Success story : రూ. 6లక్షల ప్యాకేజీ నుంచి రూ. 2కోట్ల వరకు- భారతీయ మహిళ సక్సెస్ స్టోరీ..
పూణెలోని ఒక సాధారణ టైర్-3 కాలేజీలో చదివి, ఏడాదికి రూ. 6 లక్షల జీతంతో కెరీర్ ప్రారంభించిన ఒక భారతీయ యువతి.. నేడు అమెరికాలో అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఆమె తన కెరీర్ ఎదుగుదల వెనుక ఉన్న ఐదు సూత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. వాటిని మీరూ చూసేయండి..
కష్టపడే తత్వంతో పాటు సరైన ప్రణాళిక ఉంటే జీవితంలో ఏ స్థాయికైనా చేరుకోవచ్చని నిరూపించింది ఒక భారతీయ యువతి! భారతదేశంలో ఒక సాధారణ జీతంతో కెరీర్ ప్రారంభించి, నేడు అమెరికాలో అత్యధిక వేతనంతో కూడిన ఉన్నత ఉద్యోగాన్ని సాధించిన దేవ్‌శ్రీ భరతియా తన విజయ ప్రయాణాన్ని ఇటీవలే సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనలాంటి యువత ఏళ్ల తరబడి ఇబ్బంది పడకుండా, తక్కువ సమయంలోనే కెరీర్‌లో ఎలా ఎదగాలో వివరిస్తూ ఆమె లింక్డ్‌ఇన్‌లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.

“నేను పూణెలోని ఒక సాధారణ టైర్-3 కాలేజీ నుంచి పట్టా పొందాను. ఏడాదికి కేవలం రూ. 6 లక్షల ప్యాకేజీతో నా ఉద్యోగ ప్రయాణం మొదలైంది. కానీ, నేను ఈ రోజు ఉన్న స్థానాన్ని నా ఊహల్లో కూడా ఎప్పుడూ ఊహించలేదు,” అని దేవ్‌శ్రీ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
మూడేళ్ల అనుభవ సారాంశం..
తాను సూచిస్తున్న ఈ పద్ధతులు రాత్రికి రాత్రే వచ్చినవి కావు, మూడేళ్ల పాటు తాను చేసిన ప్రయోగాలు, అనుభవాల నుంచి నేర్చుకున్నవని దేవ్‌శ్రీ తెలిపింది. “ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి నాకు మూడేళ్లు పట్టింది. కానీ, మీరు వీటిని కేవలం మూడు నెలల్లోనే మీ కెరీర్‌కు అప్లై చేసుకోవచ్చు,” అని ఆమె పేర్కొంది. ఉద్యోగాల కోసం కేవలం అప్లికేషన్లు పెట్టుకుంటూ కూర్చోవడం కంటే, రిక్రూటర్ల కళ్లలో పడటం (విజిబిలిటీ) అత్యంత ముఖ్యమైన అడుగు అని ఆమె అభిప్రాయపడింది.
రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించడం ఎలా?
ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడం ఎంత ముఖ్యమో, కంపెనీల రిక్రూటర్లు నేరుగా మనల్ని వెతుక్కుంటూ రావడం అంతే ముఖ్యమని దేవ్‌శ్రీ వివరించింది.
“లింక్డ్‌ఇన్‌లో వందలాది ఉద్యోగాలకు అప్లై చేయమని ప్రతి ఒక్కరూ చెబుతారు, అది ఖచ్చితంగా చేయాలి. కానీ, రిక్రూటర్లే స్వయంగా మిమ్మల్ని సంప్రదిస్తే.. మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి,” అని ఆమె స్పష్టం చేసింది. దీనికోసం లింక్డ్‌ఇన్‌లో రెగ్యులర్‌గా పోస్టులు పెడుతూ, ఇండస్ట్రీకి సంబంధించిన చర్చల్లో పాల్గొనడం ద్వారా మన ప్రొఫెషనల్ ఉనికిని చాటుకోవాలని సూచించింది.
