FIFA World Cup 2026 : అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కి ఇండియాలోనూ క్రేజ్- మన లీగ్‌ని మాత్రం పట్టించుకోరు! ఎందుకు?
అమెరికా, కెనడా, మెక్సికో దేశాల ఆతిథ్యంలో ఫిఫా ప్రపంచకప్ 2026 నేటి రాత్రి నుంచే షురూ కానుంది. భారత్‌లో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రసార హక్కులు దక్కించుకోగా.. మెగా టోర్నీ క్రేజ్ మధ్య భారతీయ ఫుట్‌బాల్ మార్కెట్ అసలు నిజాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ‘ఫిఫా ప్రపంచకప్ 2026’ మహా సమరానికి సర్వం సిద్ధం! నేటి రాత్రి నుంచి అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ సాకర్ పండుగను వీక్షించేందుకు భారతీయ ఫుట్‌బాల్ అభిమానులు కూడా టీవీలు, మొబైళ్లకు అతుక్కుపోవడానికి రెడీ అయిపోయారు. భారతదేశంలో ఈ మెగా టోర్నమెంట్ అధికారిక బ్రాడ్‌కాస్టింగ్, స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ మీడియా దిగ్గజం 'జీ ఎంటర్‌టైన్‌మెంట్' కైవసం చేసుకుంది. దీనితో మ్యాచ్‌లన్నీ వారి కొత్త స్పోర్ట్స్ ఛానెల్ ‘యునైట్8’లో బుల్లితెరపై ప్రత్యక్ష ప్రసారం కానుండగా, 'జీ5' ఓటీటీ యాప్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి.

రాబోయే నెల రోజుల పాటు మెస్సీ, రొనాల్డో, ఎంబాప్పే అంటూ ఫుట్‌బాల్ అభిమానుల మధ్య చర్చలు, గొడవలు సర్వసాధారణం కానున్నాయి. అయితే, ప్రపంచ ఫుట్‌బాల్‌పై ఇంతటి పిచ్చి చూపిస్తున్న మన భారతీయులు.. మన దేశవాళీ లీగ్ అయిన 'ఇండియన్ సూపర్ లీగ్' (ఐఎస్ఎల్) ను ఎంతవరకు ఆదరిస్తున్నారు? అనే ప్రశ్న ఇప్పుడు క్రీడా రంగంలో పెద్ద చర్చకు దారితీసింది.
క్రికెట్ తర్వాత మన దేశంలో ఫుట్‌బాలే టాప్!
భారతదేశంలో అత్యధిక మంది చూసే క్రీడల్లో క్రికెట్ తర్వాత ఫుట్‌బాల్‌దే రెండో స్థానం. ప్రముఖ రేటింగ్ సంస్థ కేపీఎమ్‌జీ సెప్టెంబర్ 2025 నివేదిక ప్రకారం.. మన దేశంలో ఫుట్‌బాల్ వీక్షకుల సంఖ్య ఏకంగా 30 కోట్లు (300 మిలియన్లు) గా ఉంది. ఈ జాబితాలో 61 కోట్ల వ్యూవర్స్‌తో క్రికెట్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, 28 కోట్ల వ్యూవర్స్‌తో కబడ్డీ మూడో స్థానంలో ఉంది. కేపీఎమ్‌జీ గణాంకాల ప్రకారం.. 2018 నుంచి 2025 మధ్య కాలంలో భారత ఫుట్‌బాల్ ప్రేక్షకుల సంఖ్య 25 శాతం పెరిగింది. అయితే ఇదే కాలంలో క్రికెట్ వ్యూవర్‌షిప్ 38 శాతం వేగంతో దూసుకెళ్లడం విశేషం.
మన దేశంలో 30 కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానులు ఉన్నప్పటికీ, ఐఎస్ఎల్కు వచ్చేసరికి కథ పూర్తిగా మారుతోంది. ఐపీఎల్, ఉమెన్స్ ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్), చివరికి ప్రో కబడ్డీ లీగ్‌కు వచ్చే వ్యూవర్‌షిప్‌తో పోలిస్తే ఐఎస్ఎల్ చాలా వెనుకబడి ఉంది.
మింట్ కథనం ప్రకారం.. భారతదేశంలోని మొత్తం ఫుట్‌బాల్ అభిమానుల్లో అత్యధికులు కేరళ, గోవా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నారు. మిగిలిన ప్రాంతాల్లో లోకల్ లీగ్స్‌కు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు.
వ్యాపార పరంగా భారీ వ్యత్యాసం
తక్కువ వ్యూవర్‌షిప్ కారణంగా భారతదేశంలో ఫుట్‌బాల్‌పై భారీ పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు వెనుకాడుతున్నాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ 2034 వరకు జరిగే పలు ఫిఫా టోర్నమెంట్ల ప్రసార హక్కుల కోసం ఏకంగా 30 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 250 కోట్లు) పైగా ఖర్చు చేసింది. దీనికి భిన్నంగా, ఈ ఏడాది ఐఎస్ఎల్ మీడియా హక్కులు కేవలం రూ. 9 కోట్ల లోపే పలికాయి. ఈ రెండు అంకెల మధ్య ఉన్న భారీ వ్యత్యాసమే భారతీయ ఫుట్‌బాల్ మార్కెట్ దుస్థితిని స్పష్టం చేస్తోంది!
పైగా, దీర్ఘకాలిక వాణిజ్య వివాదాల కారణంగా ఐఎస్ఎల్ ఇటీవలే ఆలస్యంగా పునఃప్రారంభమైంది. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్), రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన 'ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్' (ఎఫ్ఎస్డీఎల్) ల మధ్య నడిచిన సుదీర్ఘ చర్చల తర్వాతే ఈ లీగ్‌కు లైన్ క్లియర్ అయింది.
