80th independence day : సప్తధార, ఏఐ, డేటా సెంటర్లు, దిమాగి నక్సల్స్- మోదీ ఎర్రకోట ప్రసంగం హైలైట్స్..
2047 నాటికి వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ 'సప్తధార' పేరిట ఏడు సూత్రాల సంస్కరణల ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించారు. ఈ నేపథ్యలో ఎర్రకోట వేదికగా తయారీ రంగం, ఏఐ, డేటా సెంటర్ల ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు.
భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట ప్రాకారాల నుంచి కీలక ప్రకటన చేశారు. గడిచిన అయిదు నుంచి ఏడు దశాబ్దాలలో సాధించలేని అభివృద్ధిని కేవలం అయిదు నుంచి ఏడేళ్ల వ్యవధిలోనే సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు దిల్లీ ఎర్రకోట వేదికగా జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. దేశ భవిష్యత్తును మార్చే దిశగా ‘సప్తధార’ పేరిట సరికొత్త సంస్కరణల ఫ్రేమ్‌వర్క్‌ను ప్రధాని ఆవిష్కరించారు.

ప్రాచీన కాలంలో 'సప్త సింధు' ఏ విధంగా దేశ శక్తి సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచిందో గుర్తుచేసిన ప్రధాని, ఇప్పుడు వికసిత్ భారత్ నిర్మాణానికి అదే తరహాలో 'సప్తధార' శక్తి అవసరమని పేర్కొన్నారు. దేశ యువత భాగస్వామ్యంతో మన పనితీరులో, ఆలోచనా విధానంలో వేగాన్ని పెంచాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు.
సప్తధారలోని ముఖ్యాంశాలు ఏంటి?
ఈ ఏడు సూత్రాల ఫ్రేమ్‌వర్క్‌లో తయారీ రంగానికి ప్రధాని పెద్దపీట వేశారు. కేవలం ఉత్పాదకతను పెంచడమే కాకుండా డిజైన్ నుంచి ఫైనల్ ప్రాడక్ట్స్ వరకు పూర్తి స్థాయి డొమెస్టిక్ వాల్యూ చెయిన్‌ను తయారు చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ సరఫరా గొలుసులో భారత్ ఒక నమ్మకమైన కేంద్రంగా ఎదగాలని, నాణ్యతలో రాజీ పడకుండా తయారీ రంగం ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు.
అలాగే జీవన సౌలభ్యం, వేగవంతమైన కనెక్టివిటీ కోసం 'గతి శక్తి', దేశ రక్షణ రంగంలో స్వావలంబన కోసం 'రక్షా శక్తి'లను ప్రధాన స్థంభాలుగా మోదీ అభివర్ణించారు. హ్రీన్ ఎకానమీ, బ్లూ ఎకానమీలతో పాటు సుస్థిర అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు.
ఏఐ, డేటా సెంటర్లకు భారీగా విద్యుత్ అవసరం..
ప్రపంచం.. భవిష్యత్ సాంకేతికతలతో దూసుకుపోతున్న తరుణంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, డేటా సెంటర్ల ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. డిజిటల్ ప్రపంచాన్ని ముందుకు నడపడానికి భారీ మొత్తంలో విద్యుత్ అవసరమని అన్నారు.
రాబోయే రోజుల్లో ఏఐ రంగంలో కోటి మంది యువతకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మోదీ తెలిపారు.
దేశవ్యాప్తంగా ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ ఎన్‌సీఆర్ వంటి ప్రాంతాలలో డేటా సెంటర్లు విస్తరిస్తున్నాయని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం గడిచిన ఐదేళ్లలో గణనీయంగా వృద్ధి చెందిందని పేర్కొంది.
మహారాష్ట్రలోని థానే, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో డేటా సెంటర్ల ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్న తరుణంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భూమి, నీరు, విద్యుత్ వనరులపై తీవ్ర ప్రభావం చూపుతాయనే ఆందోళనలతో థానేలో అమెజాన్ డేటా సెంటర్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన బాట పట్టారు. డేటా సెంటర్ల కోసం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో చెట్ల నరికివేతపైనా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
మోదీ ప్రసంగంలో యువతపై ఫోకస్..
వికసిత్ భారత్ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమని, వారే ఈ ప్రగతికి అతిపెద్ద లబ్ధిదారులుగా నిలుస్తారని ప్రధాని స్పష్టం చేశారు. యువతను మన అత్యున్నత ప్రాధాన్యతగా ఎంచుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
విర్థులకు, వారి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రధాని ఒక కీలక నిర్ణయం ప్రకటించారు. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనివల్ల వేలాది రూపాయల ఖర్చు ఆదా అవుతుందని, పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
'దిమాగి నక్సల్స్' పట్ల అప్రమత్తంగా ఉండాలి'
సాయుధ నక్సలిజం అంతరించిపోయినప్పటికీ, సమాజంలో 'దిమాగి నక్సల్స్' రూపంలో కొత్త ముప్పు పొంచి ఉందని ప్రధాని మోదీ హెచ్చరించారు. అలాంటి ఆలోచనలు ఉన్నవారిని గుర్తించి సమాజం నుంచి వేరుచేయాలని, దేశ భద్రత, పురోగతి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే.. దిమాగి నక్సల్స్ అంటే ఏంటి? దిమాగి నక్సల్స్ అంటే ఎవరు? అన్న ప్రశ్నలకు మోదీ స్పష్టత ఇవ్వలేదు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


