...
...
Next Story

యూరప్‌లో కొత్త తరహా సైబర్ దాడి: సూపర్ మార్కెట్ ఫ్రిజ్‌ల ఉష్ణోగ్రతలు మార్చేస్తున్న హ్యాకర్లు

యూరప్‌లోని పలు సూపర్ మార్కెట్లను వింత సైబర్ దాడులు కలవరపెడుతున్నాయి. హ్యాకర్లు నిల్వ కేంద్రాల ఫ్రిజ్‌లు, ఫ్రీజర్ల ఉష్ణోగ్రతలను సడన్‌గా పెంచేస్తుండటంతో భారీగా ఆహార పదార్థాలు పాడైపోతున్నాయి. బెల్జియం, ఐర్లాండ్, స్వీడన్ సహా 5 దేశాల్లో ఈ ఘటనలు వెలుగుచూశాయి.

Updated on: Nov 2, 2026, 20:36:01 IST
Advertisement

యూరప్ దేశాల్లో కొత్త రకం సైబర్ ముప్పు మొదలైంది. ప్రముఖ సూపర్ మార్కెట్ చైన్లను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు వింత దాడులకు తెగబడుతున్నారు. షాపుల్లోని ఫ్రిజ్‌లు, ఫ్రీజర్ల ఉష్ణోగ్రత వ్యవస్థలను (Refrigeration systems) హ్యాక్ చేసి, ఉష్ణోగ్రతలను ఉన్నపళంగా పెంచేస్తున్నారు. దీనివల్ల నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, మాంసం, డెయిరీ ఉత్పత్తులు దెబ్బతింటున్నాయి. కొద్ది వారాల క్రితం ఫ్రాన్స్‌ను ఊపేసిన ఈ తరహా దాడులు, సోమవారం నాటికి యూరప్‌లోని ఇతర దేశాలకూ విస్తరించాయి.

5 దేశాల్లో వెలుగుచూసిన సైబర్ హ్యాకింగ్

యూరప్‌లో కొత్త తరహా సైబర్ దాడి: సూపర్ మార్కెట్ ఫ్రిజ్‌ల ఉష్ణోగ్రతలు మార్చేస్తున్న హ్యాకర్లు
యూరప్‌లో కొత్త తరహా సైబర్ దాడి: సూపర్ మార్కెట్ ఫ్రిజ్‌ల ఉష్ణోగ్రతలు మార్చేస్తున్న హ్యాకర్లు

బెల్జియం, ఐర్లాండ్, స్వీడన్, ఫిన్లాండ్, ఎస్టోనియా దేశాల్లోని ప్రముఖ సూపర్ మార్కెట్ నెట్‌వర్క్‌లలో ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసాలను గుర్తించారు. బెల్జియంలోని ఆహార విక్రయ దిగ్గజాలు అహోల్డ్ డెల్హైజ్, కార్‌ఫోర్, స్పార్ సంస్థలకు చెందిన పలు స్టోర్లలో ఆదివారం రాత్రి నుంచి ఫ్రీజర్ల ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా మారాయి. బెల్జియంలోని 700 కార్‌ఫోర్ ఔట్‌లెట్లలో 15 స్టోర్లపై ఈ ప్రభావం పడినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. స్పార్ నెట్‌వర్క్‌లో ఐదు స్టోర్లు దెబ్బతిన్నాయి.

50 డిగ్రీల సెల్సియస్‌కు చేరిన ఉష్ణోగ్రతలు

ఐర్లాండ్‌లో మస్గ్రేవ్ గ్రూప్‌నకు చెందిన 13 'సూపర్ వాల్యూ' కేంద్రాల్లో ఫ్రీజర్లు సక్రమంగా పనిచేయకపోవడంతో అప్రమత్తమైన సిబ్బంది, శీతలీకరించిన ఆహార పదార్థాలను (Chilled & Frozen foods) ముందు జాగ్రత్తగా విక్రయాల నుంచి తొలగించారు.

స్వీడన్‌లో ఐసీఏ (ICA), కూప్ (Coop) సూపర్ మార్కెట్లలో ఫ్రీజర్ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. షోబో ప్రాంతంలోని ఐసీఏ క్వాంటమ్ స్టోర్‌లో ఫ్రీజర్ ఉష్ణోగ్రత ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్‌కు (122 డిగ్రీల ఫారెన్‌హీట్) చేరుకుందని సదరు యాజమాన్యం ఫేస్‌బుక్ వేదికగా ఆందోళన వ్యక్తం చేసింది. దీనివెనుక హ్యాకింగ్ హస్తం ఉందనే అనుమానాన్ని బయటపెట్టింది. కూప్ గ్రూప్ సైతం తమ ఏడు స్టోర్లలో దాడులు జరిగినట్లు ధ్రువీకరించింది.

సమాచార వ్యవస్థల పునర్నిర్మాణానికి చర్యలు

"కేంద్ర రక్షణ వ్యవస్థల పరిధిలోకి రాని కొన్ని చిన్న స్టోర్లలోని సాధనాలపైనే ఈ ప్రభావం పడింది. ఇది ఐటీ సంబంధిత దాడే కావొచ్చు" అని కెస్కో కార్పొరేట్ సెక్యూరిటీ హెడ్ పెట్రీ కేయ్కో స్పష్టం చేశారు. ఎస్టోనియా దేశంలోనూ పలు సూపర్ మార్కెట్లకు ఇలాంటి సవాళ్లే ఎదురైనట్లు స్థానిక మీడియా తెలిపింది.

ఫ్రాన్స్‌లో 700 స్టోర్లలో నిలిచిన సేవలు

గత నెలలో ఫ్రాన్స్‌లో ఇంటర్‌మార్చే, కోఆపరేటివ్ యూ, కార్‌ఫోర్ వంటి సంస్థలకు చెందిన ఏకంగా 700 కిరాణా స్టోర్లలో శీతలీకరణ వ్యవస్థలను సైబర్ నేరగాళ్లు స్తంభింపజేశారు. ఫలితంగా టన్నుల కొద్దీ ఆహారం పాడైపోయి చెత్తపాలైంది. నెదర్లాండ్స్‌లోనూ అహోల్డ్ డెల్హైజ్ స్టోర్లలో సేవలు నిలిచిపోయాయి. అయితే ఈ దాడులకు ఇప్పటివరకు ఏ సైబర్ ముఠా బాధ్యత వహించకపోవడం గమనార్హం.

అటు అమెరికాలోనూ మిలటరీ స్థావరాల్లోని ఆహార నిల్వ ఫ్రీజర్లు విఫలమవడంపై దర్యాప్తు జరుపుతున్నట్లు పెంటగాన్ ప్రకటించింది. ప్రస్తుత సైబర్ దాడుల నేపథ్యంలో యూరప్ వ్యాప్తంగా ఉన్న రిటైల్ రంగాన్ని భయాందోళనలు గుప్పిట్లోకి తీసుకున్నాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks