France vs Paraguay : పోరాడి ఓడిన పరాగ్వే- క్వార్టర్ ఫైనల్స్‌కు ఫ్రాన్స్, మెస్సి రికార్డుపై ఎంబాపె కన్ను!
France vs Paraguay live : ఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ పోరులో పరాగ్వే ఫ్రాన్స్‌ను ముప్పితిప్పలు పెట్టింది. అయితే 70వ నిమిషంలో కిలియన్ ఎంబాపె పెనాల్టీ గోల్‌తో గట్టెక్కించిన ఫ్రాన్స్.. వరుసగా నాలుగోసారి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ సాగిన తీరును ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
అమెరికాలోని ఫిలడెల్ఫియా వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ 2026 రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో దిగ్గజ ఫ్రాన్స్‌కు పరాగ్వే చుక్కలు చూపించింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో చివరికి ఎంబాపె మ్యాజిక్‌తో ఫ్రాన్స్ విజయం సాధించడంతో, ఆ దేశ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విజయంతో ఫ్రాన్స్ జట్టు ఫిఫా వరల్డ్ కప్‌లో వరుసగా నాలుగోసారి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. తదుపరి మ్యాచ్‌లో బలమైన మొరాకో సవాల్‌ను ఫ్రాన్స్ ఢీకొట్టబోతోంది.
పరాగ్వే ప్యూహం.. ఫ్రాన్స్ తిప్పలు!
ఫిఫా ప్రపంచ కప్ 2026 నాకౌట్ మ్యాచ్ ప్రారంభం నుంచే పరాగ్వే కట్టుదిట్టమైన రక్షణ ప్యూహంతో బరిలోకి దిగింది. డిఫెన్స్‌ను పటిష్టం చేసుకుంటూ ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్లకు అస్సలు చోటివ్వలేదు. ఫ్రాన్స్ జట్టు ఎక్కువ సమయం బంతిని తన ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ, పరాగ్వే రక్షణ వలయాన్ని ఛేదించలేకపోయింది. మ్యాచ్ మొదటి భాగంలో ఇరు జట్లు కనీసం ఒక్క షాట్‌ను కూడా గోల్ పోస్ట్ వైపు కొట్టలేకపోయాయంటే డిఫెన్స్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఫ్రాన్స్ ఆటగాళ్లు రాబియట్, కోన్, ఉస్మానే డెంబెలే గోల్స్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మరోవైపు పరాగ్వే తరఫున జూలియో ఎంసిసో ఒంటరి పోరాటం చేశాడు.
మ్యాచ్‌ను మార్చిన సబ్‌స్టిట్యూట్..
రెండో భాగంలో ఫ్రాన్స్ కోచ్ వ్యూహాత్మకంగా డెసిర్ డౌను మైదానంలోకి దించారు. డౌ రాకతో ఫ్రాన్స్ ఆటలో వేగం పెరిగింది. పరాగ్వే బాక్స్‌లోకి దూసుకెళ్తున్న డౌను ప్రత్యర్థి డిఫెండర్ ఫౌల్ చేయడంతో రెఫరీ వీఏఆర్ (వీడియో అసిస్టెంట్ రెఫరీ)ని ఆశ్రయించారు. సుదీర్ఘ పరిశీలన తర్వాత రెఫరీ ఫ్రాన్స్‌కు పెనాల్టీ కేటాయించారు.
ఒత్తిడి పెరిగిన 70వ నిమిషంలో పెనాల్టీని కిక్ చేయడానికి వచ్చిన స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపె, ఏమాత్రం తడబడకుండా బంతిని నెట్‌లోకి పంపాడు. దీనితో స్టేడియం అంతా ఒక్కసారిగా హోరెత్తింది. ఈ ఏకైక గోల్‌తో ఫ్రాన్స్ ఊపిరి పీల్చుకుంది.
మెస్సి రికార్డుకు చేరువగా ఎంబాపె..
ఈ గోల్‌తో ఎంబాపె వరల్డ్‌కప్‌లో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో 19 మ్యాచ్‌ల్లో 19 గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం అత్యధిక వరల్డ్‌కప్ గోల్స్ రికార్డు ఉన్న లియోనెల్ మెస్సి (20 గోల్స్) కంటే ఎంబాపె కేవలం ఒక్క గోల్ మాత్రమే వెనుకబడి ఉన్నాడు. అంతేకాదు, ప్రస్తుత టోర్నీలో 7 గోల్స్‌తో మెస్సి, ఎంబాపె ఇద్దరూ గోల్డెన్ బూట్ రేసులో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
మైదానంలో ముదిరిన ఘర్షణ!
మ్యాచ్ ఆఖరి నిమిషాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పరాగ్వే ఆటగాళ్లు ఎంబాపెను టార్గెట్ చేస్తూ ప్రవర్తించారు. ఆండ్రెస్ క్యూబాస్, ఎంబాపె మధ్య మాటల యుద్ధం కాస్తా తోపులాటకు దారితీసింది. ఇదే క్రమంలో పరాగ్వే ప్లేయర్ మటియాస్ గలార్జా తన మోచేత్తో ఎంబాపెను బలంగా నెట్టడంతో అతడు కిందపడిపోయాడు. మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు నెట్టుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఉష్ణోగ్రత సెగలు.. కీపర్ అద్భుత ప్రదర్శన
ఫిలడెల్ఫియాలో 38 డిగ్రీల సెల్సియస్ ఎండ తీవ్రత ఉండటంతో ఆటగాళ్లు తీవ్రంగా అలసిపోయారు. మ్యాచ్‌లో ఇచ్చిన హైడ్రేషన్ బ్రేకులు ప్లేయర్లకు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చాయి. జర్మనీని పెనాల్టీ షూటౌట్‌లో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు వచ్చిన పరాగ్వే, చివరి నిమిషం వరకు పోరాడింది. మ్యాచ్ 90వ నిమిషంలో పరాగ్వే కొట్టిన భీకర షాట్‌ను ఫ్రాన్స్ కీపర్ మైక్ మైగ్నన్ అద్భుతంగా అడ్డుకుని జట్టును గెలిపించాడు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


