Fifa World Cup : ఫిఫా వరల్డ్ కప్ 2026లో రొనాల్డో వర్సెస్ మెస్సి సాధ్యమేనా?
Fifa World Cup 2026 : ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్‌లో కొలంబియాతో పోర్చుగల్ మ్యాచ్ డ్రా అవ్వడంతో అభిమానులకు నిరాశ ఎదురైంది. దీనివల్ల క్వార్టర్ ఫైనల్లో జరగాల్సిన మెస్సి-రొనాల్డోల హై-వోల్టేజ్ పోరు మిస్సయింది! ఇక వీరిద్దరూ ఫైనల్లో మాత్రమే తలపడే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్‌బాల్ అభిమానులకు శనివారం రాత్రి కొంత నిరాశే మిగిలిందని చెప్పాలి. ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా జరిగిన గ్రూప్ 'కే' చివరి మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్ జట్టు కొలంబియాతో జరిగిన పోరును 0-0తో డ్రా చేసుకుంది. ఈ ఫలితంతో పోర్చుగల్ తన గ్రూప్‌లో రన్నరప్‌గా నిలిచి నాకౌట్ స్టేజ్‌లో టోర్నమెంట్ తదుపరి బ్రాకెట్‌కు (పోటీ విభాగం) పడిపోయింది. మరోవైపు అర్జెంటీనా జట్టు ఇప్పటికే గ్రూప్ 'జే'లో టాప్ పొజిషన్ సాధించింది. నిబంధనల ప్రకారం రెండు జట్లు తమ తమ గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచి ఉంటే క్వార్టర్ ఫైనల్లోనే లియోనెల్ మెస్సి వర్సెస్ రొనాల్డోల అసలు సిసలైన పోరు జరిగేది. కానీ, ఇప్పుడు ఆ సమీకరణాలన్నీ పూర్తిగా మారిపోయాయి.

జోర్డాన్‌తో జరగబోయే చివరి మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా అర్జెంటీనా గ్రూప్ 'జే' టాపర్‌గా నిలవడం ఖాయమైంది. అయితే, పోర్చుగల్ గ్రూప్ 'కే'లో రెండో స్థానానికే పరిమితం కావడంతో.. ఇక లియోనెల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డో మైదానంలో ముఖాముఖి తలపడాలంటే రెండు జట్లూ అన్ని అడ్డంకులను దాటుకుని నేరుగా 'ఫైనల్'కు చేరాల్సిందే! ఫ్రాన్స్, ఇంగ్లాండ్, బ్రెజిల్, నెదర్లాండ్స్ వంటి పటిష్టమైన జట్లు సూపర్ ఫామ్‌లో ఉన్న తరుణంలో.. అర్జెంటీనా, పోర్చుగల్ జట్లు ఫైనల్ చేరడం అసాధ్యం కాకపోయినా, అత్యంత క్లిష్టమైన విషయమనే చెప్పాలి.
ఫైనల్స్ వైపు పోర్చుగల్ సాగాల్సిన కఠినమైన బాట..
పోర్చుగల్ జట్టు తన నాకౌట్ వేటను గురువారం, 2 జులై 2026న టొరంటో స్టేడియంలో ప్రారంభించనుంది. 'రౌండ్ ఆఫ్ 32' పోరులో గ్రూప్ 'ఎల్' రన్నరప్ అయిన క్రొయేషియాతో రొనాల్డో సేన తలపడుతుంది.
రౌండ్ ఆఫ్ 16 (6 జులై 2026): క్రొయేషియాపై గెలిస్తే పోర్చుగల్ జట్టు డల్లాస్ స్టేడియంలో అడుగుపెడుతుంది. అక్కడ గ్రూప్ 'హెచ్' టాపర్ అయిన బలమైన స్పేన్ జట్టు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
క్వార్టర్ ఫైనల్స్ (10 జులై 2026): ఒకవేళ స్పేన్‌ను కూడా ఓడిస్తే, లాస్ ఏంజిల్స్ స్టేడియంలో ఇంగ్లాండ్ లేదా అమెరికా వంటి గట్టి ప్రత్యర్థులతో క్వార్టర్స్ పోరు ఉంటుంది.
సెమీ ఫైనల్స్ (14 జూలై 2026): ఈ దశ దాటాక తిరిగి డల్లాస్ స్టేడియంలో జర్మనీ, నెదర్లాండ్స్ లేదా డిఫెండింగ్ రన్నరప్ ఫ్రాన్స్ వంటి దిగ్గజ జట్లలో ఒకరితో రొనాల్డో టీమ్ సెమీస్ లాంఛనం పూర్తి చేయాల్సి ఉంటుంది.
అప్పుడే పోర్చుగల్ టీమ్ ఫిఫా ప్రపంచక్ ఫైనల్‌కు చేరుకుంటుంది.
టైటిల్ డిఫెండింగ్ రేసులో అర్జెంటీనా ప్రయాణం..
ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా తన టైటిల్‌ను నిలబెట్టుకునే నాకౌట్ ప్రయాణాన్ని శుక్రవారం, 3 జులై 2026న ప్రారంభించనుంది. 'రౌండ్ ఆఫ్ 32' మ్యాచ్‌లో లియోనెల్ స్కలోని ఆల్బీసెలెస్టే బలగం, కేప్ వెర్డే జట్టుతో మయామి స్టేడియంలో తలపడనుంది.
రౌండ్ ఆఫ్ 16: కేప్ వెర్డేపై విజయం సాధిస్తే, అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు ఆస్ట్రేలియా-ఈజిప్ట్ మ్యాచ్ విజేతతో తదుపరి రౌండ్‌లో తలపడుతుంది.
క్వార్టర్ ఫైనల్స్: ఈ దశలో అర్జెంటీనాకు కొలంబియా, స్విట్జర్లాండ్ లేదా ఇరాన్ వంటి జట్లతో భారీ పోరు ఎదురుకావచ్చు.
సెమీ ఫైనల్స్: ఈ అడ్డంకిని కూడా దాటితే, ఫైనల్ బెర్త్ కోసం ఫ్రాన్స్ లేదా నెదర్లాండ్స్ వంటి యూరోపియన్ జెయింట్స్‌తో మెస్సి సేన అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


