ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.
ఉద్యోగం మానేసినా పీఎఫ్ సొమ్ముపై వడ్డీ ఆగదు.. ఈపీఎఫ్‌ఓ నిబంధనలివే
ఉద్యోగం మారినా, విదేశాలకు వెళ్లినా పాత పీఎఫ్ ఖాతాపై మూడేళ్ల తర్వాత వడ్డీ ఆగిపోతుందా? 58 ఏళ్ల వరకు వడ్డీ పొందే నిబంధనలు, ఖాతా నిలిచిపోయే నాలుగు సందర్భాలు, సొమ్ము వెనక్కి తీసుకునే విధానాన్ని ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది.
ఉద్యోగం మారినప్పుడో, విదేశాలకు వెళ్లినప్పుడో పాత ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాను అలాగే వదిలేస్తుంటాం. అలా కొత్తగా చందా జమ చేయకుండా వరుసగా మూడేళ్లు గడిస్తే, ఆ ఖాతాలోని నిల్వపై వడ్డీ ఆగిపోతుందా అన్న సందేహం చాలామంది ఉద్యోగుల్లో ఉంటుంది. అయితే, వేతన జీవులకు ఊరటనిచ్చే విషయాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) వెల్లడించింది.

చందా చెల్లింపులు నిలిచిపోయినంత మాత్రాన ఈపీఎఫ్ ఖాతాకు వడ్డీ రావడం వాటంతట అదే ఆగిపోదు. కొన్ని నిబంధనలకు లోబడి, సభ్యుడికి 58 ఏళ్లు వచ్చే వరకు ఆ నిల్వపై వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. ఖాతా ఎప్పుడు పనిచేయని (ఇన్‌ఆపరేటివ్) స్థితికి చేరుతుంది, వడ్డీ ఎప్పుడు ఆగిపోతుంది, పాత సొమ్మును ఎలా వెనక్కి తీసుకోవాలి అన్న వివరాలను ఈపీఎఫ్‌ఓ ఒక యూట్యూబ్ వీడియో ద్వారా వివరించింది.
సాధారణంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు పాత పీఎఫ్ ఖాతాను కొత్త ఖాతాకు బదిలీ చేసుకోవడం మర్చిపోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో తమ కష్టార్జితంపై వడ్డీ నష్టపోతామేమోనన్న ఆందోళన సహజం. నిబంధనలపై సరైన అవగాహన ఉంటే ఎలాంటి కంగారు లేకుండా పొదుపు సొమ్మును కాపాడుకోవచ్చు.
ఖాతా ఎప్పుడు ఇన్‌ఆపరేటివ్ అవుతుంది?
ఉద్యోగుల భవిష్య నిధి పథకం, 1952లోని పేరా 72(6) కింద నిర్దిష్ట పరిస్థితుల్లో పీఎఫ్ ఖాతా పనిచేయని స్థితికి చేరుతుంది. పదవీ విరమణ, శాశ్వతంగా విదేశాలకు వలస వెళ్లడం, సభ్యుడి మరణం, విఫలమైన విత్‌డ్రా లావాదేవీలు వంటివి ఇందులోకి వస్తాయి. అయితే, మూడేళ్ల నిబంధన అందరికీ ఒకేలా వర్తించదు.
55 ఏళ్ల వయసు రాకముందే ఉద్యోగం మానేసిన వారి పీఎఫ్ నిల్వపై, కొత్తగా చందాలు జమ కాకపోయినా 58 ఏళ్లు వచ్చే వరకు వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. అదే 55 ఏళ్లు లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసే వారికి, చివరి చందా జమ అయిన నాటి నుంచి 36 నెలల నిరీక్షణ కాలం మొదలవుతుంది. ఆ గడువు తర్వాత కూడా సొమ్మును విత్‌డ్రా చేసుకోకపోతే ఖాతా ఇన్‌ఆపరేటివ్‌గా మారి వడ్డీ ఆగిపోతుంది. ఉదాహరణకు, 58 ఏళ్ల వయసులో రిటైర్ అయిన వ్యక్తి తన పీఎఫ్ సొమ్మును తీసుకోకుండా అలాగే ఉంచితే, 61 ఏళ్ల వయసు వరకు వడ్డీ పొందవచ్చు.
పీఎఫ్ ఖాతా నిలిచిపోయే నాలుగు సందర్భాలు
ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం ఈ కింది నాలుగు పరిస్థితుల్లో ఖాతాను ఇన్‌ఆపరేటివ్‌గా వర్గీకరిస్తారు.
- పదవీ విరమణ: ఉద్యోగి 55 ఏళ్లు లేదా ఆ పైబడిన వయసులో రిటైర్ అయి, జమ అయిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోకపోతే చివరి చందా తర్వాత 36 నెలలకు ఖాతా నిలిచిపోతుంది.
