...
...
Next Story

ఇంగువ కూడా కల్తీనే! ఇళ్లల్లో రోజూ వాడే బ్రాండ్లపై FSSAI నిషేధం..

నాణ్యతా లోపాలు, కల్తీ ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ బ్రాండ్లు ఎవరెస్ట్, ఎల్‌జీ ఇంగువ విక్రయాలపై ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ) విక్రయాల నిలిపివేత ఆదేశాలు జారీ చేసింది. ల్యాబ్ పరీక్షల్లో నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Published on: Aug 30, 2026, 06:45:31 IST
Advertisement

తెలుగువారి వంటింట్లో పోపు వేయాలన్నా, పప్పు, చారు సువాసనలతో ఘుమఘుమలాడాలన్నా 'ఇంగువ' ఉండాల్సిందే! కానీ.. ఆహారానికి రుచితో పాటు ఔషధ గుణాలు అందించే ఈ కీలకమైన పోపు దినుసు నాణ్యతపై ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన ప్రముఖ మసాలా తయారీ సంస్థలు ఎవరెస్ట్, ఎల్‌జీ (లాల్జీ గోధో అండ్ కంపెనీ విక్రయిస్తున్న కాంపౌండెడ్ ఇంగువ.. నిబంధనలకు విరుద్ధంగా ఉనట్లు తేలింది. ల్యాబ్ పరీక్షల్లో ఈ ఉత్పత్తులు నాసిరకంగా ఉన్నట్లు స్పష్టమవ్వడంతో విక్రయాల నిషేధ ఉత్తర్వులను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ అంశంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది.

వినియోగదారుడి ఫిర్యాదుతో తనిఖీలు!

ఎవరెస్ట్, ఎల్​జీ ఇంగువపై నిషేధం..
ఎవరెస్ట్, ఎల్​జీ ఇంగువపై నిషేధం..

ఒక నిర్దిష్ట బ్రాండ్ ఇంగువ నాణ్యతపై ఒక వినియోగదారుడు సేకరించిన ఆధారాలతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తనిఖీలు చేపట్టింది. మార్కెట్లో లభించే ప్రధాన బ్రాండ్ల నమూనాలను సేకరించి పరిశీలించింది. ముంబైలోని ఎవరెస్ట్, ఎల్‌జీ ప్రొడక్షన్ యూనిట్లతో పాటు గుజరాత్‌లోని అంబర్‌గావ్ ఎవరెస్ట్ తయారీ కేంద్రంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, గుజరాత్ స్టేట్ ఎఫ్‌డీఏ బృందాలు సంయుక్తంగా తనిఖీలు చేసి నమూనాలను ప్రాథమిక ల్యాబ్‌కు పంపాయి.

ఈ రెండు సంస్థల ఇంగువ ఉత్పత్తులు పరీక్షల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యాయి.

ల్యాబ్ పరీక్షల్లో వెలుగుచూసిన లోపాలు..

ఆహార భద్రతా నిబంధనలు 2011 ప్రకారం.. 'కాంపౌండెడ్ ఇంగువ' తయారీలో ముడి ఇంగువతో పాటు గమ్ అరబిక్, పిండి పదార్థాలను నిర్ణీత పరిమాణంలో కలపడానికి అనుమతి ఉంటుంది. అయితే, తయారు చేసిన తుది ఉత్పత్తిలో కనీసం 5 శాతం 'ఆల్కహాల్ సోల్యూబుల్ ఎక్స్‌ట్రాక్ట్' తప్పనిసరిగా ఉండాలి.

కానీ పరీక్షించిన నమూనాల్లో ఈ సారం కేవలం 0 నుంచి 3 శాతం మాత్రమే ఉన్నట్లు నిపుణులు తేల్చారు. కొన్ని నమూనాల్లో ఇది అసలు సున్నా శాతంగా నమోదైంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన ముడి ఇంగువ కంటే 30 నుంచి 40 శాతం తక్కువగా ఉపయోగిస్తున్నట్లు స్పష్టమైంది.

ఈ నాణ్యతా లోపాలు పలు బ్యాచ్‌లలో విస్తృతంగా ఉన్నట్లు తేలడంతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ముంబైలోని ఎవరెస్ట్, ఎల్‌జీ తయారీ యూనిట్ల నుంచి కాంపౌండెడ్ ఇంగువ విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే చర్యల్లో భాగంగానే ఈ నిషేధం విధించినట్లు ప్రకటించింది.

ఈ ఉల్లంఘనలను సరిదిద్ది, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను ఏ విధంగా తయారు చేస్తారో వివరించే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని రెండు సంస్థలను ఆదేశించింది. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న నాసిరకం ఉత్పత్తులను స్వచ్ఛందంగా వెనక్కి తీసుకోవాలని సూచించింది.

ప్రతీ ఇంట్లోనూ రోజూ వాడే ఇంగువలో ఇటువంటి లోపాలు బయటపడటం వినియోగదారులను ఇప్పుడు కలవరానికి గురిచేస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks