్రి (00:00 గంటల) నుంచి యథాతథంగా డిజిటల్ సేవలు ప్రారంభం కానున్నాయి.

డేటాబేస్ అప్‌గ్రేడేషన్ పనులే కారణం
క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ సిస్టమ్‌ను మెరుగుపరచడం, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ పనుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 26న ప్రారంభమైన ఈ డేటాబేస్ మార్పు పనుల వల్ల డిజిటల్ ప్లాట్‌ఫామ్ భద్రత, వేగం పెరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు అటు చందాదారులు (మెంబర్ ఇంటర్‌ఫేస్), ఇటు యజమానులు (ఎంప్లాయర్ ఇంటర్‌ఫేస్) వెబ్‌సైట్‌ను ఉపయోగించడం కుదరదు.
రెండోసారి పొడిగింపు
నిజానికి ఈ సేవలను తొలుత జూన్ 28 వరకు నిలిపివేసి, జూన్ 29న ప్రారంభించాలని భావించారు. అయితే పనులు పూర్తికాకపోవడంతో జూన్ 30 వరకు పొడిగించి, జూలై 1న సేవలు అందిస్తామన్నారు. సాంకేతిక పనుల దృష్ట్యా ఇప్పుడు మరో రోజు పొడిగించి, జూలై 2 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇటీవలి కాలంలో ఇంత సుదీర్ఘకాలం పాటు ఆన్‌లైన్ సేవలు నిలిచిపోవడం ఇదే మొదటిసారి. దీంతో లక్షలాది మంది పీఎఫ్ చందాదారులు, కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏయే సేవలకు అంతరాయం కలగనుంది?
ఈ సాంకేతిక నిర్వహణ వ్యవధిలో కింది సేవలు పూర్తిగా నిలిచిపోతాయి:
- ఆన్‌లైన్ పీఎఫ్ క్లెయిమ్ సమర్పణ
- పీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్
- క్లెయిమ్ స్టేటస్ ట్రాకింగ్
- పీఎఫ్ బదిలీ (ట్రాన్స్‌ఫర్) అభ్యర్థనలు
- ప్రొఫైల్, వ్యక్తిగత వివరాల అప్‌డేట్
- మెంబర్ పోర్టల్, ఉమాంగ్ (UMANG) యాప్ ద్వారా లభించే డిజిటల్ సేవలు
యాజమాన్యాలు సైతం తమ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ పనులను ప్రస్తుతానికి నిర్వహించలేవు.
సాంకేతిక మార్పుల లక్ష్యం ఇదే
వినియోగదారులకు వేగవంతమైన, సురక్షితమైన సేవలను అందించడమే ఈ అప్‌గ్రేడేషన్ ఉద్దేశమని ఈపీఎఫ్‌ఓ తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ లావాదేవీలు మరింత వేగంగా, నమ్మకంగా సాగుతాయని పేర్కొంది.
"తాత్కాలికంగా కలిగిన ఈ అసౌకర్యానికి విచారం వ్యక్తంచేస్తున్నాం. మరింత వేగవంతమైన, సురక్షితమైన సేవలను అందించేందుకు మేము చేపట్టిన ఈ కీలక అప్‌గ్రేడ్ ప్రక్రియకు చందాదారులు సహకరించాలి" అని ఈపీఎఫ్‌ఓ తన అధికారిక పోర్టల్ నోటీసులో స్పష్టం చేసింది.
పీఎఫ్ క్లెయిమ్‌లు, పాస్‌బుక్ డౌన్‌లోడ్ల కోసం నిరీక్షిస్తున్న చందాదారులు జూలై 2 అర్ధరాత్రి నుంచి తమ పనులను తిరిగి ప్రారంభించుకోవచ్చు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