- శాశ్వతంగా విదేశాల్లో స్థిరపడటం: విదేశాల్లో శాశ్వతంగా స్థిరపడి, ఇక్కడి ఈపీఎఫ్ ఖాతాకు చందాలు ఆపేసిన సభ్యుల ఖాతాలు 36 నెలల తర్వాత ఇన్‌ఆపరేటివ్ అవుతాయి.
- ఖాతాదారు మరణం: సభ్యుడు మరణించిన 36 నెలల్లోపు నామినీలు లేదా చట్టపరమైన వారసులు ఆ పీఎఫ్ సొమ్ము కోసం క్లెయిమ్ చేసుకోకపోతే ఖాతా పనిచేయని స్థితికి చేరుతుంది.
- విత్‌డ్రా విఫలం కావడం: తప్పు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వడం వల్లనో, మూసివేసిన ఖాతా కావడం వల్లనో తుది సెటిల్‌మెంట్ సొమ్ము వెనక్కి వస్తే అది ఈపీఎఫ్‌ఓ వద్దే ఉండిపోతుంది. అలా 36 నెలల పాటు క్లెయిమ్ చేయకుండా ఉంటే ఖాతా ఇన్‌ఆపరేటివ్‌గా మారుతుంది.
ఖాతా నిలిచిపోయినా సొమ్ము భద్రమే
ఈపీఎఫ్ ఖాతా ఇన్‌ఆపరేటివ్ అయినంత మాత్రాన అందులోని పొదుపు సొమ్ము ఎక్కడికీ పోదు. అవసరమైన ధ్రువీకరణ పూర్తి చేసిన తర్వాత సభ్యులు, నామినీలు లేదా చట్టపరమైన వారసులు ఆ డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ ఉద్దేశాన్ని బట్టి సరైన ఫామ్ ఎంచుకోవాలి:
- ఫామ్ 19: పీఎఫ్ నిల్వను పూర్తిగా విత్‌డ్రా చేసుకోవడానికి.
- ఫామ్ 13: పాత పీఎఫ్ ఖాతాలోని నిల్వను ప్రస్తుత ఖాతాకు బదిలీ చేసుకోవడానికి.
- ఫామ్ 20: మరణించిన సభ్యుడి పీఎఫ్ సొమ్మును నామినీలు లేదా చట్టపరమైన వారసులు పొందడానికి.
నిలిచిపోయిన ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయడం ఎలా?
పాత పీఎఫ్ పొదుపు సొమ్మును పొందేందుకు ఈపీఎఫ్‌ఓ స్పష్టమైన ప్రక్రియను సూచించింది. ముందుగా ఈపీఎఫ్‌ఓ మెంబర్ పోర్టల్ లేదా ఉమంగ్ యాప్‌లోకి వెళ్లి మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) యాక్టివ్‌గా ఉందో లేదో చూసుకోవాలి. అనంతరం ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా అనుసంధానమై ఉన్నాయో లేదో సరిచూసుకొని కేవైసీ అప్‌డేట్ చేయాలి. పాత ఉద్యోగం మానేసిన తేదీ (డేట్ ఆఫ్ ఎగ్జిట్) నమోదైందా లేదా అన్నది కూడా తనిఖీ చేయాలి.
ఒకవేళ యూఏఎన్ లేకపోయినా, భద్రతా కారణాలతో ఖాతా బ్లాక్ అయినా గుర్తింపు ధ్రువీకరణ కోసం సమీపంలోని ఈపీఎఫ్‌ఓ ఫీల్డ్ ఆఫీస్‌కు వెళ్లాలి లేదా 'నిధి ఆప్కే నికట్ 2.0' క్యాంప్‌కు హాజరు కావాలి. గతంలో పనిచేసిన సంస్థ ఇంకా కొనసాగుతుంటే, ఆ యాజమాన్యం 15 రోజుల్లోగా మీ కేవైసీ వివరాలను ధ్రువీకరించి లింక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కంపెనీ మూతపడినా, ప్రక్రియ పూర్తి చేయడంలో విఫలమైనా ఈపీఎఫ్‌ఓ ఫీల్డ్ ఆఫీస్ జోక్యం చేసుకుంటుంది.
ఖాతా అన్‌బ్లాక్ అయిన తర్వాత సభ్యులు విత్‌డ్రా కోసం ఫామ్ 19 లేదా బదిలీ కోసం ఫామ్ 13 సమర్పించవచ్చు. క్లెయిమ్ ఆమోదం పొందిన వెంటనే, కేవైసీ ద్వారా ధ్రువీకరించిన బ్యాంకు ఖాతాలోకి నేరుగా సొమ్ము జమ అవుతుంది. కాబట్టి ఉద్యోగం మానేసినా కంగారు పడకుండా యూఏఎన్ యాక్టివ్‌గా ఉంచుకోవడం, బ్యాంకు వివరాలు, నామినేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం వల్ల అవసరమైనప్పుడు సొమ్ము తీసుకోవడం సులభమవుతుంది.

E-Paper
