సౌదీ అరేబియాకు విమానాల రద్దును పొడిగించిన ఇండిగో

మధ్యప్రాచ్యంలో భద్రతా ఆందోళనల నేపథ్యంలో సౌదీ అరేబియాకు విమాన సర్వీసుల రద్దును ఇండిగో మరింత కాలం పొడిగించింది. రియాద్, జెద్దా, దమ్మామ్, మదీనా మార్గాల్లో ఈ నిర్ణయం అమలు కానుంది. అక్కడి భారతీయుల కోసం రాయబార కార్యాలయం 24 గంటల కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది.

Published on: Oct 23, 2026, 15:34:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

పశ్చిమాసియాలో ముదురుతున్న భద్రతా సంక్షోభం నేపథ్యంలో ప్రముఖ భారతీయ విమానయాన సంస్థ 'ఇండిగో' కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాకు నడిచే తన విమాన సర్వీసుల రద్దును మరింత కాలం పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించింది.

సౌదీ అరేబియాకు విమానాల రద్దును పొడిగించిన ఇండిగో (REUTERS)
సౌదీ అరేబియాకు విమానాల రద్దును పొడిగించిన ఇండిగో (REUTERS)

"రియాద్‌ మార్గంలో ఇండిగో విమానాలు అక్టోబర్ 31 వరకు రద్దయ్యాయి. అలాగే జిద్దా, దమ్మామ్, మదీనా మార్గాల్లో అక్టోబర్ 27 వరకు సేవలు నిలిచిపోతాయి" అని భారత మిషన్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొంది.

దాడుల తీవ్రతే కారణం

సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు, ఇంధన కేంద్రాలు, కీలకమైన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా యెమెన్‌లోని ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులతో దాడులు తీవ్రతరం చేశారు. ఇటీవల దమ్మామ్‌లోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై బుధవారం జరిగిన దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. అదే రోజు సౌదీ అరామ్‌కోకు చెందిన షైబా చమురు క్షేత్రంపై జరిగిన మరో దాడిలో ఇంకొక భారతీయుడు గాయపడ్డాడు.

అంతకుముందు, అక్టోబర్ 10న రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలోనూ ఒక భారత పౌరుడు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ వరుస అవాంఛనీయ ఘటనల నేపధ్యంలోనే విమానయాన సంస్థలు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాయి.

ఇతర విమానయాన సంస్థల నిర్ణయాలు

కేవలం ఇండిగో మాత్రమే కాకుండా ఇతర భారతీయ విమానయాన సంస్థలు కూడా సౌదీకి సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు తమ అన్ని మార్గాల్లో అక్టోబర్ 24 వరకు విమానాలను రద్దు చేయగా, ఆకాసా ఎయిర్ అక్టోబర్ 27 వరకు సర్వీసులను నిలిపివేసింది.

"అత్యవసరంగా భారత్‌కు వెళ్లాల్సిన పౌరులు అవసరమైన వీసాలు పొంది బహ్రెయిన్, కువైట్ లేదా ఖతార్ మార్గాల ద్వారా ప్రయాణించే అంశాన్ని పరిశీలించవచ్చు" అని రాయబార కార్యాలయం సూచించింది.

ఉమ్రా యాత్రికుల రక్షణ, సహాయక చర్యలు

విమానాల రద్దు కారణంగా సౌదీలో ఉన్న భారతీయ ఉమ్రా యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ తక్షణమే స్పందించింది.

"మిగిలిన ఉమ్రా యాత్రికులను వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు రాయబార కార్యాలయం, కాన్సులేట్ జనరల్ అధికారులు విమానయాన సంస్థలు, టూర్ ఆపరేటర్లతో నిరంతరం మాట్లాడుతున్నారు" అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జిద్దాలోని కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమిస్తున్నాయి. స్థానిక భారతీయ స్వచ్ఛంద కార్యకర్తల సాయంతో 24 గంటలు పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, బాధితులకు అవసరమైన సంక్షేమ సహాయాన్ని అందిస్తున్నాయి.

భారతీయులకు కీలక హెచ్చరికలు

సౌదీ అరేబియాలో దాదాపు 27.4 లక్షల మంది భారతీయులు వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని రాయబార కార్యాలయం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఆకాశమార్గం నుంచి దాడులు జరిగే సూచనలు కనిపిస్తే వెంటనే సురక్షితమైన భవనాల లోపలికి వెళ్లాలని, సౌదీ అధికారుల సూచనలను ఖచ్చితంగా పాటించాలని సూచించింది.

దాడులు జరిగిన ప్రాంతాలను, క్షిపణి నిరోధక చర్యలను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. సౌదీ చట్టాల ప్రకారం ఇది తీవ్రమైన నేరమని, చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More