నాసిరకం, కల్తీ ఆహారంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ వేటు: రూ.81.8 కోట్ల విలువైన ఆహారం సీజ్.. 1100 లైసెన్సుల రద్దు
దేశవ్యాప్తంగా ఆహార భద్రతా అధికారులు చేపట్టిన భారీ తనిఖీల్లో రూ. 81.80 కోట్ల విలువైన కల్తీ, నాసిరకం ఆహార పదార్థాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ సీజ్ చేసింది. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు సాగిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో 1,100కి పైగా లైసెన్సులను సస్పెండ్ చేయడంతో పాటు 314 కేంద్రాలను సీల్ చేశారు.
పండగల సీజన్‌లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఉక్కుపాదం మోపింది. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు రెండు నెలల పాటు దేశవ్యాప్తంగా సాగిన ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌లో భారీ స్థాయిలో అక్రమాలను బయటపెట్టింది. నిబంధనలు ఉల్లంఘించిన తయారీదారులు, విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటూ సుమారు రూ. 81.80 కోట్ల విలువైన 3,270 మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

56 వేల కేంద్రాల్లో విస్తృత తనిఖీలు
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆహార భద్రతా అధికారులతో కలిసి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ మెగా డ్రైవ్‌ను నిర్వహించింది. ఈ కాలంలో ఏకంగా 56,431 ఆహార తయారీ, విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. నాణ్యతా లోపాలు ఉన్న 10,047 సంస్థలకు సవరణ నోటీసులు (ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు) జారీ చేశారు. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన 1,133 సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేయగా, 52 కేంద్రాల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేశారు.
314 షాపులకు సీల్.. 410 కేసులు నమోదు
పరిశుభ్రత లోపించడమే కాకుండా కల్తీకి పాల్పడుతున్న 314 వ్యాపార సంస్థలను అధికారులు తక్షణమే సీల్ చేశారు. చట్టపరమైన చర్యల్లో భాగంగా నిబంధనలు ధిక్కరించిన యాజమాన్యాలపై 410 కేసుల్లో ప్రాసిక్యూషన్ ప్రక్రియను ప్రారంభించారు.
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా అధికారులు మొత్తం 43,939 ఆహార నమూనాలను సేకరించగా, అందులో 23,648 నమూనాల విశ్లేషణ పూర్తయింది. ఈ ల్యాబ్ పరీక్షల్లో 2,273 ఆహార నమూనాలు నిబంధనలకు విరుద్ధంగా, ప్రామాణిక నాణ్యత లేనివిగా తేలడం గమనార్హం.
పాలు, నూనెలు, పండగ స్వీట్లలోనూ కల్తీ
సీజ్ చేసిన ఉత్పత్తుల్లో నిత్యం వాడే వంటనూనెలు, పాలు, పన్నీరు, నెయ్యితో పాటు పండగల వేళ ఎక్కువగా విక్రయించే మిఠాయిలు, బేకరీ వస్తువులు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు, నమ్‌కీన్, ప్యాకేజ్డ్ ఫుడ్, పండగ గిఫ్ట్ హ్యాంపర్లు భారీగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
"సురక్షితమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతోనే ఈ విస్తృత తనిఖీలు చేపట్టాం. ఆహార రంగంలో ప్రమాణాలను పక్కాగా అమలు చేసేందుకు రాష్ట్ర అధికారులతో కలిసి నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తాం" అని ఎఫ్ఎస్ఎస్ఏఐ 'ఎక్స్' వేదికగా తెలిపింది.
పండగల వేళ పటిష్ట పర్యవేక్షణ
పండగల సీజన్‌లో కల్తీ, నకిలీ, నాసిరకం ఆహార ఉత్పత్తుల విక్రయాలను అరికట్టాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగానే ప్రముఖ హోటళ్లు, ఈ-కామర్స్ సంస్థల విక్రయాలపైనా నిఘా పెంచింది. న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో గల 'ది లలిత్' హోటల్ నుండి సేకరించిన నెస్లే 'లో ఫ్యాట్ డైరీ వైటనర్' నమూనా సురక్షితం కాదని, ప్రామాణికంగా లేదని తేలడంతో గతంలో దాని విక్రయాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా రాబోయే రోజుల్లోనూ ఈ తనిఖీలను మరింత తీవ్రతరం చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


