PM Modi : ‘నక్సలిజం ముగింపు తర్వాత జరుగుతున్న తొలి దీపావళి’- బస్తర్​లో ప్రధాని మోదీ..

దేశంలో నక్సలిజంపై సాధించిన చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది దీపావళి అత్యంత ప్రత్యేకమైనదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో పర్యటించిన ఆయన జవాన్లతో కలిసి వేడుకల్లో పాల్గొని భద్రతా బలగాల పోరాట పటిమను కొనియాడారు.

Published on: Nov 8, 2026, 13:01:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దేశంలో నక్సలిజంపై దశాబ్దాలుగా సాగుతున్న సుదీర్ఘ పోరాటంలో భారత్ చారిత్రాత్మక విజయం సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఛత్తీస్‌గఢ్‌లోని సమస్యాత్మక బస్తర్ ప్రాంతంలో పర్యటించిన ప్రధాని.. అక్కడ భద్రతా బలగాలతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. 2026 దీపావళి దేశ చరిత్రలోనే అత్యంత ప్రత్యేకమైనదని, ఈ రోజున దేశంలోని ప్రతి జిల్లా నక్సలిజం నుంచి విముక్తి పొందిందని, నక్సలిజం అంతమైన అనంతరం జరుగుతున్న తొలి దీపావళి ఇదేనని ఆయన స్పష్టం చేశారు.

బస్తర్​లో ప్రధాని నరేంద్ర మోదీ.. (screengrab/ANI)
బస్తర్​లో ప్రధాని నరేంద్ర మోదీ.. (screengrab/ANI)

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, విశాఖ ఏజెన్సీలతో పాటు ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్లు, నక్సలైట్ల హింసతో ఆందోళనకర వాతావరణం ఉండేది. అటువంటి భయాందోళనల నుంచి ఈ రోజు దేశమంతటా ప్రశాంత పరిస్థితులు నెలకొనడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

47 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. జీరో పారామిలిటరీ మరణాలు!

గత ఏడాది కాలంలో విధి నిర్వహణలో ఒక్క సీఆర్‌పీఎఫ్ జవాన్ కూడా ప్రాణాలు కోల్పోలేదని ప్రధాని మోదీ వెల్లడించారు. 47 ఏళ్ల భారతీయ భద్రతా బలగాల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు.

"గతంలో నక్సలైట్ల కంటే మన వీర జవాన్లే ఎక్కువ సంఖ్యలో అమరులయ్యేవారు. కానీ ప్రభుత్వం అమలు చేసిన కఠిన వ్యూహాలు, సైనిక బలగాల అసాధారణ క్రమశిక్షణ, తెగువ వల్ల ఈ రోజు పరిస్థితులు పూర్తిగా మారాయి," అని ప్రధాని కొనియాడారు.

'2014 కంటే ముందు.. నిర్లక్ష్యం వహించిన పాలకులు'

2004 నుంచి 2013 మధ్య కాలంలో నక్సలైట్ల హింసను నాటి ప్రభుత్వాలు ఒక నయం చేయలేని వ్యాధిగా భావించి వదిలేశాయని ప్రధాని విమర్శించారు. ఒకే ఏడాదిలో దాదాపు 2,000 నక్సల్ దాడులు జరిగిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు.

"ఆ రోజుల్లో నక్సలైట్ల దాడులు, పేలుళ్లకు మన వీర సైనికుల రక్తం ఏరులై పారింది. 2010లో దంతెవాడలో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు, 44 మంది పౌరులు దారుణంగా హత్యకు గురైన సంఘటనలు దేశాన్ని షాక్‌కు గురిచేశాయి. ఛత్తీస్‌గఢ్‌లోనే వెయ్యి మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. అప్పటి పాలకులు భద్రతా దళాల బలిదానాలపై కనీసం కంటితడి కూడా పెట్టలేదు," అని ప్రధాని మోదీ తీవ్రంగా ఆక్షేపించారు.

పొలిటికల్ విల్.. వ్యూహాత్మక అడుగులు

2014లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్గత భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు కావాల్సిన స్పష్టమైన 'రాజకీయ సంకల్పం' పెరిగిందని ప్రధాని తెలిపారు.

"దేశ శత్రువులను బలీయమైన పట్టుదలతో, పక్కా వ్యూహంతో ఓడించాల్సిన అవసరం ఉంది. నాటి కొరవడిన రాజకీయ సంకల్పం 2014 తర్వాతే బలపడింది," అని ఆయన వ్యాఖ్యానించారు.

దేశ బార్డర్​లను కాపాడే సరిహద్దు భద్రతా దళాలు ఎంత ముఖ్యమో, దేశ అంతర్గత ప్రశాంతతను కాపాడే బలగాలు కూడా అంతే కీలకమని ప్రధాని స్పష్టం చేశారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున తాను జవాన్లకు ధన్యవాదాలు తెలియజేయడానికే దీపావళి పర్వదినాన బస్తర్ వచ్చానని ప్రధాని వెల్లడించారు. మావోయిస్టు రహిత భారత్‌తో కోట్లాది మంది ప్రజలు భయం లేకుండా ఉత్సాహంగా పండుగ జరుపుకుంటున్నారని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More