సౌదీ విమానాశ్రయంపై దాడిని ఖండించిన భారత్

సౌదీ అరేబియాలోని కింగ్ ఫహద్ విమానాశ్రయంపై హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోవడంపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పౌర, ఇంధన మౌలిక వసతులపై జరుగుతున్న దాడులను కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.

Published on: Oct 22, 2026, 17:24:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. సౌదీ అరేబియాలోని పౌర, ఇంధన మౌలిక వసతులపై యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు జరుపుతున్న దాడులపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సౌదీలోని దమ్మం నగరం వద్ద ఉన్న కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై బుధవారం సాయంత్రం జరిగిన దాడిలో ఒక భారతీయుడు సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంపై విదేశాంగ శాఖ సంతాపం తెలిపింది. సౌదీ అరేబియా ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు భారత్ పూర్తి సంఘీభావం ప్రకటించింది.

కింగ్ ఫహద్ విమానాశ్రయం
కింగ్ ఫహద్ విమానాశ్రయం

అసలు ఏం జరిగింది?

అక్టోబర్ 21 బుధవారం సాయంత్రం దమ్మంలోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా హౌతీ మూకలు దాడులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు భారతీయ పౌరులు ఉన్నారు. ఇదే రోజు తూర్పు ప్రావిన్స్‌లోని సౌదీ అరామ్‌కోకు చెందిన షైబా చమురు క్షేత్రంపైకి దూసుకొచ్చిన డ్రోన్‌ను సౌదీ భద్రతా దళాలు అడ్డుకున్నాయి. అయితే, ఆ డ్రోన్ శిథిలాలు పడి మరో భారతీయుడు గాయపడ్డాడు.

దాడులను సహించేది లేదు: విదేశాంగ శాఖ

సౌదీ అరేబియాపై జరుగుతున్న వరుస దాడులపై భారత విదేశాంగ శాఖ గురువారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. "దమ్మం లోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు సౌదీ అరామ్‌కో షైబా చమురు క్షేత్రంపై అక్టోబర్ 21న జరిగిన దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పౌరులు, కీలక ఇంధన మౌలిక సదుపాయాలపై ఇలాంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇవి వెంటనే ఆగాలి" అని భారత్ స్పష్టం చేసింది.

సౌదీ సార్వభౌమాధికారాన్ని రక్షించుకునే చర్యల్లో ఆ దేశానికి వెన్నుదన్నుగా నిలుస్తామని, పశ్చిమాసియాలో త్వరలోనే శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నామని ప్రకటనలో పేర్కొంది. మృతి చెందిన భారతీయుడి కుటుంబానికి సానుభూతి తెలిపిన కేంద్రం, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం సౌదీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, బాధితులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తోందని వెల్లడించింది.

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఆందోళనలు

పశ్చిమాసియాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల అనంతరం యుద్ధ వాతావరణం నెలకొంది. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో 11 మంది నావికులతో సహా మొత్తం 19 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. అక్టోబర్ 10న రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలోనూ ఒక భారతీయుడు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు.

పశ్చిమాసియా వ్యాప్తంగా సుమారు ఒక కోటి మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులు చమురు క్షేత్రాలు, విమానాశ్రయాలు, నిర్మాణ రంగాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. మన పౌరుల భద్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్న భారత్.. దౌత్య మార్గాలు, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని, పౌర మౌలిక వసతులపై దాడులు ఆపాలని భాగస్వామ్య దేశాలకు పలుమార్లు పిలుపునిచ్చింది.

మరోవైపు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియాలోని తమ దౌత్య కార్యాలయాల నుంచి దౌత్యవేత్తలు, వారి కుటుంబ సభ్యులను వెనక్కి వెళ్లాలని అమెరికా విదేశాంగ శాఖ ఆదేశించింది. ఇది ఇరాన్‌పై అమెరికా ప్రత్యక్ష దాడికి దిగే సూచనగా భావిస్తుండటంతో పశ్చిమాసియాలో భయాందోళనలు మరింత తీవ్రమయ్యాయి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More