Fifa world cup 2026 : ఫిఫా వరల్డ్ కప్‌లో పెను సంచలనం- పరాగ్వే చేతిలో జర్మనీ పరాజయం, టోర్నీ నుంచి ఔట్!
Germany vs Paraguay : ఫిఫా ప్రపంచకప్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన జర్మనీకి కోలుకోలేని షాక్ తగిలింది. రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో పసికూన పరాగ్వే పెనాల్టీ షూటౌట్‌లో జర్మనీని ఓడించి టోర్నీ నుంచి ఇంటికి పంపింది.
ఫిఫా ప్రపంచకప్ 2026లో మరో అతిపెద్ద అద్భుతం ఆవిష్కృతమైంది! నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన జర్మనీ జట్టును రౌండ్ ఆఫ్ 32 దశలోనే పరాగ్వే మట్టికరిపించింది. నిర్ణీత సమయం, అదనపు సమయం (ఎక్స్‌ట్రా టైమ్) ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. అక్కడ ఒత్తిడిని జయించిన పరాగ్వే విజయం సాధించి తదుపరి దశకు అర్హత సాధించగా, జర్మనీ కన్నీళ్లతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఫిఫా చరిత్రలో రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు ఫైనల్‌కు చేరిన ఘనత జర్మనీకి ఉంది. అలాంటి దిగ్గజ జట్టు, ఏమాత్రం అంచనాలు లేని పరాగ్వే చేతిలో ఓడిపోవడం ఈ ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌లోనే అత్యంత పెద్ద అప్‌సెట్‌గా నిలిచిపోతుంది.
ఉత్కంఠ రేపిన పెనాల్టీ షూటౌట్.. విలన్‌గా మారిన టా
నిజానికి ఎక్స్‌ట్రా టైమ్‌లో జర్మనీ ప్లేయర్ జోనాథన్ టా కొట్టిన విన్నింగ్ గోల్‌ను రెఫరీ వివాదాస్పద రీతిలో తిరస్కరించడం మ్యాచ్ మలుపు తిరగడానికి కారణమైంది. ఆ తర్వాత జరిగిన షూటౌట్‌లో జర్మనీకి చెందిన కై హావర్ట్జ్, నిక్ వోల్టెమేడ్‌ల స్పాట్ కిక్‌లను పరాగ్వే గోల్‌కీపర్ ఒర్లాండో గిల్ అద్భుతంగా అడ్డుకున్నాడు. అయితే పరాగ్వే ఆటగాళ్లు సనాబ్రియా, బాల్బుయానా తమ నాల్గొవ, ఐదో అవకాశాలను మిస్ చేయడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పీక్స్‌కు చేరింది.
ఆ తర్వాత జర్మనీ తరఫున ఆరో కిక్ తీసుకున్న జోనాథన్ టా బంతిని పోస్ట్‌కు పైగా కొట్టి తప్పు చేశాడు. ఇదే సువర్ణావకాశంగా మార్చుకున్న పరాగ్వే ప్లేయర్ జోస్ కెనాల్, ఒత్తిడిని చిత్తు చేస్తూ లెజెండరీ గోల్‌కీపర్ మాన్యుయెల్ నోయర్‌ను బోల్తా కొట్టించి బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దీనితో జర్మనీ ప్యాకప్ అవ్వక తప్పలేదు.
పరాగ్వే హీరో ఒర్లాండో గిల్!
ఈ చారిత్రాత్మక విజయంలో పరాగ్వే గోల్‌కీపర్ ఒర్లాండో గిల్ రియల్ హీరోగా నిలిచాడు. మ్యాచ్ సాగిన 120 నిమిషాల వ్యవధిలో జర్మనీ గోల్ చేయకుండా ఏకంగా ఆరు అద్భుతమైన సేవ్స్ చేశాడు!
ఇక పరాగ్వే జట్టుకు ప్రపంచకప్ నాకౌట్ చరిత్రలో ఇది మరపురాని రోజు. ఇంతకుముందు ఆడిన ఐదు నాకౌట్ మ్యాచ్‌ల్లో ఆ జట్టు కనీసం ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. చివరిగా 2010 ప్రపంచకప్‌లో జపాన్‌ను పెనాల్టీల ద్వారా ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరడమే ఆ జట్టు బెస్ట్ పర్ఫార్మెన్స్.
జర్మనీకి వరుస పరాభవాలు!
2014 ప్రపంచకప్ ఫైనల్లో లియోనెల్ మెస్సి నేతృత్వంలోని అర్జెంటీనాను ఓడించి టైటిల్ గెలిచిన తర్వాత, జర్మనీ ఆడిన మొదటి నాకౌట్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. 2018, 2022 ప్రపంచకప్‌లలో జర్మనీ గ్రూప్ స్టేజ్ దాటకుండానే వెనుదిరిగింది. ఈసారైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో వచ్చిన ఆ జట్టుకు మళ్లీ నిరాశే మిగిలింది.
"ఈ ప్రపంచకప్‌పై మాకు చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. ఇలా మళ్లీ అభిమానులను నిరాశపరచడం చాలా బాధగా ఉంది. మ్యాచ్‌లో అవకాశాలు సృష్టించడం, పట్టును నిలుపుకోవడం మాకు కష్టంగా మారింది," అని జర్మనీ స్టార్ ప్లేయర్ కై హావర్ట్జ్ మ్యాచ్ అనంతరం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


