ఎప్‌స్టీన్ ఫైల్స్‌తో సౌదీపై హౌతీల అస్త్రం: కాబా వస్త్రం అంశంపై తీవ్ర విమర్శలు

అమెరికా విడుదల చేసిన జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసు ఫైళ్లను యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. పవిత్రమైన కాబా ప్రాంగణ వస్త్రాన్ని ఎప్‌స్టీన్ ప్రైవేట్ ద్వీపానికి పంపారన్న ఆరోపణలతో సౌదీ రాజకుటుంబంపై హౌతీలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

Published on: Oct 24, 2026, 15:59:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన పత్రాలు ఇప్పుడు మధ్యప్రాచ్యంలో కొత్త రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి. ఇరాన్ మద్దతుగల యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ ఫైళ్ల ఆధారంగా సౌదీ అరేబియాపై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు. ముస్లింల అత్యంత పవిత్ర స్థలమైన మక్కాలోని 'కాబా' రక్షణ వస్త్రాన్ని (కిస్వా) ఎప్‌స్టీన్ ప్రైవేట్ ద్వీపానికి పంపారనే కథనాలను హౌతీలు ప్రధాన ఆయుధంగా మలచుకున్నారని 'న్యూయార్క్ టైమ్స్' తన నివేదికలో వెల్లడించింది.

ఎప్‌స్టీన్ ఫైల్స్‌తో సౌదీపై హౌతీల అస్త్రం: కాబా వస్త్రం అంశంపై తీవ్ర విమర్శలు
ఎప్‌స్టీన్ ఫైల్స్‌తో సౌదీపై హౌతీల అస్త్రం: కాబా వస్త్రం అంశంపై తీవ్ర విమర్శలు

ఇస్లాం విలువలకు సౌదీ విఘాతం కలిగిస్తోందంటూ ప్రచారం

అమెరికా న్యాయశాఖ (డీఓజే) ఇటీవల విడుదల చేసిన పత్రాలలో సౌదీ రాజకుటుంబంతో సంబంధాలున్న వ్యక్తులు కాబాను అలంకరించిన పవిత్ర వస్త్రాన్ని ఎప్‌స్టీన్‌కు బహుమతిగా ఇచ్చినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ అంశాన్ని హౌతీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం విస్తృతంగా వాడుకుంటున్నారు. సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు, పాటలు, ప్రసంగాలు, ఆన్‌లైన్ ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా సౌదీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు.

తాము ఇస్లామిక్ విలువలను, ధర్మాన్ని పరిరక్షించే యోధులమని చెప్పుకుంటున్న హౌతీలు.. సౌదీ అరేబియా ఆ సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. యెమెన్‌లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి సౌదీ మద్దతు ఇస్తుండగా, ఆ ప్రభుత్వంతో హౌతీలు సుదీర్ఘకాలంగా పోరాడుతున్న విషయం తెలిసిందే.

సైనిక దాడులతో పాటు ప్రచార యుద్ధం

ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో యెమెన్ ఘర్షణలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్ దాడులతో విరుచుకుపడుతున్న హౌతీలు, దానికి సమాంతరంగా ఈ మీడియా ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు.

పోరాటం ఒకవైపు సాగుతుండగానే.. గత నెలలో మక్కా నగరంపై దాడులు జరిపేందుకు హౌతీలు ప్రయత్నించారని సౌదీ అరేబియా ఆరోపించింది. దీంతో మక్కాలో భద్రతను తీవ్రతరం చేశారు. అయితే ఈ ఆరోపణలను హౌతీ తిరుగుబాటుదారులు ఖండించారు.

కాబా వస్త్రం వివాదంపై హౌతీ అధ్యక్షుడి వ్యాఖ్యలు

పవిత్రమైన కాబా వస్త్రాన్ని ఎప్‌స్టీన్‌కు అప్పగించడం ద్వారా సౌదీ పాలకులు ఇస్లామిక్ విశ్వాసాలకు ద్రోహం చేశారని హౌతీల మీడియా నెట్‌వర్క్ ప్రచారం చేస్తోంది. "ఎప్‌స్టీన్‌కు కాబా రక్షణ వస్త్రాన్ని ఇచ్చినవారే మక్కాను లక్ష్యంగా చేసుకుంటారు తప్ప మేము కాదు" అని హౌతీల అధ్యక్షుడు మహ్దీ అల్-మషాత్ తమ అధికారిక వార్తాసంస్థకు స్పష్టం చేశారు.

అమెరికా న్యాయశాఖ తాజా ఫైళ్లను విడుదల చేసినప్పటికీ, హౌతీలు చేస్తున్న ఈ తీవ్రమైన ఆరోపణలపై గానీ, కాబా వస్త్రం బదిలీపై వస్తున్న కథనాలపై గానీ సౌదీ అరేబియా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More