నమ్మకాన్ని పెంచే ప్రొఫైల్..
లింక్డ్‌ఇన్ నుంచి ప్రయోజనం పొందడానికి పూర్తి స్థాయి కంటెంట్ క్రియేటర్‌గా మారాల్సిన అవసరం లేదని దేవ్‌శ్రీ స్పష్టం చేసింది. మన రంగానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని, అంతరార్థాలను క్రమం తప్పకుండా పంచుకుంటే సరిపోతుందని తెలిపింది. “మీరు ఒకే రోజు కూర్చుని నెల మొత్తానికి సరిపడా కంటెంట్‌ను షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇక్కడ మన లక్ష్యం ఫాలోవర్లను సంపాదించడం కాదు, మన రంగంలో మనకున్న నమ్మకాన్ని, పట్టును నిరూపించుకోవడం,” అని ఆమె రాసింది.
'ఘోస్ట్ జాబ్స్' పట్ల జాగ్రత్త!
ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి దేవ్‌శ్రీ ఒక ముఖ్యమైన హెచ్చరిక చేసింది. ఆన్‌లైన్‌లో ఖాళీలు ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, నిజానికి క్లోజ్ అయిపోయిన ఉద్యోగాలను 'ఘోస్ట్ జాబ్స్' అంటారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరింది.
“మీరు దరఖాస్తు చేసే ఉద్యోగాల్లో దాదాపు 30 శాతం ఘోస్ట్ జాబ్స్ ఉంటాయి,” అని దేవ్‌శ్రీ పేర్కొంది. చాలా మంది అభ్యర్థులు తమ అప్లికేషన్ రిజెక్ట్ అయిందని తప్పుగా అనుకుంటారని, కానీ నిజానికి ఆయా కంపెనీలు ఆ పొజిషన్ కోసం కొత్తగా ఎవరినీ చేర్చుకునే ఉద్దేశంలో ఉండరని ఆమె వివరించింది.
ఉద్యోగానికి తగ్గట్టు సీవీ మార్చండి..
కేవలం పాత పని అనుభవాన్ని మాత్రమే కాకుండా, మీ రెజ్యూమెను మరింత బలంగా మార్చుకోవాలని దేవ్‌శ్రీ సూచించింది. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో ఉన్నవారు తాము చేసిన ప్రాజెక్టులు, హాకథాన్‌లు, రీసెర్చ్ వర్క్‌లను అందులో చేర్చాలని కోరింది.
“అన్ని ఉద్యోగాలకు ఒకే రకమైన సాధారణ రెజ్యూమె పనికిరాదు. మీరు అప్లై చేసే జాబ్ డిస్క్రిప్షన్ తగినట్లుగా మీ రెజ్యూమెను మార్చుకోవాలి. ఏటీఎస్ సాఫ్ట్‌వేర్‌కు అనుకూలంగా ఉండేలా చూసుకోవడం, మంచి ఫార్మాటింగ్ పాటించడం వల్ల మీ ప్రొఫైల్ త్వరగా షార్ట్‌లిస్ట్ అవుతుంది,” అని దేవ్‌శ్రీ వివరించింది.
ఇంటర్వ్యూ ప్రిపరేషన్..
ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధమవ్వాలనే దానిపై కూడా ఆమె కొన్ని సూచనలు చేసింది. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, సిస్టమ్ డిజైన్, బిజినెస్ కేస్ ఆధారిత ప్రశ్నలపై పట్టు సాధించాలని చెప్పింది. అలాగే, మనం ఇంటర్వ్యూకి వెళ్లే కంపెనీ ఉత్పత్తులు, వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి బిజినెస్ మోడల్ గురించి ముందుగానే రీసెర్చ్ చేస్తే.. ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలకైనా సులభంగా సమాధానం చెప్పవచ్చని దేవ్‌శ్రీ భరతియా వివరించింది. ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తే యువ ప్రొఫెషనల్స్ తక్కువ సమయంలోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