అయితే, భారత ఫుట్‌బాల్ మార్కెట్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్‌కోడ్ కో-ఫౌండర్, ఎన్‌బీఏ ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ యానిక్ కొలాకో అభిప్రాయపడ్డారు. గతంలో ఐఎస్ఎల్ ఏకంగా 15 కోట్ల మంది అభిమానులకు చేరువైందని ఆయన గుర్తుచేశారు. దేశంలో 30 కోట్ల మంది ఫుట్‌బాల్ లవర్స్ ఉన్నప్పుడు, లీగ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడం పెద్ద కష్టమేమీ కాదన్నారు.
"దేశంలో 30 కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానులు ఉన్నారు. మన ముందున్న అసలైన అవకాశం ఇదే. మీరు లా లిగా, రొనాల్డో లేదా మాంచెస్టర్ యునైటెడ్ అభిమాని అయినా సరే.. మీరంతా రేపటి రోజున భారతీయ ఫుట్‌బాల్‌కు నమ్మకమైన అభిమానులుగా మారే అవకాశం ఉంది," అని యానిక్ కొలాకో ఒక ఇంటర్వ్యూలో ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈపీఎల్ మాయలో భారతీయ యువత!
భారతీయ ఫుట్‌బాల్ అభిమానుల దృష్టి ఎక్కువగా విదేశీ లీగ్‌లపైనే ఉంటోంది. గత ఏడాది భారతీయ ప్రేక్షకులు కేవలం టీవీల్లోనే 'ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్' (ఈపీఎల్) మ్యాచ్‌లను ఏకంగా 490 కోట్ల నిమిషాల పాటు వీక్షించారని ఎక్స్ఛేంజ్4మీడియా నివేదిక పేర్కొంది. 2021తో పోలిస్తే ఈ వ్యూవర్‌షిప్ 88 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈపీఎల్‌కు ప్రతి ఏటా 470 కోట్లకు పైగా వ్యూవర్స్ ఉంటారు.
'యూగోవ్' పరిశోధన ప్రకారం.. భారతదేశంలో ఈపీఎల్ చూసే ప్రేక్షకులు ఎక్కువ కొనుగోలు శక్తి కలిగిన ప్రీమియం సెగ్మెంట్‌కు చెందినవారు. మార్కెట్లోకి వచ్చే కొత్త వస్తువులను త్వరగా కొనే అలవాటు వీరికుంది. తమ కుటుంబాల కొనుగోలు నిర్ణయాలను వీరు ప్రభావితం చేయగలరు. కానీ, మన దేశవాళీ ఫుట్‌బాల్ ఈ స్థాయి బ్రాండ్ లాయల్టీని సంపాదించడంలో నిరంతరం విఫలమవుతూనే వస్తోంది.
ఇందుకు కొన్ని ప్రాథమిక కారణాలు కూడా ఉన్నాయి. భారతీయ కాలమానం ప్రకారం ఈపీఎల్ మ్యాచ్‌లు శని, ఆదివారాల్లో సాయంత్రం 5:30 లేదా రాత్రి 8 గంటల వంటి అనుకూలమైన సమయాల్లో వస్తాయి. దీనికి భిన్నంగా, ఐఎస్ఎల్ మ్యాచ్‌లు భారతీయ టెలివిజన్ ప్రైమ్ టైమ్, క్రికెట్ లైవ్ మ్యాచ్‌లతో తలపడాల్సి వస్తోంది. అంతేకాకుండా, ఈపీఎల్ అనేది ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఎలైట్ లీగ్. ఆ మ్యాచ్‌లు చూస్తున్నామని ఆఫీసుల్లో సహచరుల ముందు గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ, ఐఎస్ఎల్ విషయంలో ఆ పరిస్థితి ఇంకా రాలేదు.
ఆశాకిరణాలు.. వరల్డ్ కప్ తెచ్చే మార్పు!
పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ, భారత ఫుట్‌బాల్ రంగంలో కొన్ని సానుకూల అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈవై-ఫిక్కీ నివేదిక ప్రకారం.. 2024, 2025 సంవత్సరాల్లో ఫుట్‌బాల్‌తో సహా ఇతర కొత్త క్రీడలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా రూ. 200 కోట్ల ఆదాయాన్ని ఆకర్షించాయి. అలాగే ఐఎస్ఎల్ ఆలస్యమైనప్పటికీ, 2025లో జియోస్టార్ టీవీ ఛానెళ్లలో, జియోహాట్‌స్టార్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో వచ్చిన మొత్తం క్రీడల వ్యూవర్‌షిప్‌లో ఫుట్‌బాల్ 1 శాతానికి పైగా వాటాను దక్కించుకుంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఫిఫా ఆమోదించిన ఫుట్‌బాల్‌లను తయారు చేసే టాప్-3 దేశాలలో భారతదేశం కూడా ఒకటి అని కేపీఎమ్‌జీ పేర్కొంది. ఫుట్‌బాల్ క్రీడా సామాగ్రి, దుస్తుల ఎగుమతుల ద్వారా దేశానికి భారీ ఆదాయం వచ్చే అవకాశం ఇంకా అలాగే ఉంది.
నేటి రాత్రి ప్రారంభం కానున్న ఫిఫా ప్రపంచకప్.. భారతీయుల్లో ఫుట్‌బాల్‌పై సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఆ ప్రపంచకప్ తెచ్చే క్రేజ్.. రేపటి రోజున మన దేశవాళీ ఐఎస్ఎల్ వైపు ప్రేక్షకులను ఎంతవరకు తిప్పుకుంటుంది అనేదే భారత ఫుట్‌బాల్ ముందున్న అసలైన పరీక్ష!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


