Quote of the Day: జీవితం ఒక్కటే.. పావులు సరిగ్గా కదపాలి: ఫ్రాంక్ సినాత్రా సూక్తి

ప్రముఖ అమెరికన్ గాయకుడు, నటుడు ఫ్రాంక్ సినాత్రా చెప్పిన ఓ ప్రముఖ సూక్తి ఇప్పటికీ కోట్ల మందికి స్పూర్తినిస్తోంది. జీవితం నిడివి కంటే మనం తీసుకునే నిర్ణయాలే దాన్ని ప్రత్యేకంగా నిలుపుతాయని చెప్పే ఆ మాటల అంతరార్థంపై ప్రత్యేక కథనం.

Published on: Jul 29, 2026, 08:40:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జీవితం ఎంతకాలం సాగింది అనే దానికంటే, దాన్ని ఎంత అర్థవంతంగా గడిపామనేదే ముఖ్యం. ఇదే అంశాన్ని అమెరికాకు చెందిన దిగ్గజ గాయకుడు, నటుడు ఫ్రాంక్ సినాత్రా ఎంతో సులువైన పదాల్లో చెప్పారు.

జీవితం ఒక్కటే.. పావులు సరిగ్గా కదపాలి: ఫ్రాంక్ సినాత్రా సూక్తి
జీవితం ఒక్కటే.. పావులు సరిగ్గా కదపాలి: ఫ్రాంక్ సినాత్రా సూక్తి

"ఈ జీవితం ఒక్కసారే లభిస్తుంది, కానీ మనం సరిగ్గా పావులు కదిపితే ఆ ఒక్కసారి చాలు" అని ఫ్రాంక్ సినాత్రా పేర్కొన్నారు.

ఆయన చెప్పిన ఈ మాటలు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఎంతోమందిలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. మళ్లీ అవకాశం వస్తే బాగుణ్ణు అని గతాన్ని తలుచుకోవడం కంటే, చేతిలో ఉన్న ఒకే ఒక్క జీవితాన్ని సరైన నిర్ణయాలతో అందంగా తీర్చిదిద్దుకోవాలని ఈ సూక్తి ప్రభోధిస్తోంది.

'పావులు సరిగ్గా కదపడం' అంటే ఏమిటి?

'ప్లే యువర్ కార్డ్స్ రైట్' (Play your cards right) అనేది పేకాట నుంచి వచ్చిన నానుడి. మన చేతికి ఎలాంటి కార్డులు వచ్చాయనే దానికంటే, వాటిని ఎంత తెలివిగా వాడామనేదే విజయాన్ని నిర్ణయిస్తుంది. జీవితంలో కూడా మనకు లభించిన పరిస్థితులను ఎలా ఉపయోగించుకున్నాం, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాం అనేదే అసలైన విజయమని సినాత్రా స్పష్టం చేశారు.

సమాజంలో ధనం, హోదా లేదా ఆయుష్షు ఆధారంగా విజయాన్ని కొలుస్తారు. కానీ "నేను తృప్తిగా జీవించానా?" అని మనల్ని మనం ప్రశ్నించుకోవడమే అసలైన విజయం. చేసిన తప్పులనే తలుచుకుంటూ వర్తమానాన్ని పాడుచేసుకోకుండా, ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం, ఇతరులకు మేలు చేయడం, ఆశయాల వైపు అడుగులు వేయడమే నిజమైన జీవితం.

ఎవరు ఈ ఫ్రాంక్ సినాత్రా?

1915 డిసెంబర్ 12న న్యూజెర్సీలోని హోబోకెన్‌లో జన్మించిన సినాత్రా, సాధారణ నేపథ్యం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయి స్టార్‌గా ఎదిగారు. "ఆల్ బ్లూ ఐస్", "ది వాయిస్" గా ప్రసిద్ధి చెందిన ఆయన, ఆరు దశాబ్దాలకు పైగా వినోద ప్రపంచాన్ని ఏలారు. 'మై వే', 'ఫ్లై మీ టు ది మూన్', 'న్యూయార్క్, న్యూయార్క్', 'స్ట్రేంజర్స్ ఇన్ ది నైట్' వంటి ఎన్నో చిరస్మరణీయ పాటలను అందించారు.

సంగీతంతో పాటు నటుడిగానూ ప్రతిభ చాటారు. 1953లో వచ్చిన 'ఫ్రమ్ హియర్ టు ఎటర్నిటీ' చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డును అందుకున్నారు. డీన్ మార్టిన్, సామీ డేవిస్ జూనియర్ వంటి ప్రముఖులతో కలిసి 'రాట్ ప్యాక్' బృందంలో సందడి చేశారు. గ్రామీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్, ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు పొందారు. 1998 మే 14న తన 82వ ఏట ఆయన కన్నుమూశారు.

నేటి తరానికి ఈ మాటలు ఎందుకు అవసరం?

ఎప్పుడు చూడు ఇతరులతో పోల్చుకుంటూ, నిరంతరం అదనపు విజయాల వెనుక పరిగెత్తే నేటి జీవనశైలిలో సినాత్రా మాటలు ఒక కొత్త కోణాన్ని చూపిస్తాయి. ఫలితాల సంఖ్య కంటే అనుభవాల నాణ్యతకే ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తుచేస్తాయి.

కెరీర్, బంధాలు, వ్యక్తిగత ఎదుగుదల ఏదైనా సరే.. రోజువారీ నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఆత్మవిశ్వాసం, స్పష్టమైన లక్ష్యంతో జీవించే ఒక్క జీవితమైనా పరిపూర్ణమైన తృప్తిని ఇస్తుందనేదే సినాత్రా అందించిన అమూల్యమైన సందేశం.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More