...
...
Next Story

AI layoff : ఉద్యోగిని లేఆఫ్​ చేసిన ‘ఏఐ' బాస్- ప్రపంచంలోనే తొలిసారి!

Andon Labs Luna : ఒక సీఈఓ తన కంపెనీలోని ఉద్యోగులను తొలగించడాన్ని వినుంటారు. ఒక కంపెనీ యజమాని, తన వర్కర్లను లేఆఫ్​ చేయడాన్ని చూసుంటారు. కానీ ఒక 'ఏఐ'.. ఉద్యోగిని లేఆఫ్​ చేయడం ఎప్పుడైనా విన్నారా? ప్రపంచంలో తొలిసారిగా.. అమెరికాలో ఇదే జరిగింది!

Published on: Aug 17, 2026, 06:45:45 IST
Advertisement

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో నేటి టెక్ ప్రపంచంలో వింత వింత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏఐ వల్ల చాలా మంది తమ ఉద్యోగాలు కోల్పోతున్నారు. దాదాపు అన్ని రంగాల వారిని ఈ కృత్రిమ మేధ ఇబ్బంది పెడుతున్న తరుణంలో అమెరికా నుంచి మరొక సంచలన వార్త బయటకు వచ్చింది. ఒక ఏఐ 'బాస్'.. తన ఉద్యోగిని లేఆఫ్ చేసింది! ఇలా.. ఒక ఏఐ ఉద్యోగిని తొలగించడం ఇదే తొలిసారి!

అసలేం జరిగిందంటే..

ఉద్యోగిని ఫైర్ చేసిన ఏఐ బాస్..
ఉద్యోగిని ఫైర్ చేసిన ఏఐ బాస్..

అమెరికా శాన్​ ఫ్రాన్సికోలో ఒక ప్రయోగాత్మక స్టోర్‌ను నడుపుతున్న ఏఐ మేనేజర్ తన తొలి లేఆఫ్ నిర్ణయాన్ని తీసుకుంది. ఏఐ నిర్వహించే 'ఆండన్ మార్కెట్'ను నడుపుతున్న ఆండన్ లాబ్స్ సంస్థలో ఒక ఉద్యోగి 23 షిఫ్టుల్లో 17 సార్లు ఆలస్యంగా వచ్చాడు. ఏఐ మేనేజర్ 'లూనా'.. అతడిని తొలగించాలని సిఫారసు చేసినట్లు తెలిపింది. మానవ సిబ్బంది ఆ సిఫారసును పరిశీలించి చివరికి ఉద్యోగం నుంచి తొలగించారు.

అయితే ఈ నిర్ణయం పూర్తిగా లూనా స్వయంగా తీసుకోలేదు! కొన్ని నెలల క్రితమే ఏఐ ఒక అటెండెన్స్ విధానాన్ని రూపొందించింది. కానీ ఆ తర్వాత దానిని పర్యవేక్షించడం మర్చిపోయింది. ఫలితంగా ఆ ఉద్యోగి నెలల తరబడి ఆలస్యంగా వస్తున్నా ఎలాంటి చర్యలు కనిపించలేదు. ఆండన్ లాబ్స్ సంస్థ జోక్యం చేసుకుని, తాను సృష్టించిన నిబంధనల కోసం తన జ్ఞాపకశక్తిని పరిశీలించాల్సిందిగా లూనాకు సూచించింది. ఆ తర్వాత ఆ ఉద్యోగి ఇంకా కంపెనీకి సరిపోతాడా లేదా అని అంచనా వేయాలని కోరింది. దీనితో లూనా అతడిని తొలగించాలని సిఫార్సు చేసింది.

నిజమైన వ్యాపారాన్ని నడపడానికి, మానవ ఉద్యోగులను నిర్వహించడానికి ఏఐ ఏజెంట్‌కు బాధ్యత అప్పగిస్తే ఏం జరుగుతుందో పరీక్షించడానికి ఆండన్ మార్కెట్‌ను రూపొందించారు.

ఏఐ లూనా చేసే పనులు ఇవి..

ఈ షాపులో పుస్తకాలు, కొవ్వొత్తులు, ఆర్ట్‌వర్క్, గేమ్స్, ఇతర వస్తువులను విక్రయిస్తున్నారు. అమ్మకాలు జరుగుతున్నప్పటికీ ఈ స్టోర్ ఇంకా లాభాల బాట పట్టలేదు. మార్చిలో లక్ష డాలర్లుగా ఉన్న దీని బ్యాంక్ బ్యాలెన్స్, ఐదు నెలల తర్వాత 61,186 డాలర్లకు పడిపోయింది.

‘ఉద్యోగం ఎప్పుడో పోవాల్సింది..’

ఏఐ మరింత సామర్థ్యం సంతరించుకుంటున్న కొద్దీ కార్యాలయాలు ఎలా మారుతాయనేదానికి ఈ ప్రయోగం ఒక అద్దం పడుతోందని ఆండన్ లాబ్స్ సీఈఓ లుకాస్ పీటర్సన్ తెలిపారు. "ఏఐలు అత్యంత శక్తివంతంగా మారి ఎంతో ఆర్థిక విలువను సృష్టించగలవు. కానీ వాటికి భౌతిక శ్రమే అతిపెద్ద అవరోధంగా మారుతుంది," అని ఆయన పేర్కొన్నారు.

అదే సమయంలో, ఈ లేఆఫ్ ఘటన ప్రస్తుత ఏఐ వ్యవస్థల లోపాలను కూడా బయటపెట్టింది. లూనా ఒక నిబంధనను రూపొందించగలిగినప్పటికీ, దానిని నిరంతరం పర్యవేక్షించకపోవడం, అమలు చేయడంలో ఇబ్బంది పడిందని తేలింది.

"ఒక మానవ ఉద్యోగి అయితే ఈ వ్యక్తిని చాలా ముందే ఉద్యోగం నుంచి తొలగించేవాడు. అందుకే ఇందులో ఎలాంటి అనైతికత లేదని భావించాము," అని పీటర్సన్ వివరించారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks